శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం 2014 మే నెలలో అధికారంలోకి వచ్చే నాటికి కోట్లాది భారతీయులకు బ్యాంకు ఖాతా అన్నదే లేదు. బ్యాంకుల జాతీయీకరణ జరిగి దశాబ్దాలు దాటినా దేశంలోని లక్షలాది మంది ఆర్థిక సంఘటితానికి దూరంగానే ఉండిపోయారు.
అందరికీ ఆర్థిక సేవల హామీతో ఉద్యమ స్థాయిలో జన్ ధన్ యోజన ప్రారంభమైంది. ఆ తరువాత కేవలం రెండు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో 23.93 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. ఈ బ్యాంకు ఖాతాలలో 41,789 కోట్ల రూపాయలు జమ కావడం మరింత విశేషం. బ్యాంకు ఖాతాలు, వాటిలో పొదుపు మొత్తాల తోడ్పాటుతో లక్షలాది ప్రజల జీవితాలలో సుస్థిరత సాధ్యమైంది. అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారుల చేతిలో బందీలుగా ఉండిపోయిన లక్షలాది ప్రజల కోసం వ్యవస్థీకృత రుణ సదుపాయానికి ద్వారాలు తెరచుకొన్నాయి. జన్ ధన్ బ్యాంకు ఖాతాలలో జమ చేసిన మొత్తం కన్నా అధికంగా నగదు తీసుకోగల సదుపాయం, బీమా సౌకర్యం వంటి అదనపు వెసులుబాటులు ఉండడంతో ఈ ఖాతాలు విస్తృత వినియోగంలోకి వచ్చాయి. ఎటువంటి నగదు జమతో నిమిత్తం లేని ఖాతాలుగా జన్ ధన్ బ్యాంకు ఖాతాలపై మొదట్లో విమర్శలు వినిపించాయి. కానీ, మొత్తం బ్యాంకు ఖాతాలతో పోలిస్తే ఎటువంటి జమ లేని ఖాతాల సంఖ్య నిరంతరంగా తగ్గుతూ వస్తోంది. దీనిని బట్టి ప్రజలు అత్యధిక సంఖ్యలో ఈ బ్యాంకు ఖాతాలను వినియోగించుకొంటున్నట్లు స్పష్టమవుతోంది.
జన్ ధన్ ఖాతాలు తెరిచే ప్రక్రియ వేగవంతం కావడంతో ఎన్ డి ఎ ప్రభుత్వం తలపెట్టిన త్రిముఖ ప్రయోజన (జన్ ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం) ప్రణాళిక- ‘జెఎఎమ్’ సాకారం కావడం ప్రారంభమైంది. ఆధార్ నమోదును ప్రభుత్వం అత్యంత వేగిరం చేసింది. ఆ మేరకు 2014 మే 30వ తేదీ నాటికి 65 కోట్ల మంది ఆధార్ గుర్తింపును పొందగా, ప్రభుత్వం మరో 35 కోట్ల మేర కొత్తగా నమోదు చేయించింది. మొత్తంమీద నేడు 105 కోట్ల మంది భారతీయులు ఆధార్ కార్డు ను కలిగి ఉన్నారు. ఇక దాదాపు ప్రతి భారతీయుడికీ మొబైల్ ఫోన్ ఉంది. దీంతో ప్రభుత్వ రాయితీలు, ఇతరత్రా అధికారిక లబ్ధిని నేరుగా ఖాతాల్లోకి బదిలీ చేయగల వ్యవస్థ రూపొందింది. అర్హులైన వ్యక్తులను గుర్తించి దళారుల ప్రమేయం, ఆలస్యమనేవి లేకుండా వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ సాధ్యపడింది. దీనివల్ల లీకేజీలకు, దారిమళ్లింపులకు అడ్డుకట్ట పడి గడచిన రెండేళ్లలో ప్రజాధనం భారీగా ఆదా అయింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో 31 కోట్ల మంది లబ్ధిదారులకు 61.822 కోట్ల రూపాయల మేరకు నేరుగా లబ్ధి బదిలీ (డిబిటి) అయింది. డిబిటి కింద అనేక సంస్కరణ చర్యలు చేపట్టడంతో పాటు నకిలీ లబ్ధిదారులను నిరోధించడమే గాక లీకేజీలను అరికట్టడం ద్వారా 36,500 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.
దేశంలో సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయి. లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే గాక ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, వాటిలో కొన్నిటికి మాత్రమే వ్యవస్థీకృత ఆర్థిక సహాయం అందుతోందని, అధిక శాతం సంస్థలు రుణాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ చిన్నతరహా పారిశ్రామికవేత్తల కోసం ఎన్ డి ఎ ప్రభుత్వం ‘ముద్ర యోజన’ను ప్రవేశపెట్టింది. స్వల్ప వడ్డీకి, సహ పూచీకత్తుతో సంబంధం లేని ఆర్థిక సహాయం ద్వారా వారి ఆకాంక్షల సాధనకు ఇది సహాయపడుతుంది. ఈ పథకం కింద 2015-16లో 1,22,188 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్న లక్ష్యానికి మించి 1,32,954.73 కోట్ల రూపాయల మేర అందజేసింది. తద్వారా 3.48 కోట్ల మంది పారిశ్రామికవేత్తలు సహాయం అందుకున్నారు. వీరిలో 1.25 కోట్ల మంది కొత్తవారు కాగా, వారికి 58,908 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందింది. లబ్ధి పొందిన వారిలో 79 శాతం మహిళలు కాగా, వీరికి అందిన మొత్తం 63,190 కోట్ల రూపాయలు. ఈ నేపథ్యంలో 2016-17 సంవత్సర రుణ వితరణ లక్ష్యాన్ని 50 శాతం దాకా పెంచి, 1,80,000 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
పైన పేర్కొన్న చర్యలతో భారతీయుల జీవితాల్లో గణనీయ మార్పులు ప్రస్ఫుటమయ్యాయి. ప్రాథమిక సదుపాయాలైన బ్యాంకు ఖాతాలు లేకపోవడం నుండి బహుళ సౌకర్యాలతో ఖాతాలు తెరవడం, సహ పూచీకత్తుతో నిమిత్తం లేని, సులభ ఆర్థిక సహాయం పొందడం దాకా.. 2014 మే నెల నుండి పేద భారతీయుల కోసం చాలా మార్పులే చోటు చేసుకొన్నాయి. రాయితీలు, ప్రభుత్వ పరమైన లబ్ధి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస, దళారుల చేతిలో బందీలుగా ఉండాల్సిన దు:స్థితి తప్పాయి. డిబిటి, జెఎఎమ్ ల వల్ల సమర్థంగా, పారదర్శకంగా లబ్ధిని బదలాయించడం సులభసాధ్యమైంది.