నేను 2016 నవంబరు 10-12 తేదీల మధ్య జపాన్ లో పర్యటించనున్నాను.
జపాన్ తో మన భాగస్వామ్యం ఒక ప్రత్యేక వ్యూహాత్మకతను, ప్రపంచ భాగస్వామ్యాన్ని సంతరించుకొన్నది. బౌద్ధ వారసత్వాన్ని, ప్రజాస్వామ్య విలువలు, దాపరికానికి తావు లేని, సమ్మిళిత, నియమాలపై ఆధారపడిన ప్రపంచ వ్యవస్థ దిశగా పాటుపడడం కోసం భారతదేశం, జపాన్ లు పనిచేస్తాయి.
ఇవాళ భారత దేశంలో అతి పెద్ద పెట్టుబడిదారులలో జపాన్ ఒకటిగా ఉంది. అనేక జపాన్ కంపెనీల పేర్లు భారతదేశంలో ఇంటింటా వినపడతాయి. ఈ కంపెనీలు అనేక దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకొన్నాయి. ఈసారి పర్యటన సందర్భంగా టోక్యోలో భారతదేశం, జపాన్ లకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను నేను కలుసుకొని మన వ్యాపారం మరియు పెట్టుబడుల సంబంధాలను పటిష్టపరచుకొనేందుకు ఉన్న మార్గాలను అన్వేషించడం కోసం లోతైన చర్చ చేపట్టబోతున్నాను.
ఈ పర్యటనలో భాగంగా చక్రవర్తి గారితో భేటీ అయ్యే అవకాశం కూడా నాకు దక్కనున్నది. నవంబర్ 11వ తేదీన టోక్యోలో ప్రధాని శ్రీ శింజో అబేతో సమావేశమైనప్పుడు మన ద్వైపాక్షిక సంబంధాల పూర్తి వర్ణ పటాన్ని సమీక్షించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.
నవంబర్ 12 నాడు ప్రధాని శ్రీ అబేతో కలిసి కోబె కు షింకన్ సెన్ లో ప్రయాణించనున్నాను. (ముంబయ్- అహమ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే కు షింకన్ సెన్ సాంకేతిక విజ్ఞానాన్నే మోహరించనున్నారు. మేమిరువురమూ కవాసాకి హెవీ ఇండస్ట్రీస్ సముదాయాన్ని కూడా సందర్శించనున్నాము. అక్కడ హై స్పీడ్ రైళ్లను తయారు చేస్తుంటారు.
భారతదేశం, జపాన్ ల మధ్య హై స్పీడ్ రైళ్ల విషయమై ఏర్పడిన సహకారం మన సహకారానికి ఉన్న శక్తి కి ఒక చక్కని ఉదాహరణ. ఇది మన వ్యాపారం మరియు పెట్టుబడి బంధాన్ని ఉత్తేజితం చేయడమే కాదు, భారతదేశంలో నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాలను సృష్టించడంతో పాటు మన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది; ఇంకా మన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమానికి దన్నుగా కూడా నిలుస్తుంది.