ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వస్తువులు, సేవల పన్ను (జి ఎస్ టి) ని ప్రవేశపెట్టేందుకు సంబంధించి సన్నాహాలు ఎలా జరుగుతున్నదీ సమీక్షించడం కోసం 2016 సెప్టెంబరు 14న ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు ఇద్దరూ, ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం మరియు ఆర్థిక శాఖ కు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరు అయ్యారు.
జి ఎస్ టి ని 2017 ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలు పరచే విషయంలో ఎటువంటి జాప్యానికి తావు ఉండకుండా చూడడం కోసం జి ఎస్ టి ప్రారంభానికి సంబంధించి.. నమూనా జి ఎస్ టి చట్టాల మరియు నియమాల రూపకల్పన, కేంద్రం మరియు రాష్ట్రాలలో నెలకొల్పవలసిన ఐ టి మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు తగిన శిక్షణను ఇవ్వడం, వ్యాపార మరియు పరిశ్రమల రంగాలలో అవగాహనను కల్పించడం కోసం చేపట్టవలసిన కార్యక్రమాలు.. వంటి వాటి విషయంలో తీసుకోవలసిన వేరు వేరు చర్యలలో చోటు చేసుకొంటున్న పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. అన్ని సన్నాహక చర్యలను 2017 ఏప్రిల్ 1 వ తేదీ కన్నా ఎంతో ముందుగానే పూర్తి చేసి తీరాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. 279 ఎ అధికరణం ప్రకారం జి ఎస్ టి కౌన్సిల్ కు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి సకాలంలో సిఫారసులను అందించేందుకు అనువుగా కౌన్సిల్ ముమ్మర సమావేశాలను జరపవలసి ఉంటుందని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. నమూనా జిఎస్ టి చట్టాలు, జి ఎస్ టి రేట్లు, జిఎస్ టి వర్తించే లేదా జి ఎస్ టి నుండి మినహాయించే వస్తువులు మరియు సేవలకు సంబంధించి జి ఎస్ టి కౌన్సిల్ సిఫారసులు చేయవలసి ఉన్నది.