Festivals are celebrations of life. With festivals comes a spirit of togetherness: PM
Pay my tribute to dear friend Sri Cho Ramaswamy on the 47th anniversary of Thuglak: PM
For 47 years Thuglak magazine played a stellar role in the cause of safeguarding democratic values and national interest: PM
If someone has to write the political history of India, he cannot write it without including Cho Ramaswamy: PM Modi
Cho's satire made his criticism loveable even to those he criticized: PM
Humour brings happiness in our lives. Humour is the best healer: PM Modi
The power of a smile or the power of laughter is more than the power of abuse: PM Modi
We need to build bridges between people, communities & societies: PM Modi

ప్రియమైన డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు,

శ్రీ ఎన్. రవి,

శ్రీ జి. విశ్వనాథన్,

శ్రీ ఎస్. రజనీకాంత్,

శ్రీ గురు మూర్తి,

తుగ్లక్ పాఠకులు,

కీర్తిశేషులు శ్రీ చో రామస్వామి ప్రశంసకులు,

మరియు తమిళ నాడు ప్రజలారా.

వణక్కం. ఇనియా పొంగల్ నల్ వాళ్తుకల్.

మనం చాలా మంగళప్రదమైన తరుణంలో భేటీ అవుతున్నాము.

నిన్న నా తెలుగు సోదరీమణులు, సోదరులూ భోగి పండుగను జరుపుకున్నారు.

ఉత్తర భారతదేశంలోని మిత్రులు, మరీ ముఖ్యంగా పంజాబ్ ప్రజలు లోహ్రి పర్వదినాన్ని జరుపుకున్నారు.

ఈ రోజు మకర సంక్రాంతి.

గుజరాత్ లో, ఈ రోజు ఆకాశం అంతా గాలిపటాలతో నిండిపోయి ఉంది. ఈ రోజు ఉత్తరాయణం గా కూడా ప్రసిద్ధి చెందింది.

అస్సాం ప్రజలు మాఘ్ బిహు ను జరుపుకుంటున్నారు.

ఇక తమిళ నాడులో, మీరు ఉన్న చోటున దీనినే పొంగల్ అని అంటున్నారు.

పొంగల్ కృతజ్ఞత భావనతో కూడిన పండుగ. సూర్య భగవానునికి కృతజ్ఞతలు తెలియజేయడం, వ్యవసాయానికి సహాయపడుతూ ఉన్న పశువులకు కృతజ్ఞతలు తెలియజేయడం, మనం మనుగడ సాగించగలిగేటట్లుగా సహజ వనరులను ప్రసాదిస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు చాటిచెప్పడం చేసే పర్వదినమిది.

ప్రకృతితో సామరస్యమే మన సంస్కృతిలోని, మన సంప్రదాయాలలోని బలంగా ఉంటోంది. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పశ్చిమం వరకు మనం పండుగ స్ఫూర్తి ఎలా దేశం అంతటా విస్తరించి ఉన్నదో చూడవచ్చు.

పండుగలు అంటేనే జీవనాన్ని ఉత్సవంగా జరుపుకోవడం కదా.

కలిసి జీవించాలనే స్ఫూర్తిని పండుగలు తమ వెంట తీసుకువస్తాయి.

అవి ఒక అందమైన ఏకత బంధాన్ని పెనవేస్తాయి.

ఈ పండుగలన్నింటి సందర్భంలో భారతదేశపు ప్రజలు అందరికీ నా అభినందనలు.

సూర్య గ్రహం మకర రాశిలోకి వచ్చి చేరే సమయాన్ని మకర సంక్రాంతి సూచిస్తుంది. చాలా మంది ప్రజలు- వణికించే చలి బారి నుండి బయటపడి వెచ్చనైన, కాంతివంతమైన రోజులలోకి అడుగుపెట్టే వేళగా మకర సంక్రాంతిని భావన చేస్తారు.

ఈ రోజు మనం జరుపుకుంటున్న పండుగల్లో కొన్ని పండుగలు పంట కోతల పండుగలు.

ఈ పండుగలు మన వ్యవసాయదారుల జీవితాలలో సమృద్ధిని, ప్రసన్నతను తీసుకొనిరావాలని మనం ప్రార్థిస్తాము. వారు మన దేశానికి అన్నం పెడుతున్నారు

 

స్నేహితులారా,

నేను మీ మధ్య ఉండాలని కోరుకున్నాను. అయితే, కార్యభారం కారణంగా అది వీలుపడలేదు. తుగ్లక్ పత్రిక 47వ వార్షికోత్సవ తరుణంలో నా ప్రియ నేస్తం శ్రీ చో రామస్వామికి నేను నా నివాళిని అర్పిస్తున్నాను.

శ్రీ చో కన్నుమూత తో, మనమందరం ఒక స్నేహితుడిని కోల్పోయాము. ఆయన తనకు ఎదురుపడిన వారందరికీ తన వెలకట్టలేని జ్ఞానాన్ని పంచి ఇచ్చారు.

గత నాలుగు దశాబ్దాలకు పైగా శ్రీ చో తో నాకు పరిచయం ఉంది. ఇది నాకు వ్యక్తిగతంగా వాటిల్లిన నష్టం.

నాకు పరిచయమున్న వ్యక్తులలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలురు అనదగిన వారిలో శ్రీ చో ఒకరు. ఆయన ఒక నటుడు, ఒక దర్శకుడు, ఒక పత్రికా రచయిత, ఒక సంపాదకుడు, ఒక రచయిత, ఒక నాటక రచయిత, ఒక రాజకీయ వేత్త, ఒక రాజకీయ వ్యాఖ్యాత, ఒక సాంస్కృతిక విమర్శకుడు, ఒక అత్యంత ప్రతిభ గల రచయిత, ఒక మతపరమైన, సామాజిక విమర్శకుడు, ఒక న్యాయవాది, ఇంకా అంతకు మించిన ప్రజ్ఞ సొంతమైన వ్యక్తి.

ఈ పాత్రలన్నింటినీ పోషించడంలోనూ తుగ్లక్ పత్రికకు సంపాదకునిగా ఆయన వహించిన భూమిక తలమానికంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య విలువలను, దేశ హితాన్ని పరిరక్షించడంలో తుగ్లక్ పత్రికది గత 47 సంవత్సరాలుగా అద్వితీయ పాత్ర.

తుగ్లక్ మరియు శ్రీ చో- వీటిలో ఒకటి లేకుండా మరొక దానిని ఊహించడం కష్టం. గత ఐదు దశాబ్దాలుగా ఆయన తుగ్లక్ పత్రిక అధిపతిగా ఉన్నారు. ఎవరైనా భారతదేశ రాజకీయ చరిత్రను లిఖించవలసి వస్తే – శ్రీ చో రామస్వామిని గురించి, ఆయన రాజకీయ వ్యాఖ్యలను గురించి ప్రస్తావించకుండా రాయలేరు. శ్రీ చో ను అభిమానించడం చాలా సులభం. అయితే శ్రీ చో ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఆయనను అర్థం చేసుకోవాలి అంటే, ముందుగా, ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, ఇతర వర్గాలకు అతీతమైన ఆయన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ఆయన జాతీయ భావాన్ని అర్థం చేసుకోవాలి.

అన్ని వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా తుగ్లక్ పత్రికను ఒక ఆయుధంగా తయారుచేయడమే ఆయన సాధించిన గొప్ప విజయం. ఒక పరిశుభ్రమైన, అవినీతి కి తావు లేని రాజకీయ విధానం కోసం ఆయన పోరాటం జరిపారు. ఆ పోరాటం లో ఎప్పుడూ ఎవరినీ ఆయన వదలిపెట్టిందే లేదు.

దశాబ్దాల తరబడి తనతో నటించిన వారిని గాని, దశాబ్దాల తరబడి తనతో స్నేహంగా ఉన్న వారిని గాని, ఆయనను వారి గురువుగా భావించిన వారిని గాని- ఎవ్వరిని కూడా ఆయన విమర్శించకుండా వదలివేయలేదు. ఆయన వ్యక్తులను చూసే వారు కాదు; కేవలం సమస్యలపై దృష్టి నిలిపే వారు.

ఆయన సందేశంలో కేంద్ర బిందువుగా దేశం ఉండేది. ఆయన రచనలలో, చలన చిత్రాలలో, నాటకాలలో, ఆయన దర్శకత్వం వహించిన బుల్లితెర ధారావాహికలలో, ఆయన చిత్రానువాదం రాసిపెట్టిన చలనచిత్రాలలో అదే భావం ప్రతిబింబించేది.

ఆయన వ్యక్తపరిచే వ్యంగ్యం, ఆయన విమర్శించిన వారికి సైతం ప్రియమైందిగా ఉండేది. ఇది నేర్చుకుంటేనో, ఎవరైనా నేర్పితేనో వచ్చేది కాదు. అది ఆయనకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. దానిని ఆయన కేవలం ప్రజల ప్రయోజనానికి ప్రయోగించే వారు. ఒక పుస్తకం లేదా కొన్ని సంకలనాలు వ్యక్తం చేయలేని ఆలోచనలను ఒక వ్యంగ్యచిత్రం ద్వారా లేదా ఒక వాక్యం ద్వారా తెలియజేయడం ఆయనకు మాత్రమే అబ్బింది.

శ్రీ చో వేసిన ఒక కార్టూన్ నాకు గుర్తుకు వస్తోంది. అందులో ప్రజలు వారి తుపాకులను నాకు గురిపెట్టి ఉంటారు. సామాన్య ప్రజలు నా ఎదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు శ్రీ చో అడుగుతున్నారు.. మీ నిజమైన లక్ష్యం ఎవరు? నేనా ? సామాన్య ప్రజలా ? అని. ప్రస్తుత పరిస్థితులకు ఈ కార్టూన్ ఎంత సమంజసంగా ఉందో!

శ్రీ చో కు సంబంధించి ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ఒక సారి కొంత మంది ప్రజలు శ్రీ చో పట్ల కోపంగా ఉండి, ఆయన పై గుడ్లు రువ్వుతున్నారు. అప్పడు ఆయన “అయ్యా! ఎందుకు నా మీద పచ్చి గుడ్లు విసరుతున్నారు? దీనికి బదులుగా మీరు నన్నే ఆమ్లెట్ గా చేసుకోవచ్చుగా!” అని అన్నారు. అప్పుడు వారు నవ్వడం మొదలుపెట్టారు. ఆ విధంగా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోగల అపురూపమైన సామర్థ్యం ఆయనకు ఉంది.

తుగ్లక్ అందరికీ ఒక వేదిక. తన అభిప్రాయాలకు విరుద్ధమైనవి, తనకు విరోధమైన వాటిని కూడా, అలాగే తనను దూషించిన వాటిని కూడా ఆయన తన స్వంత పత్రికలో ప్రచురించేవారు. తుగ్లక్ ఎవరినీ ఉపేక్షించదు అనే దానికి ఇదే నిదర్శనం. ఆయన ఎవరినైతే విమర్శించారో వారి అభిప్రాయాలకు కూడా తుగ్లక్ లో స్థానం కల్పించే వారు. ఇదే మీడియా లోనూ, ప్రజా జీవితం లోనూ నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి.

నా ఉద్దేశంలో అతని ఆలోచనలు, రచనలు తమిళ ప్రాంతానికో, తమిళ ప్రజలకో మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలోని వివిధ సమాజాలలో విస్తరించి ఉన్న వర్ధమాన పత్రికారచయితలకు, రాజకీయ నాయకులకు ఆయన తర తరాల తరబడి స్ఫూర్తి మూర్తిగా నిలుస్తారు. అది మనందరికీ
తుగ్లక్ పత్రిక కేవలం రాజకీయ వ్యాఖ్యలతో కూడినది కాదని మనందరికీ తెలుసు. ఇది కోట్లాది తమిళ ప్రజల చెవులుగా, కళ్ళుగా నిలచింది. తుగ్లక్ ద్వారా ప్రజలను, పాలకులను కలిపే సేతువుగా శ్రీ చో నిలచారు.

శ్రీ చో ఊహించిన విధంగా పత్రికారచన లక్ష్య సాధనలో తుగ్లక్ తన పయనాన్ని కొనసాగిస్తుందని నేను ఆనందపడుతున్నాను. ఎవరైతే తుగ్లక్ వారసత్వాన్ని కలిగి ఉన్నారో, వారు తమ భుజస్కంధాలపైన ఆ బాధ్యతను వహించవలసివుంటుంది. శ్రీ చో కు ఉన్న ముందుచూపు, ఆయనకు ఉన్న పట్టుదల అడుగుజాడలుగా స్వీకరించి ముందుకు సాగే వారికి ఇది ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. ఈ వ్యూహాన్ని ఆచరించడం ద్వారా వారు తమిళ నాడు రాష్ట్ర ప్రజలకు గొప్ప సేవ చేసినట్లు అవుతుంది.

ఈ విజయ సాధనలో శ్రీ గురుమూర్తికీ , అతని బృందానికీ ఈ పనిలో అత్యుత్తమ ఫలితం దక్కాలని నేను కోరుకుంటున్నాను. గురుమూర్తి గారిని గురించి తెలిసిన వ్యక్తిగా ఆయన విజయం సాధించగలుగుతారని నేను నమ్ముతున్నాను.

వ్యంగ్యంలో, హాస్యంలో శ్రీ చో రాటుతేలిన వ్యక్తి అనడంలో అతిశయోక్తి లేదు.

మనకు మరింత వ్యంగ్యమూ, హాస్యమూ అవసరమని నేను అనుకుంటున్నాను. హాస్యం మన జీవితాలలో సంతోషాన్ని కొనితెస్తుంది. హాస్యం మంచిగా మన బాధలను నయం చేస్తుంది.

చిరునవ్వు లేదా నవ్వు యొక్క శక్తి చాలా బలమైనటువంటిది. అది దుర్భాషలాడడం కంటే లేదా ఇతర ఆయుధం కంటే శక్తిమంతమైంది. నవ్వు విడదీయడానికి బదులు అనుసంధాన కర్తగా పనిచేస్తుంది.

వాస్తవానికి – బంధానికి పెంపొందించడానికి – ఇదే ఇప్పుడు మనకు కావలసింది. ఇది – ప్రజల మధ్య, మతాల మధ్య, సమాజాల మధ్య బంధాలను పెంపొందిస్తుంది.

హాస్యం మనిషి లోపలి సృజనాత్మకతను వెలికితీస్తుంది. మనం ఇప్పుడు ఒక ప్రసంగం, లేదా ఒక ఘటన బహుళ ప్రతిస్పందనలను సృష్టించగల కాలంలో నివసిస్తున్నాము.

స్నేహితులారా,

నేను ఇదివరకు చెన్నై లో జరిగిన తుగ్లక్ పాఠకుల వార్షిక సమావేశంలో స్వయంగా పాలుపంచుకున్నాను.

ఈ కార్యక్రమంలో శ్రీమద్భగవద్గీత లోని శ్లోకాలను శ్రీ చో కంఠస్వరంలో వినిపించే మీ ఆనవాయితీకి అనుగుణంగా, ఈ ప్రసంగాన్ని శ్రీ చో గౌరవార్థం ఒక శ్లోక పఠనంతో నన్ను ముగించనివ్వండి:

“ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ | ”

(ఆత్మ ఒక చోటు నుండి మరొక చోటుకు తరలివెళ్లదు, గాని ఒక శరీరంలో నుండి మరొక దేహం లోనికి మారుతుంది )

ఆయన స్పృశించిన పలు రంగాలలో ఆయన చేసిన కృషికి మనందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలను తెలియజేద్దాము. అన్నింటి కంటే మిన్నగా ఆయన ఘనుడైన శ్రీ చో రామస్వామిగా- ఒకే ఒక్కడుగా- నిలచినందుకు మనందరం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దాము.