ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో టొయోటా ప్రెసిడెంట్ శ్రీ ఆకియో టొయోడా, సుజుకీ ఛైర్మన్ శ్రీ ఒ. సుజుకీ లు ఈ రోజు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా టొయోటా- సుజుకీ వ్యాపార భాగస్వామ్యం మరియు భవిష్యత్తులో చోటు చేసుకోగల సాంకేతిక విజ్ఞాన సంబంధ అభివృద్ధి చర్చకు వచ్చాయి. సాంకేతిక విజ్ఞానం మరియు తయారీలలో ప్రపంచ స్థాయిలో టొయోటాకు ఉన్న నాయకత్వాన్ని, చిన్నకార్ల తయారీలో.. మరీ ముఖ్యంగా భారత దేశంలో సుజుకీ కి ఉన్న శక్తిని ఈ భాగస్వామ్యం ఒక్కటి చేయగలదని భావిస్తున్నారు. ఇది నూతన సాంకేతిక విజ్ఞాన సంబంధమైన ఉన్నతిని భారతదేశం వినియోగించుకొనే వీలును కల్పించగలదని ఆశిస్తున్నారు. అంతేకాక, అధిక స్థాయిలో తయారీ ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమయ్యే విడి భాగాలను స్థానికంగా రూపొందించే అవకాశాలను ప్రసాదించగలదు.
అందువల్ల, ఈ భాగస్వామ్యం ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించగలదు. అలాగే ఉద్యోగ కల్పనకూ తోడ్పడగలదు. దీనితో పాటే కొత్త సాంకేతిక విజ్ఞానంతో రూపొందించిన కార్లు భారతదేశం నుండి ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా కల్పించగలదు.