ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నీమ్ రాణా సమావేశం 2016 లో పాలుపంచుకొంటున్న పండితులు మరియు ఆర్థికవేత్తలతో సంభాషించారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలలో స్థూల ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, ద్రవ్య విధానం, పోటీతత్వం, ఉత్పాదకత మరియు శక్తి వంటి రంగాలపైన, ఇంకా ప్రపంచ పరిశోధన సంబంధ ఉపాయాల పైన దృష్టి నిలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ మాట్లాడుతూ, వివేకవంతమైన స్థూల ఆర్థిక విధానం, నిబంధనల ఆధారితమైన బహుళపాక్షిక వ్యాపార ఏర్పాట్లు, బాధ్యతాయుతమైన శీతోష్ణ స్థితి విధానం మరియు ఉద్యోగాలను కల్పించగలిగిన, పేదరికాన్ని తగ్గించగల ప్రగతి వంటి వాటికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
వ్యవసాయ రంగంలో దిగుబడులను పెంచడం కోసం, ఇంకా.. నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న వివిధ చర్యలను గురించి ఆయన సమగ్రంగా ప్రస్తావించారు.