జపాన్-భారతదేశ పార్లమెంటు సభ్యుల మైత్రి సమితి (జపాన్- ఇండియా పార్లమెంటేరియన్స్ ఫ్రెండ్ షిప్ లీగ్.. జె ఐ పి ఎఫ్ ఎల్) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైంది.
ఈ ప్రతినిధి వర్గానికి శ్రీ హిరోయుకి హసోదా నాయకత్వం వహించారు. శ్రీ కత్సూయ ఒకదా, శ్రీ మసహరు నకగవా, శ్రీ నవోకజు తకెమొతొ, శ్రీ యొషియకి వదా లు కూడా ఈ ప్రతినిధి వర్గంలో సభ్యులుగా ఉన్నారు.
జమ్ము- కశ్మీర్ లోని ఉరీలో 2016 సెప్టెంబరు 18 నాడు సీమాంతర ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి జె ఐ పి ఎఫ్ ఎల్ ప్రతినిధి వర్గం తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.
ప్రపంచానికి కంటకభూతంగా పరిణమించిన ఉగ్రవాదంపై జరుపుతున్న పోరులో మరింత అంతర్జాతీయ సహకారం, ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న దేశాలను ఏకాకులను చేయడం కోసం సమన్వయంతో కూడిన ప్రయత్నాలు అవసరమని ప్రధాన మంత్రి పిలుపునివ్వడాన్ని జె ఐ పి ఎఫ్ ఎల్ ప్రతినిధి వర్గం స్వాగతించింది.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా 2014 లో తన జపాన్ పర్యటన విజయవంతం కావడాన్ని, టోక్యోలో జె ఐ పి ఎఫ్ ఎల్ తో చర్చాగోష్ఠిని గుర్తుకు తెచ్చుకున్నారు. రాబోయే దశాబ్దాలలో భారతదేశం, జపాన్ లు వివిధ రంగాలలో సహకారం బలోపేతానికి పునాదులు వేశాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
జపాన్, భారతదేశంల మధ్య సంబంధాల పటిష్ఠానికి జపాన్‌లో రెండు పక్షాల బలమైన మద్దతు ఉందని ఈ సందర్భంగా జె ఐ పి ఎఫ్ ఎల్ ప్రతినిధి వర్గం వివరించింది. అలాగే, ఉన్నత సాంకేతిక విజ్ఞానంలో, ప్రత్యేకించి హై స్పీడ్ రైల్వే రంగంలో సహకార పురోగతిని జె ఐ పి ఎఫ్ ఎల్ స్వాగతించింది.
జపాన్ ప్రధాని శ్రీ అబే 2015 లో జరిపిన భారతదేశ పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలలో చరిత్రాత్మకమైందంటూ ప్రధాన మంత్రి గుర్తుచేశారు. త్వరలోనే జపాన్ లో పర్యటించేందుకు తాను ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.