Inauguration of India International Exchange is a momentous occasion for India’s financial sector: PM
Indians are now at the forefront of Information Technology and Finance, both areas of knowledge where zero plays a crucial role: PM
India is in an excellent time-zone between West & East. It can provide financial services through day & night to the entire world: PM
IFSC aims to provide onshore talent with an offshore technological and regulatory framework: PM Modi
Gift city should become the price setter for at least a few of the largest traded instruments in the world: PM

భార‌తదేశానికి చెందిన ఒకటో అంత‌ర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజి అయిన. ఇండియా ఇంట‌ర్ నేష‌న‌ల్ ఎక్స్చేంజిని ప్రారంభించేందుకు గిఫ్ట్ సిటీకి రావ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా, భార‌తదేశ ఆర్థిక రంగానికి ఇది చిర‌స్మ‌ర‌ణీయ మైన సంఘ‌ట‌న.

2007 సంవ‌త్స‌రంలో ఈ ప్రాజెక్టు ఆలోచ‌న రూపం పోసుకుందన్నది మీ అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. భార‌త‌దేశానికే కాకుండా ప్ర‌పంచం యావత్తు ప్రపంచానికి సేవ‌లు అందించ‌గ‌ల ప్ర‌పంచ శ్రేణి ఫైనాన్స్, ఐటి జోన్ నుఏర్పాటు చేయాల‌న్న‌ది ల‌క్ష్యం.

ఇప్ప‌టి వ‌లెనే ఆ రోజుల్లో కూడా నేను ఎక్క‌డ‌కి వెళ్ళినా ఆ దేశాల్లోని ఆర్థిక రంగానికి చెందిన అత్యున్న‌త మేధావుల‌తో స‌మావేశ‌మ‌య్యే వాడిని. న్యూ యార్క్, లండ‌న్, సింగ‌పూర్, హాంకాంగ్, అబు ధాబీ.. ఎక్క‌డ‌కు వెళ్ళినా నేను క‌లిసిన మేధావుల్లో చాలా మంది భార‌తీయ‌ సంత‌తి వారేన‌ని గుర్తించాను. ఆర్థిక ప్ర‌పంచం ప‌ట్ల వారికి గ‌ల అవ‌గాహ‌న‌కు, వారిని ద‌త్త‌త తీసుకున్న దేశాల‌కు వారు చేస్తున్న సేవ‌ల‌కు నేను ముగ్ధుడ‌న‌య్యాను.

“ఈ ప్ర‌తిభ అంత‌టినీ వెన‌క్కి తీసుకురావ‌డం ఎలా ? మొత్తం ఆర్థిక ప్ర‌పంచానికే నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల స్థితికి చేర‌డం ఎలా ? ” అని నేను ఆలోచించే వాడిని.

భార‌తీయుల‌కు గ‌ణితంలో సుదీర్ఘ‌మైన సంప్ర‌దాయం ఉంది. 2000 సంవ‌త్స‌రాల క‌న్నా పూర్వ‌మే “జీరో” కాన్సెప్ట్ ను, “డెసిమ‌ల్ సిస్ట‌మ్”ను క‌నుగొన్న దేశం మ‌న‌ది. సున్నా (జీరో) కీల‌క పాత్ర పోషించే మేధోసంప‌త్తికి కేంద్ర‌మైన సమాచార సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక రంగాలు రెండింటి లోనూ భార‌తీయులు ముందువ‌రుస‌లో ఉండ‌డం యాదృచ్ఛికం ఏమీ కాదు!

గిఫ్ట్ సిటీ ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నాను. సాంకేతిక పురోగ‌తి కొన్ని రెట్లు వేగం అందుకుంది. భార‌తదేశం లోను, విదేశాల లోను ప‌ని చేస్తున్న భార‌తీయ సంత‌తికి చెందిన ప్ర‌పంచ శ్రేణి ప్ర‌తిభావంతులు మ‌న‌కు ఉన్నారు. సాంకేతిక విజ్ఞాన రంగం, ఆర్థిక రంగం మ‌రింత‌గా పెన‌వేసుకుపోయాయి. ఆర్థిక రంగాన్ని సాంకేతిక ప‌రిజ్ఞానంతో మిళితం చేయ‌డం, లేదా కొన్ని సంద‌ర్భాలలో విస్తృతంగా మ‌నం ఉప‌యోగిస్తున్న “ఫిన్ టెక్” భార‌త భ‌విష్య‌త్తు అభివృద్ధికి మూలంగా ఉంటుంద‌న్న విష‌యం మ‌రింత స్ప‌ష్టం అయిపోయింది.

భార‌తదేశాన్ని ఆర్థిక రంగంలో ఆలోచ‌న‌లు రేకెత్తించ‌గ‌ల నాయ‌క‌త్వ దేశంగా అభివృద్ధి చేయ‌డం ఎలా అనే విష‌యం నిపుణుల‌తో చ‌ర్చించే వాడిని. మ‌న‌కు అత్యుత్త‌మ స‌దుపాయాలు, ప్ర‌పంచంలోని అన్ని మార్కెట్ లతో లావాదేవీలను నిర్వ‌హించ‌గ‌ల సామ‌ర్థ్యం అవ‌స‌ర‌మ‌ని తేలింది. ఆ ఆలోచ‌న‌ల నుండి ఉద్భ‌వించిందే గిఫ్ట్ సిటీ. ఫైనాన్స్, టెక్నాల‌జీ రంగాలలోని ప్ర‌పంచ శ్రేణి ప్ర‌తిభావంతుల‌కు అంత‌ర్జాతీయ శ్రేణి వ‌స‌తులను క‌ల్పించడం మా ల‌క్ష్యం. ఈ ఎక్స్ఛేంజి ని ప్రారంభించ‌డం ద్వారా మా ఆలోచ‌న‌ను కార్య‌రూపంలోకి తెచ్చే ప్ర‌య‌త్నంలో ఒక కీల‌క‌మైన మైలురాయిని చేరాం.

 

ఒక పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డానికి 2013 జూన్ లో నేను బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిని సంద‌ర్శించాను. అప్పుడే ప్ర‌పంచం అంత‌టికీ త‌ల‌మానికం అయిన ఇంట‌ర్ నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజి ని ఏర్పాటు చేసేందుకు ముందు రావాల‌ని బిఎస్ఇ ని ఆహ్వానించాను. 2015 సంవ‌త్స‌రంలో వైబ్రంట్ గుజ‌రాత్ స‌ద‌స్సు సంద‌ర్భంగా గుజ‌రాత్ ప్ర‌భుత్వంతో ఒక ఎంఒయు పై వారు సంత‌కాలు చేశారు. కొత్త ఇండియా ఇంట‌ర్ నేష‌న‌ల్ ఎక్స్చేంజి ని ప్రారంభించేందుకు నేను ఈ రోజు ఇక్క‌డ‌కు రావ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది గిఫ్ట్ సిటీకే కాదు, 21వ శ‌తాబ్ది మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో ఒక కీల‌క‌మైన మైలురాయి.

తొలి ద‌శ‌లో ఈక్విటీలు, క‌మోడిటీలు, క‌రెన్సీలు, ఇంట‌రెస్ట్ రేట్ డెరివేటివ్స్ లో ఈ ఎక్స్చేంజిలో ట్రేడింగ్ జ‌రుగుతుంద‌ని నాకు చెప్పారు. ఆ త‌దుప‌రి ద‌శ‌లో భార‌తీయ‌, విదేశీ కంపెనీల ఈక్విటీ ఉప‌క‌ర‌ణాల్లో కూడా ట్రేడింగ్ జ‌రుగ‌నుంది. అంతే కాదు, ఇక్క‌డ మ‌సాలా బాండ్ల ట్రేడింగ్ జ‌రుగుతుంద‌ని నాకు చెప్పారు. ఈ ప్ర‌ధాన అంత‌ర్జాతీయ ఆర్థిక కేంద్రం ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూర‌ప్ కు చెందిన సంస్థ‌లు కూడా నిధులు స‌మీక‌రించుకోగ‌లుగుతాయి. అధునాత‌మైన ట్రేడింగ్, క్లియ‌రింగ్, సెటిల్ మెంట్ వ్య‌వ‌స్థ‌ల‌తో ప్ర‌పంచంలోనే త్వ‌రిత‌మైన ఎక్స్ ఛేంజిలలో ఒక‌టిగా ఇది నిలుస్తుంది. ప్రాచ్య‌, పాశ్చాత్య ప్రాంతాల మ‌ధ్య అద్భుత‌మైన టైమ్ జోన్ లో భార‌తదేశం ఉంది. యావ‌త్ ప్ర‌పంచానికి ప‌గ‌లు, రాత్రి వేళ‌లు రెండింటిలోనూ ఆర్థిక సేవలు అందించ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. ఈ ఎక్స్చేంజి 24 గంట‌లూ ప‌ని చేస్తుంద‌ని, జ‌పాన్ మార్కెట్ లు ప్రారంభ‌మైన స‌మ‌యంలో మొద‌లై అమెరిక‌న్ మార్కెట్ లు ముగిసే స‌మ‌యానికి ట్రేడింగ్ కార్య‌క‌లాపాలు ముగుస్తాయ‌ని నాకు చెప్పారు. అన్ని టైమ్ జోన్ లలోనూ స‌ర్వీసుల నాణ్య‌త‌, లావాదేవీల వేగం విష‌యంలో ఈ ఎక్స్చేంజి కొత్త ప్ర‌మాణాలు నెల‌కొల్పుతుంద‌న‌డంలో నాకెలాంటి సందేహం లేదు.

గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్న అంత‌ర్జాతీయ ఆర్థిక స‌ర్వీసుల కేంద్రంలో (ఐఎఫ్ ఎస్‌సి) ఈ ఎక్స్చేంజి ఒక‌టి. ఇండియా ఇంట‌ర్ నేష‌న‌ల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ సెంట‌ర్ ఏర్పాటు చేసే కాన్సెప్ట్ తేలికైన‌దే కాదు, అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. సాగ‌ర‌ తీరాల‌కు ఆవ‌లి సాంకేతిక ప‌రిజ్ఞానం, నియంత్ర‌ణ యంత్రాంగాల‌కు అనుగుణంగా ఈ భూమిపై ఉన్న‌ప్ర‌తిభావంతుల‌తో సేవ‌లందించే వేదిక ఇది. విదేశీ ఆర్థిక కేంద్రాల‌తో స‌మానంగా భార‌తీయ సంస్థ‌లు పోటీ ప‌డే వాతావ‌ర‌ణం క‌ల్పించ‌గ‌లుగుతుంది. ప్ర‌పంచంలోని ఏ ఇత‌ర ఆర్థిక కేంద్రం అందిస్తున్న‌సేవ‌లతో అయినా స‌రిపోల్చ‌ద‌గిన స‌దుపాయాలు, నియంత్ర‌ణ‌లు గిఫ్ట్ సిటీ ఐఎఫ్ ఎస్‌సి అందిస్తుంది.

భారీ దేశీయ మార్కెట్ క‌లిగి ఉన్న భార‌తదేశం వంటి అతి పెద్ద దేశంలో విదేశాల్లో త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డం అంటే అంత తేలిక కాదు. చిన్న న‌గ‌రాల ప‌రిమాణం గ‌ల దేశాల‌తో భార‌తదేశాన్ని పోల్చ‌లేము. అలాంటి దేశాలవి చిన్న స్థానిక మార్కెట్లు కాబ‌ట్టి వాటికే అనుకూల‌మైన ప్ర‌త్యేక‌త గ‌ల ప‌న్ను, నియంత్ర‌ణ విధానాలు అమ‌లు చేయ‌గ‌లుగుతాయి. పెద్ద దేశాలు వాటిని అమ‌లుపరచడం సాధ్యం కాదు. భార‌తదేశం వంటి దేశంలో విదేశాలలోని ఆర్థిక కేంద్రాల‌కు దీటైన ఆర్థిక కేంద్రం ఏర్పాటు చేయ‌డంలో నియంత్ర‌ణసంబంధమైన స‌వాళ్లు ఎదుర‌వుతాయి. అలాంటి నియంత్ర‌ణప‌ర‌మైన స‌వాళ్ళ‌న్నింటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ‌, ఆర్ బిఐ, సెబి చ‌క్క‌టి ప‌రిష్కారాలను క‌నుగొన‌డం నాకు చాలా ఆనందంగా ఉంది.

భార‌త ఆర్థిక సాధ‌నాల‌తో స‌హా అతి పెద్ద ప‌రిమాణంలో ట్రేడింగ్ విదేశీ కేంద్రాల నుంచే జ‌రుగుతున్న‌ద‌న్న విమ‌ర్శ ప్ర‌స్తుతం ఉంది. చివ‌రకు చిన్న ఆర్థిక ఉప‌క‌ర‌ణాల‌కు కూడా భార‌తదేశం ధ‌రను నిర్ణ‌యించ‌డం మానుకున్న‌ద‌ని కూడా అంటున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌న్నింటికీ గిఫ్ట్ సిటీ స‌రైన ప‌రిష్కారాలు అందించ‌గ‌లుగుతుంది. కాని గిఫ్ట్ సిటీకి సంబంధించిన ఆ ఆలోచ‌న అతి పెద్ద‌ది. క‌మోడిటీలు, క‌రెన్సీలు, ఈక్విటీలు, ఇంట‌రెస్ట్ రేట్లు.. స‌హా ప‌లు ర‌కాల ఆర్థిక ఉప‌క‌ర‌ణాల్లో క‌నీసం కొన్నింటికైనా రానున్న ప‌దేళ్ళ కాలంలో గిఫ్ట్ సిటీ ధ‌ర‌లు నిర్ణ‌యించ‌గ‌ల‌గాల‌న్న‌ది నా విజ‌న్.

వ‌చ్చే 20 సంవ‌త్స‌రాల కాలంలో భార‌తదేశంలో క‌నీసం 30 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన అవ‌స‌రం ఉంది. అది చాలా పెద్ద ప్ర‌య‌త్న‌మే. సేవ‌ల రంగంలో ఆక‌ర్ష‌ణీయ‌మైన వేత‌నాలు అందించే నైపుణ్యాల‌కు పెద్ద‌ పీట వేసే ఉద్యోగాల క‌ల్ప‌న ఈ విప్ల‌వంలో ఒక భాగం. మ‌న భార‌తీయ యువ‌తీయువకులు అది సాధించ‌గ‌ల‌రు. గిఫ్ట్ సిటీ ద్వారా భార‌తీయ యువ‌త‌కు అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ల‌పై ఏర్ప‌డే అవ‌గాహ‌నతో మ‌రింత ఎక్కువ మంది ఈ ప్ర‌ధాన‌మైన రంగంలో చేర‌గ‌లుగుతారు. ప్ర‌పంచం మొత్తాన్ని జ‌యించ‌గ‌ల‌, అనుభ‌వ‌జ్ఞులైన ఆర్థిక వృత్తి నిపుణుల‌ను త‌యారుచేసేందుకు చేయి క‌ల‌పాల‌ని భార‌తదేశ కంపెనీలను, ఎక్స్చేంజిలను, నియంత్రణ సంస్థలను నేను కోరుతున్నాను. వారు ఈ కొత్త న‌గ‌రం నుండే కార్య‌క‌లాపాలను నిర్వ‌హిస్తూ ప్ర‌పంచం అంత‌టికీ సేవ‌లు అందించ‌గ‌లుగుతారు. రానున్న ప‌దేళ్ళ కాలంలో ఈ సిటీ ల‌క్ష‌లాది ఉద్యోగాలు క‌ల్పించ‌గ‌లుగుతుంద‌ని నేను ఆశిస్తున్నాను.

స్మార్ట్ సిటీల‌కు నేను ఇస్తున్న ప్రాధాన్య‌ం మీ అంద‌రికీ తెలుసు. దేశంలో అస‌లు సిస‌లు స్మార్ట్ సిటీకి తొలి రూపం ఈ గిఫ్ట్ సిటీ. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ న‌గ‌రాల‌తో పోటీ ప‌డ‌గ‌లిగే భూగ‌ర్భ మౌలిక వ‌స‌తులు ఎలా ఏర్పాటు చేయాల‌న్న‌ది గిఫ్ట్ సిటీ నుండి దేశంలో ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టిన 100 స్మార్ట్ సిటీలు నేర్చుకోగ‌లుగుతాయి. ఒక్క త‌రంలోనే భార‌తదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార‌గ‌ల‌ద‌ని నేను ఇంత‌కు ముందే చెప్పాను. మ‌నంద‌రి క‌ల‌ల‌కు ప్ర‌తిరూపం అయిన‌

– ఒక దృఢ‌విశ్వాసంతో కూడిన ఇండియా

– ఒక సుసంప‌న్న ఇండియా

– ఒక స‌మ్మిళిత ఇండియా

– మ‌న‌ ఇండియా

అవ‌త‌ర‌ణ‌లోఈ కొత్త న‌గ‌రాలు కీల‌కంగా నిలుస్తాయి.

ఇండియా ఇంట‌ర్ నేష‌న‌ల్ ఎక్స్చేంజిని ప్రారంభిస్తున్న‌ట్టు నేను ప్ర‌క‌టిస్తున్నాను. గిఫ్ట్ సిటీకి, ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ ఎక్స్చేంజికి ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్తు ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.