India & Israel are committed to advance our engagement on several fronts: Prime Minister
Our engagement is multi-dimensional and wide-ranging: PM Modi to President of Israel
Our economic initiatives, emphasis on innovation, research & technological development match well with Israel’s strengths & capacities: PM
Israeli companies can scale up their tie-ups with our schemes of Make in India, Digital India, Skill India, and Smart Cities: PM
President Rivlin and I deeply value our strong and growing partnership to secure our societies: Prime Minister Modi
India is grateful to Israel for its clear support to India’s permanent candidature in a reformed UN Security Council: PM Modi
శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ రియూవెన్ రివ్ లిన్‌
మరియు ప్రసార మాధ్యమాల స్నేహితులారా,

ఇజ్రాయిల్ అధ్య‌క్షుడు శ్రీ రియూవెన్ రివ్ లిన్‌ ను ఆయ‌న ప్ర‌తినిధి బృంద స‌భ్యుల‌ను ఆహ్వానించ‌డమ‌నేది నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాను. అధ్య‌క్షుడు శ్రీ రివ్ లిన్ మొట్టమొద‌టి సారిగా భార‌త‌దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం మాకు ఎంతో సంతోష‌దాయ‌కం. ఎక్స్ లెన్సీ, ఇరు దేశాల భాగ‌స్వామ్యం మ‌రింత దృఢంగా రూపొంద‌డానికి మేము చేస్తున్న కృషికి మీ ప‌ర్య‌ట‌న ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. గ‌త సంవ‌త్స‌రం మొద‌టిసారిగా భార‌త రాష్ట్ర‌ప‌తి ఇజ్రాయిల్ లో ప‌ర్య‌టించి ఇరు దేశాల సంబంధాలకు ఊపు తెచ్చారు. దానిని శ్రీ రివ్ లిన్ ప‌ర్య‌ట‌న‌ మ‌రింత ముందుకు తీసుకుపోతుంది. ఇరు దేశాల మ‌ధ్య‌ పూర్తి స్థాయిలో దౌత్య‌ సంబంధాలు ఏర్ప‌డి వ‌చ్చే సంవ‌త్స‌రం నాటికి 25 సంవ‌త్స‌రాల‌ు అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాలు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బోతున్నాయి. ఇరు దేశాల సంబంధాల విష‌యంలో ముఖ్య‌మైన ఈ అంశం కార‌ణంగా.. ప‌లు రంగాలలో రెండు దేశాలు క‌లిసి ప‌ని చేయ‌డానికి వీలుగా నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. రెండు దేశాల‌కు ఉమ్మ‌డిగా ఉన్న ప్రాధాన్య‌త‌లను, క‌లిసి ప‌ని చేయ‌డానికి వీలు ఉన్న అంశాలను రూపొందించుకొంటూనే ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌కు ప్రాధాన్య‌మిస్తూ ముందుకు సాగాలి.

స్నేహితులారా,

రెండు దేశాల క‌ల‌యిక బ‌హుళ కోణాల‌ను క‌లిగి ఉంది. అంతే కాదు, అది విస్తృత‌మైంది. మ‌నము ప‌లు విష‌యాలలో భాగ‌స్వామ్యం క‌లిగి ఉన్నాము. వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త‌ను, సామ‌ర్థ్యాన్ని పెంచ‌డం, ప‌రిశోధ‌న‌, నూత‌న అంశాల అన్వేష‌ణ‌లో మ‌రింత చురుగ్గా ప‌ని చేయ‌డం, ఇరు దేశాల స‌మాజాల‌కు ల‌బ్ధి క‌లిగేలా శాస్త్ర‌ సాంకేతిక ఫ‌లితాల‌ను అన్వ‌యించ‌డం, వాణిజ్య, పెట్టుబ‌డుల బంధాల‌ను బ‌లోపేతం చేయ‌డం, ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌ కోసం ర‌క్ష‌ణ బంధాల‌ను నిర్మించుకోవ‌డం, ఉన్న‌త‌మైన సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క బంధాల ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌ అనుబంధాల‌ను పెంచ‌డం, విద్యాప‌ర‌మైన అవ‌కాశాల‌ను ప్రోత్స‌హించ‌డం మనం చేయవలసిన ప‌నుల్లో కొన్ని. ఇజ్రాయిల్ కు వెళ్లి చదువుకొనే భార‌తీయ విద్యార్థుల సంఖ్య పెర‌గడం, అలాగే భార‌త‌దేశానికి వ‌చ్చి చ‌దువుకునే ఇజ్రాయిల్ విద్యార్థుల సంఖ్య పెర‌గ‌డం ఇరు దేశాల ద్వైపాక్షిక భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే ముఖ్య‌మైన అంశం.

స్నేహితులారా,

ఇరు దేశాల మ‌ధ్య‌ కొన‌సాగుతున్న స‌హ‌కారంలో ప‌లు ముఖ్య‌మైన అంశాలున్నాయ‌నే విష‌యాన్ని అధ్య‌క్షుడు శ్రీ రివ్ లిన్ కు, నాకు మ‌ధ్య‌ జ‌రిగిన చ‌ర్చ‌లలో ఇరువురమూ అంగీక‌రించ‌డం జ‌రిగింది. వ్య‌వ‌సాయ రంగంలోను, క‌ర‌వు ప్రాంతాల్లో సూక్ష్మ నీటి పారుద‌ల‌లోను, నీటి నిర్వ‌హ‌ణ‌లోను ఇజ్రాయిల్ చ‌క్క‌టి ప్ర‌గ‌తి సాధించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇరు దేశాలు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలలో నీటి నిర్వ‌హ‌ణ‌- సంర‌క్ష‌ణ‌, శాస్త్ర ప‌రిశోధ‌న‌- అభివృద్ధి.. ఈ రెండు రంగాలు ముఖ్య‌మైన‌విగా గుర్తించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం భార‌తీయ ఆర్ధిక‌ రంగం సాధిస్తున్న ప్ర‌గ‌తి మార్గం ఇజ్రాయిల్ దేశ కంపెనీల‌కు అనేక అవ‌కాశాల‌ను కల్పిస్తుంది. ఆర్ధిక‌ రంగంలో మేము తీసుకున్న నిర్ణ‌యాలు, త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాలు నూత‌న‌త్వంపైన‌, ప‌రిశోధ‌న‌పైన‌, సాంకేతికాభివృద్ధిపైన మేము తీసుకొంటున్న చొర‌వ అనేవి. ఇజ్రాయిల్ బ‌లాలు, సామ‌ర్థ్యాల‌కు స‌రిపోయేలా ఉన్నాయి. మేము మొద‌లుపెట్టిన మేక్ ఇన్ ఇండియా, డిజిట‌ల్ ఇండియా, స్కిల్ ఇండియా, మరియు స్మార్ట్ సిటీస్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క‌ కార్య‌క్ర‌మాల‌తో భాగం కావ‌డానికి ఇజ్రాయిల్ కంపెనీలు ఒప్పందాలు చేసుకోవ‌చ్చు. ఈ రంగాల‌లో ఇరు దేశాల మ‌ధ్య‌ వ్యాపార‌, పెట్టుబ‌డుల ప‌రంగా బంధాల‌ను నిర్మించుకోవ‌డానిగాను ఇది స‌రైన అవ‌కాశంగా భావించి ఉప‌యోగించుకోవ‌డంలో ఇరు దేశాల ప్రైవేటు రంగ సంస్థ‌ల‌ను మేము ప్రోత్స‌హిస్తున్నాము. ఉన్న‌త సాంకేతిక విజ్ఞాన సంబంధ త‌యారీ, సేవ‌ల రంగాలలో భార‌త‌దేశం, ఇజ్రాయిల్ కంపెనీలు క‌లిసి ప‌ని చేయ‌వ‌చ్చు. మేక్ ఇన్ ఇండియా మరియు అధ్యక్షుడు శ్రీ రివ్ లిన్ మా చర్చలో చెప్పినట్లు మేక్ విత్ ఇండియా కార్య‌క్ర‌మాల‌ ద్వారా ఇరు దేశాలలో ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంది. రెండు దేశాలు ల‌బ్ధి పొందుతాయి. ఐటీ రంగంలో ఇరు దేశాల భాగ‌స్వామ్య‌మ‌నేది ఇరు దేశాల ఆర్ధిక రంగానికి ఎంతో కీల‌కం.

స్నేహితులారా,

ఇరు దేశాల భ‌ద్ర‌త‌ కోసం నేను, అధ్య‌క్షుడు శ్రీ రివ్ లిన్ రెండు దేశాల మ‌ధ్య‌ పెరుగుతున్న, బ‌ల‌మైన భాగ‌స్వామ్యానికి ప్ర‌గాఢ‌మైన విలువ‌నిస్తున్నాము. ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం మ‌న రెండు దేశాల ప్ర‌జ‌ల‌ను నిరంత‌రం భ‌య‌కంపితుల‌ను చేస్తూనే ఉన్నాయి. ఉగ్ర‌వాద‌మ‌నేది ప్ర‌పంచానికి స‌వాలుగా మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దానికి ఎల్ల‌లు లేవు. ఇత‌ర రంగాల‌లో వ్య‌వ‌స్థీకృత‌మైన నేరాల‌తో అది సంబంధాల‌ను క‌లిగి ఉంది. ఉగ్ర‌వాదానికి పుట్టినిల్ల‌యిన దేశాల‌లో ఒకటి మా దుర‌దృష్ట‌వశాత్తూ మా పొరుగునే ఉంది. ప్ర‌పంచంలోని ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు, వాటికి స‌హాయం చేస్తున్న దేశాల‌కు వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ స‌మాజం ఒక్క‌టిగా నిలచి గ‌ట్టిగా పోరాటం చేయాల‌ని మా చ‌ర్చ‌లలో మేము భావించాము. ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం, వారి విష‌యంలో నిశ్శ‌బ్దంగా ఉండడం అంటే ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే. శాంతిని కోరుకొనే దేశాల‌ను భ‌య‌పెడుతూ క‌ల‌వ‌రం క‌లిగిస్తున్న ఉగ్ర‌వాద‌, తీవ్ర‌వాద సంస్థ‌ల‌కు వ్య‌తిరేకంగా ఇరు దేశాలు క‌లిసి చేస్తున్న పోరాటాన్ని మ‌రింత ముంద‌ుకు తీసుకుపోవాల‌ని ఇరువురమూ అంగీక‌రించాము. సైబ‌ర్‌ రంగంలో కార్యాచ‌ర‌ణ‌తో కూడిన ప్ర‌త్యేక ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ప్రాధాన్య‌మివ్వ‌డమైంది. ఇరు దేశాల మ‌ధ్య‌ పెరుగుతున్న‌ ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యం సామ‌ర్థ్యాన్ని గుర్తించాము. ఉత్ప‌త్తి, త‌యారీ భాగ‌స్వామ్యాల‌ ద్వారా దీన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని అంగీక‌రించాము. సంస్క‌ర‌ణ‌ల త‌రువాత ఏర్ప‌డే ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌త మండ‌లిలో భార‌త‌దేశానికి శాశ్వత స‌భ్య‌త్వం సాధించుకొనే విష‌యంలో ఇజ్రాయిల్ ఇచ్చిన స్ప‌ష్ట‌మైన మ‌ద్ద‌తుకు భార‌త‌దేశం అభినంద‌న‌లు తెలుపుతోంది.

స్నేహితులారా,

ప్ర‌జాస్వామ్య దేశాలైన మ‌న రెండు దేశాల‌కు మ‌న ప్ర‌జ‌లు ఎంతో బ‌లం. రెండు దేశాల భాగ‌స్వామ్యం బ‌లంగా ఉంటే ప్ర‌జ‌లే ఎక్కువ‌గా ల‌బ్ధి పొందుతారు. భార‌త‌దేశంలో రెండు వేల సంవ‌త్స‌రాలుగా యూదు ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నారు. త‌మ సంప్రదాయాల‌ను కాపాడుకుంటూ భార‌త‌దేశంలో నెలకొన్న విభిన్న‌మైన సంస్కృతిలో యూదులు ముఖ్య‌మైన భాగంగా ఉన్నారు. భార‌త‌దేశంలోని యూదు ప్ర‌జ‌లు మా దేశానికి ఎంతో గ‌ర్వ‌కార‌ణం. నేను, అధ్య‌క్షుడు శ్రీ రివ్ లిన్ ఇద్ద‌రం క‌లిసి ఇరు దేశాల ప్ర‌జ‌ల చరిత్రాత్మ‌క‌ బంధాల‌ను ప్రోత్స‌హించడానికి ప్రాధాన్య‌మివ్వాల‌ని అంగీక‌రించాము.

 


ఎక్స్‌లెన్సీ,

ఇరు దేశాల మ‌ధ్య‌ రెండున్న‌ర ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న స్నేహం రెండు దేశాల‌కు ఎంతో విలువైన మేలును చేస్తోంది. అంతే కాదు, ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాంతి, స్థిర‌త్వం, ప్ర‌జాస్వామ్యం కోసం జ‌రుగుతున్న కృషిని బ‌లోపేతం చేస్తోంది. మీ భార‌త‌దేశ సంద‌ర్శ‌న మ‌రిన్ని నూత‌న రంగాలలో ఇరు దేశాల మ‌ధ్య‌ భాగ‌స్వామ్యం ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. ఇరు దేశాల భాగ‌స్వామ్యంలోని నూత‌న కోణాల‌ను రూపొందిస్తుంది. ఇంత‌టితో ముగిస్తూ, మ‌రోసారి అధ్యక్షుడు శ్రీ రివ్ లిన్ కు హృద‌య‌పూర్వ‌క సాద‌ర‌ స్వాగ‌తం ప‌లుకుతున్నాను. ఆయ‌న భార‌త‌దేశ సంద‌ర్శ‌న ఉల్లాసంగా కొన‌సాగి ఫ‌ల‌ప్ర‌దం కావాల‌ని కోరుకుంటున్నాను.