PM Modi, PM Key recognize need for greater economic engagement to effectively respond to growing uncertainties in global economy
Food processing, dairy, agriculture & related areas in their supply chain are areas of particular potential for Ind-NZ cooperation: PM
India and New Zealand agree to work closely towards an early conclusion of balanced & mutually beneficial CECA
Ind-NZ to strengthen security & intelligence cooperation against terror & radicalization including in cyber security
Thankful for New Zealand’s support to India joining a reformed UN Security Council as a permanent member: PM Modi
New Zealand backs India’s membership of the Nuclear Suppliers Group

ప్ర‌ధాని మ‌హోద‌యులు శ్రీ జాన్ కీ,

ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యులు,

ప్రసార మాధ్యమాల సభ్యులారా,

మహోదయుడు శ్రీ జాన్ కీ ని భార‌తదేశానికి ఆహ్వానిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది.

న్యూజీలాండ్ పార్ల‌మెంటు దీపావ‌ళి ప‌ర్వ‌దినం వేడుక‌లను క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తున్నద‌ని, ఆ వేడుక‌లలో మీరంతా భాగ‌స్వాముల‌ు అవుతార‌ని నాకు తెలిసింది. ఈ నేప‌థ్యంలో భారతదేశంలో దీపావ‌ళి ప‌ర్వ‌దిన వేడుక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మరీముఖ్యంగా మిమ్మ‌ల్ని ఆహ్వానించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది.

 

మిత్రులారా,

ఎన్నో బ‌హుళ పాక్షిక శిఖ‌రాగ్ర స‌మావేశాల సంద‌ర్భంగా శ్రీ జాన్ కీ, నేను ప‌లుమార్లు భేటీ అయ్యాము. ఇప్పుడు శ్రేష్ఠుడు శ్రీ కీ ని ఈ ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న‌కు ఆహ్వానించడం మాకు దక్కిన గౌర‌వం.

మ‌రి కాసేపట్లో మ‌న ఉభ‌య దేశాల క్రికెట్ జట్లు నాలుగో వన్ డే ఇంట‌ర్ నేష‌న‌ల్ మ్యాచ్ కోసం రాంచీలో మైదానంలో ప్ర‌వేశించ‌బోతున్నాయి. క్రికెట్ ప‌ద‌జాలంలో కూడా చాలా ప‌దాలు మ‌న ద్వైపాక్షిక బంధంలో పురోగ‌తికి ద‌ర్ప‌ణం ప‌డ‌తాయి. మ‌నం లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ నుండి బ్యాటింగ్ పిచ్ లో ఫ్రెష్ గార్డ్ ద‌శ‌కు ద్వైపాక్షిక బంధంలో ఎదిగాము. రక్షణాత్మకమైన ఆట తీరు కాస్తా దూకుడైన బ్యాటింగ్ తీరుకు బాట‌ పరచింది.

మిత్రులారా,

ప్ర‌ధాని శ్రీ కీ, నేను మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారం, బ‌హుళ పాక్షిక స‌హ‌కారానికి సంబంధించిన భిన్న కోణాల‌పై స‌వివ‌ర‌మైన, ఉత్పాద‌క‌మైన చ‌ర్చ‌లు జ‌రిపాము.

వాణిజ్య, పెట్టుబ‌డుల బంధం మా చ‌ర్చ‌లలో ప్ర‌ధానాంశంగా నిలచింది. అంత‌ర్జాతీయ ఆర్థిక రంగంలో నానాటికీ పెరిగిపోతున్న అనిశ్చితిని దీటుగా ఎదుర్కోవడానికి ఆర్థిక స‌హ‌కారం మ‌రింత‌గా విస్త‌రించుకోవ‌ల‌సిన అవ‌స‌రం మేమిద్ద‌రమూ గుర్తించాము. అందుకే మ‌న భాగ‌స్వామ్యంలో వ్యాపార‌, వాణిజ్య బంధం విస్త‌ర‌ణ అత్యంత కీల‌క‌మైంద‌ని అంగీక‌రించాము. ప్ర‌ధాని శ్రీ కీ వెంట వ‌చ్చిన‌ భారీ వ్యాపార ప్ర‌తినిధివ‌ర్గం భార‌తదేశ వృద్ధి గాథ‌లో పెట్టుబ‌డి అవ‌కాశాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకొంది. ఈ చ‌ర్చ‌లు మ‌న ఉభ‌య దేశాల మ‌ధ్య స‌రి కొత్త వాణిజ్య బంధాన్ని నిర్మిస్తాయి. మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారంలో ఫుడ్ ప్రాసెసింగ్‌, పాడి పరిశ్రమ, వ్య‌వ‌సాయం, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ లకు చెందిన‌ అనుబంధ రంగాలలో అపార అవ‌కాశాలు ఉన్నాయ‌ని వారికి నేను నివేదిస్తున్నాను. ఈ విభాగంలో న్యూజీలాండ్ కు గ‌ల బ‌లం, సామ‌ర్థ్యాలు, భార‌తదేశ సాంకేతిక విజ్ఞాన అవ‌స‌రాలు ఉభ‌య స‌మాజాల‌కు లాభ‌దాయ‌కంగా నిలుస్తాయి.

ఉభ‌య ప్ర‌భుత్వాలు తీసుకొనే చ‌ర్య‌లు వ్యాపార అనుసంధానాన్ని పెంచ‌డంతో పాటు నిపుణుల ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించాల‌ని ఉభ‌యులమూ అంగీక‌రించాము. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా ఉభ‌యుల‌కు లాభ‌దాయ‌క‌మైన‌ స‌మ‌గ్ర ఆర్థిక స‌హ‌కార ఒప్పందానికి త్వ‌ర‌లో తుది రూపం ఇచ్చి ఆచ‌ర‌ణీయం చేయాల‌ని మేం నిర్ణ‌యించాము.

 

మిత్రులారా,

ద్వైపాక్షిక స‌హ‌కారం ఒక్క‌టే కాదు…అంత‌ర్జాతీయ రంగస్థలం మీద కూడా మ‌నం స‌న్నిహితంగా స‌హ‌క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. తూర్పు ఆసియా శిఖ‌రాగ్రంతో పాటు ప్రాంతీయ ప్రాధాన్యం గ‌ల అంశాల్లో స‌హ‌కారం పెంచుకోవాల‌ని మేము అంగీకారానికి వ‌చ్చాము. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల‌ను ప‌రిశీలించే సంస్థ‌లలో సంస్క‌ర‌ణ‌లు ఉభ‌యుల‌కు ఆస‌క్తి గ‌ల ప్రాధాన్య‌తాంశం. సంస్క‌రించిన ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌త మండ‌లిలో భార‌తదేశ శాశ్వ‌త స‌భ్య‌త్వానికి మ‌ద్ద‌తు ఇచ్చినందుకు న్యూజీలాండ్ కు ధ‌న్య‌వాదాలు. ప‌సిఫిక్ ద్వీప‌క‌ల్ప దేశాల అభివృద్ధికి చేస్తున్న కృషిలో న్యూజీలాండ్ తో స‌న్నిహితంగా సంప్ర‌దించ‌డంతో పాటు ఉభ‌యుల ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌కారం అందించుకోవాల‌ని మేము భావిస్తున్నాము.

పరమాణు స‌ర‌ఫ‌రా దేశాల బృందంలో భార‌తదేశం స‌భ్య‌త్వానికి నిర్మాణాత్మ‌కంగా స‌హ‌క‌రించాల‌న్న ప్ర‌ధాని శ్రీ కీ నిశ్చ‌యానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను.

మిత్రులారా,

అంత‌ర్జాతీయ శాంతి- భ‌ద్ర‌త‌ల‌కు పెను స‌వాలు విసరుతున్న ప్ర‌ధాన సమస్యలలో ఉగ్ర‌వాదం ఒక‌టి. ఆర్థిక‌, లాజిస్టిక్స్, స‌మాచార నెట్ వ‌ర్క్ ల నుండి ఉగ్ర‌వాదం ఈ రోజు ప్ర‌పంచం అంతటికీ వ్యాపించింది. భౌగోళిక‌మైన హ‌ద్దులు ఈ ఉగ్ర‌వాదాన్ని, తీవ్ర‌వాదాన్ని ఏ మాత్రం నిలువ‌రించ‌డంలేదు. ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు మాన‌వ‌త్వంపై విశ్వాసం ఉన్న దేశాల‌న్నీ స‌హ‌క‌రించుకోవ‌లసిన అవ‌స‌రం ఉంది.

ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం, సైబ‌ర్ సెక్యూరిటీ విభాగాలలో భ‌ద్ర‌త‌, గూఢ‌చ‌ర్య స‌హ‌కారం ప‌టిష్ఠం చేసుకోవాల‌ని ప్ర‌ధాని శ్రీ కీ, నేను అంగీకారానికి వ‌చ్చాము.

మ‌హోద‌యా,

మీ నాయ‌క‌త్వం ప‌ట్ల న్యూజీలాండ్ ప్ర‌జ‌లు మ‌రోసారి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందుకు కార‌ణం నాకు తెలుసు.

మ‌న ద్వైపాక్షిక భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ముందుకు న‌డిపించేందుకు, స్నేహ‌బంధాన్ని ప‌టిష్ఠం చేసుకొనేందుకు, ఉభ‌య దేశాల మ‌ధ్య ప్ర‌జాసంబంధాన్ని విస్త‌రించుకొనేందుకు మీరు వ్య‌క్తిగ‌తంగా వచనబద్ధతను ప్ర‌క‌టించినందుకు ధ‌న్య‌వాదాలు.

మ‌రోసారి మీకు, మీ ప్ర‌తినిధివ‌ర్గానికి హార్దిక స్వాగ‌తం ప‌లుకుతున్నాను. మీ ప‌ర్య‌ట‌న సఫలం, విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

మీకు అందరికీ అనేకానేక ధన్యవాదాలు.