ప్రపంచ దేశాలతో నిత్యచైతన్య సంబంధాలే తన విదేశాంగ విధానమని విశ్వసించిన భారత ప్రభుత్వం 2014 మే 26వ తేదీన అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆ మార్గాన్నే అనుసరిస్తోంది. అదే సమయంలో ‘‘రండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి’’ అని ప్రపంచాన్ని ఆహ్వానిస్తోంది. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రస్తుత మిత్ర దేశాలతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు అనేక ఇతర దేశాలకు వివిధ రంగాలలో సరికొత్త సహకార ద్వారాలు తెరిచింది.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ఆయన మంత్రిమండలి సభ్యులు 2014 మే 26వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి దృశ్యమిది... ప్రేక్షక సందోహం మధ్య ఆసీనులైనవారిలో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ-సార్క్ దేశాల అధినేతలందరూ ఉన్నారు. వీరిలో అధ్యక్షుడు శ్రీ కర్జాయ్ (అఫ్గానిస్తాన్), ప్రధాన మంత్రి శ్రీ టొబగే (భూటాన్), అధ్యక్షుడు శ్రీ యామీన్ (మాల్దీవ్స్), ప్రధాని శ్రీ కొయిరాలా (నేపాల్), ప్రధాని శ్రీ నవాజ్ షరీఫ్ (పాకిస్థాన్), అధ్యక్షుడు శ్రీ రాజపక్ష (శ్రీ లంక) ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జపాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉండడంతో ఆ దేశ పార్లమెంటు స్పీకర్ బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు.ప్రధాన మంత్రి విస్తృత ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్నారు
బలమైన ఎస్ ఎ ఎ ఆర్ సి (సార్క్) దిశగా శ్రీ మోదీ దృష్టికోణం, చిత్తశుద్ధి పలుమార్లు ప్రస్ఫుటమయ్యాయి.ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలి విదేశీ పర్యటన కోసం ఆయన భూటాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. దీంతోపాటు భారతదేశం, భూటాన్ ల మధ్య సహకార బలోపేతం లక్ష్యంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అలాగే 2014లో స్వతంత్ర ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా నేపాల్‌ను సందర్శించిన తొలి ప్రధాన మంత్రి ఆయనే. అక్కడ కూడా భారతదేశం, నేపాల్ సంబంధాల బలోపేతం దిశగా ముందడుగు పడింది. అటుపైన భారతదేశం, శ్రీ లంక ల సంబంధాల పటిష్ఠానికి 2015 మార్చి నెలలో ప్రధాన మంత్రి శ్రీ లంకలో పర్యటించాపర్యటించారు. శ్రీ లంక కొత్త అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ మైత్రీపాల సిరిసేన తొలిసారిగా 2015 జనవరిలో భారతదేశాన్ని సందర్శించిన ఓ నెల తరువాత ఈ పర్యటన సాగింది. ఆ తరువాత 2015 సెప్టెంబరులో శ్రీ లంక ప్రధాని శ్రీ రణిల్ విక్రమసింఘే కూడా భారత్‌లో పర్యటించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 జూన్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు చారిత్రక అద్భుతం ఆవిష్కృతమైంది. సరిహద్దు భూభాగాల అప్పగింత ఒప్పందాన్ని రెండు దేశాలూ ఆమోదించడమే ఆ సందర్భం. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య అనుసంధానతను పెంచేలా జెండా ఊపి బస్సు సేవలను ప్రారంభించారు. ఇక 2016 ఏప్రిల్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ యామీన్‌ను ప్రధాన మంత్రి మన దేశానికి ఆహ్వానించగా, రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై నాయకులిద్దరూ విస్తృతంగా చర్చించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ ప్రధాన మంత్రి అనేక కీలక శిఖరాగ్ర సదస్సులకు హాజరయ్యారు. ఫోర్ట్ లెజా (బ్రెజిల్)లో 2014 జూలైలో నిర్వహించిన బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్.. బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి పాల్గొన్నారు. కూటమి దేశాల కోసం భవిష్యత్ మార్గదర్శక ప్రణాళికను రూపొందించేందుకు బ్రిక్స్ దేశాల నాయకులు అక్కడ కలుసుకున్నారు. ఈ సమావేశాల్లో కీలక పరిణామం బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు కాగా, దాని తొలి అధ్యక్ష బాధ్యతల అవకాశం భారతదేశానికి దక్కడం విశేషం.
ప్రధాన మంత్రి 2014 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగానే ప్రపంచ ప్రగతికి భారతదేశం తన వంతుగా ఏయే మార్గాలలో చేయూత అందిస్తున్నదీ ప్రస్తావించడమే గాక భూగోళంపై శాంతి వెల్లివిరియాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ కోసం ఒక తేదీని ఎంపిక చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం 2014 డిసెంబరులో 177 దేశాలు ఒక్కటై ఏటా ‘జూన్ 21’ వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటిస్తూ తీర్మానించడంతో ఆ పిలుపు సాకారమైంది.
ఎన్ డి ఎ ప్రభుత్వ హయాంలో జి 20 (ఇరవై దేశాల కూటమి)తో సంబంధాలు బలోపేతమయ్యాయి. ఆస్ట్రేలియా (2014), టర్కీ (2015)లలో నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సదస్సులలో శ్రీ మోదీ పాల్గొన్నారు. బ్రిస్ బేన్‌లో జరిగిన జి 20 సమావేశం సందర్భంగా నల్లధనాన్ని వెనక్కు రప్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దీంతో పాటు నల్లధనం వల్ల అనర్థాలు, దాని మూలంగా తలెత్తే బెడదలను విశదీకరించారు. సదస్సులో చర్చల సమయంలో ఆయన ఈ చర్యలకు పిలుపునివ్వడం ఎంతో ముఖ్యమైనదేగాక ప్రభుత్వం ఈ అంశానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా స్పష్టం చేసింది.
ఆగ్నేయాసియా దేశాల కూటమి-ఎఎస్ఇఎఎన్ (ఆసియాన్)తో సంబంధాలకు అగ్ర ప్రాధాన్యమిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మయన్మార్ (2014), కౌలాలంపూర్ (2015)లలో నిర్వహించిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులలో పాల్గొని, ఆయా దేశాల అగ్ర నాయకులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కలుసుకున్న నాయకులంతా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై ఎంతో ఉత్సుకత చూపారు.
‘కాప్ 21’ (సిఒపి 21) పేరిట వాతావరణ మార్పులపై 2015 నవంబర్ లో పారిస్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల నాయకులతో ఆయన చర్చించారు. వాతావరణ న్యాయం గురించి ఈ సందర్భంగా నొక్కి చెప్పడంతో పాటు భవిష్యత్తరాల కోసం పరిశుభ్ర, హరిత ప్రపంచ సృష్టి ఆవశ్యకతను శ్రీ మోదీ వివరించారు. ప్రగతి, పర్యావరణం సమాంతరంగా సాగగలవన్న వాస్తవాన్ని విశదీకరిస్తూ భూగోళ పరిరక్షణ కోసం సామూహికంగా ఉద్యమించాల్సిన తరుణం ఇదేనని చాటారు. సూర్యకాంతి సమృద్ధ దేశాలనేకం భాగస్వాములైన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ)ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ హోలాండ్ సిఒపి 21 సదస్సులో భాగంగా ఆవిష్కరించారు. హరిత భూగోళ సృష్టికి చిత్తశుద్ధితో సాగే కృషిలో ఈ కూటమి ఒక అంతర్భాగం. అనంతరం 2016 మార్చి నెలలో అణు భద్రతపై శిఖరాగ్ర సదస్సుకు ప్రధాన మంత్రి హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒబామా నిర్వహించిన ఈ సదస్సులో అణు భద్రత, ప్రపంచ శాంతిపై ఆయనతో తన ఆలోచనలను పంచుకొన్నారు.
ప్రపంచంలోని ప్రతి ప్రాంతంపైనా శ్రీ మోదీ సునిశితంగా దృష్టి కేంద్రీకరించారు. ఆ మేరకు 2015 మార్చిలో సెశెల్స్, మారిషస్, శ్రీ లంక ల పర్యటనలో భాగంగా హిందూ మహాసముద్రంపై దృష్టి నిలిపారు. సెశెల్స్లో భారతదేశ సహకారంతో ఏర్పాటు చేసిన తీర ప్రాంత రాడార్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి ప్రారంభించారు. దీంతోపాటు భారతదేశం, మారిషస్ ల సహకారానికి నిదర్శనంగా నిర్మితమైన తీర గస్తీ నౌక ‘బారాకుడా’ సముద్ర ప్రవేశ వేడుక లోనూ ఆయన పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి 2015 ఏప్రిల్‌లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలలో పర్యటించారు. కెనడాతో పాటు ఐరోపా ఖండ దేశాలతో మెరుగైన సహకారం ఈ పర్యటన ప్రధానోద్దేశం. ఈ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌తో అణు శక్తి, రక్షణ రంగాలలో సహకారానికి గణనీయ ముందంజ సహా రికార్డు స్థాయిలో 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. జర్మనీలోని హనోవర్‌లో నిర్వహించే ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శనలో భారతదేశ ప్రాంగణాన్నిప్రధాన మంత్రి, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ లు సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే రైల్వేల ఆధునికీకరణపై ప్రత్యక్ష పరిశీలన దిశగా బెర్లిన్‌లోని రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి సందర్శించారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కూడా జర్మనీలో ఆయన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇక కెనడాలో ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక సహకారం ఆయన దృష్టికోణం లోని ప్రధానాంశాలు. భారత ప్రధాన మంత్రి స్వతంత్ర కెనడా పర్యటన గడచిన 42 ఏళ్లలో ఇదే తొలి సారి.
భారత్‌కు తూర్పునగల పొరుగుదేశాలతో సంబంధాల పటిష్ఠానికీ ప్రధాన మంత్రి ఎంతో కృషి చేశారు. అందులో భాగంగా 2014 ఆగస్టులో ఆయన జపాన్ పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. పారిశ్రామిక, సాంకేతిక రంగాలతో పాటు ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీస్ పథకానికి రెండు దేశాల మధ్య విస్తృత సహకారానికి ఒప్పందాలు కుదిరాయి. ఇక ప్రధాన మంత్రి 2015 మే నెలలో చైనాను సందర్శించిన సందర్భంగా జియాన్ నగరంలో ఆయనకు విశేష స్వాగతం లభించింది. చైనా రాజధాని బీజింగ్ కాకుండా మరొక చోట ఒక ప్రపంచ స్థాయి నాయకుడికి ఇంతటి ఘన స్వాగతం లభించడం అదే తొలి సారి. అలాగే మంగోలియాలోనూ పర్యటించడం ద్వారా ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాన మంత్రిగా చరిత్రకెక్కారు. ఆయన సందర్శించిన మరొక దేశం దక్షిణ కొరియా. అక్కడ అనేక అగ్రశ్రేణి పరిశ్రమల సిఇఒ లతో సమావేశం కావడంతో పాటు నౌకా నిర్మాణ కేంద్రాన్ని సందర్శించి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను కోరారు.
శ్రీ నరేంద్ర మోదీ 2015 జూలైలో మధ్య ఆసియాలోని ఐదు దేశాలుఉజ్ బెకిస్థాన్, కజక్‌స్థాన్, తుర్క్మెనిస్థాన్, తజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్ ల సందర్శనకు వెళ్లారు. ఈ దేశాలలో ఆయన పర్యటన మధ్య ఆసియా ప్రాంతంతో భారతదేశ సంబంధాలలో వినూత్న మార్పులకు దారితీసింది. ఇంధన, సాంస్కృతిక సంబంధాలతో పాటు లోతైన ఆర్థిక సహకారం, ఇతర అంశాల పైనా విస్తృత చర్చలు జరిగాయి.
పశ్చిమ ఆసియాతో చిరకాల సంబంధాలను ప్రధాన మంత్రి గుర్తించారు. ఆ మేరకు స్నేహబంధం పటిష్ఠానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా లో పర్యటించారు. దౌత్య సంబంధాలకు, ఆర్థిక సంబంధాలకు మరింత ఉత్తేజానికి బాట పరుస్తూ అగ్ర నాయకులను, వ్యాపారవేత్తలను కలుసుకొన్నారు. అలాగే ఎల్ & టి కార్మిక శిబిరాన్ని సందర్శించి, అక్కడ పనిచేస్తున్న వారితో కలిసి అల్పాహారాన్ని స్వీకరించి ఆశ్చర్యానందాలు కలిగించారు. వారి దృఢ సంకల్పాన్నీ, కష్టించి పనిచేస్తున్న తీరును ప్రశంసించారు. అంతకుముందు 2015 ఆగస్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో చరిత్రాత్మక పర్యటన సందర్భంగా అనేక రంగాల్లో సహకారంపై శ్రీ మోదీ అక్కడి నాయకులతో చర్చించారు.
భారతదేశం కూడా ప్రధానమైన పలువురు దేశాధినేతలకు స్వాగతం పలికింది. తొలుత 2014 జనవరిలో అమెరికా అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవాల కవాతుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తరువాత ప్రధాన మంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు శ్రీ ఒబామా సంయుక్తంగా రెండు దేశాల వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించడంతోపాటు వారితో విస్తృత చర్చల్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ టోనీ ఎబాట్ 2014 సెప్టెంబరులో భారతదేశం సందర్శనకు వచ్చారు. అదే నెలలో చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్‌పింగ్ కూడా పర్యటించారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆయనకు గుజరాత్లో స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు శ్రీ పుతిన్ 2014 డిసెంబర్ లో భారతదేశ పర్యటనకు రావడం కూడా ప్రాధాన్యం గల అంశం. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య అణు, వాణిజ్య సంబంధాలపై విస్తృత చర్చలు సాగాయి.
పసిఫిక్ ద్వీపదేశాలతోనూ శ్రీ మోదీ సంబంధాలు నెరపుతున్నారు. ఆ మేరకు 2014 నవంబరులో ఫిజీ పర్యటన సందర్భంగా పసిఫిక్ ద్వీపదేశాల నాయకులందరితోనూ ప్రధాన మంత్రి సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించడంతో పాటు ఈ ప్రాంతంతో భారత్ సంబంధాలు మెరుగుపరచుకోవడం గురించి సంభాషించారు. అదే ఏడాదిలో ఆఫ్రికా దేశాల నాయకులు న్యూ ఢిల్లీలో ఓ సదస్సుకు హాజరయ్యారు. గడచిన ఏడాది కాలంలో ప్రధాన మంత్రి అరబ్ నాయకులను కలుసుకున్నారు. ఈ ప్రాంతంతో భారత్‌కు విశిష్ట స్నేహ సంబంధాలున్నప్పటికీ అరబ్ ప్రపంచంతో భారత్ బంధం పటిష్ఠానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.
ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలలో వివిధ సమావేశాలు, సందర్శనలతో ఆయన కార్యక్రమ పట్టికలో ఎక్కడా ఖాళీ అన్నదే కనిపించదు. స్వదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు రాబట్టడంద్వారా భారత పరివర్తన ధ్యేయంగానే ఆ పట్టిక రూపుదిద్దుకొనేది. ఇంధనం, తయారీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలువంటి ఇతివృత్తాల తోనే ప్రతి పర్యటన ముడిపడి ఉండేది. కాబట్టే ఆయన ప్రతి పర్యటన భారతీయులు సంతోషించదగిన ఏదో ఒక కొత్త ప్రయోజనాన్నిదేశానికి సాధించిపెడుతూ వస్తోంది.