జి ఎస్ టి కౌన్సిల్ మరియు సెక్రటేరియట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి :
(ఎ) రాజ్యాంగంలోని సవరించిన అధికరణం 279 ‘ఎ’ కింద జి ఎస్ టి కౌన్సిల్ ఏర్పాటు;
(బి) న్యూ ఢిల్లీలో జి ఎస్ టి కౌన్సిల్ సెక్రటేరియట్ ఏర్పాటు, దీని కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంటుంది;
(సి) జిఎస్ టి కౌన్సిల్ ఎక్స్- అఫీషియో కార్యదర్శిగా రెవిన్యూ శాఖ కార్యదర్శిని నియమించడం;
(డి) జి ఎస్ టి కౌన్సిల్ సమావేశాలు అన్నింటికీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సి బి ఇ సి) చైర్ పర్సన్ ను శాశ్వత ఆహ్వానితుడుగా (ఓటింగ్ హక్కు లేకుండా) నియమించడం;
(ఇ) జి ఎస్ టి కౌన్సిల్ కు ఒక అదనపు కార్యదర్శి పోస్టును (కేంద్రప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదాలో), నాలుగు కమిషనర్ పోస్టులను (కేంద్రప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో) ఏర్పాటు చేయడం జరగాలి.
జి ఎస్ టి కౌన్సిల్, సెక్రటేరియట్ నిర్వహణకు అవసరమయ్యే పునరావృత్తం అయ్యే నిధులను, పునరావృత్తం కాని నిధులను అన్నింటినీ అందించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. ఈ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ సర్వీసుల నుండి డిప్యుటేషన్ పై నియమించిన అధికారులు జి ఎస్ టి కౌన్సిల్ నిర్వహణ బాధ్యతలను చేపడుతారు.
జి ఎస్ టి అమలు దిశగా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్దేశిత కాలపరిమితి కన్నా ముందుగానే అన్ని చర్యలు తీసుకుంటోంది.
జి ఎస్ టి కౌన్సిల్ తొలి సమావేశాలను ఈ నెల 22వ, 23వ తేదీలలో న్యూ ఢిల్లీలో నిర్వహించాలని కూడా ఆర్థిక మంత్రి నిర్ణయించారు.
పూర్వ రంగం :
కేంద్ర ప్రభుత్వం దేశంలో వస్తువులు, సేవల పన్ను ను అమలుపరచడానికి వీలుగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు 2016కు సెప్టెంబర్ 8వ తేదీన రాష్ర్టపతి ఆమోదముద్ర వేశారు. దానిని రాజ్యాంగ (101 సవరణ) చట్టం 2016 గా ప్రభుత్వం నోటిఫై చేసింది. 279 ఎ (1) అధికరణానికి అనుగుణంగా 279 ‘ఎ’ అధికరణం అమలులోకి వచ్చిన 60 రోజుల్లోగా రాష్ర్టపతి జి ఎస్ టి కౌన్సిల్ ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. 279 ‘ఎ’ అధికరణం ఆచరణీయం చేయడానికి 2016 సెప్టెంబర్ 10వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. దీని కింద 2016, సెప్టెంబర్ 12వ తేదీ నుండి 279 ‘ఎ’ అధికరణం అమలులోకి వచ్చింది.
రాజ్యాంగ సవరణ 279 ‘ఎ’ కింద జి ఎస్ టి కౌన్సిల్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి వేదికగా ఉంటుంది. ఆ కౌన్సిల్ లో ఈ దిగువ సభ్యులు ఉంటారు.
ఎ) కేంద్ర ఆర్థిక మంత్రి – చైర్ పర్సన్
బి) రెవిన్యూ వ్యవహారాలు చూసే ఆర్థిక శాఖ సహాయ మంత్రి- సభ్యుడు
సి) రాష్ర్ట ప్రభుత్వాలలో ఆర్థిక శాఖ, పన్నుల శాఖ నిర్వహిస్తున్నమంత్రులు లేదా ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు నియమించిన మంత్రులు- సభ్యులు
279 ఎ(1) అధికరణం ప్రకారం, దేశంలో జి ఎస్ టి అమలు విధివిధానాలు, జి ఎస్ టికి మినహాయింపులు, నమూనా జి ఎస్ టి చట్టాలు, సరఫరాలకు సంబంధించిన నియమావళి, గరిష్ఠ పరిమితులు, జి ఎస్ టి రేటు, పరిమితులతో కూడిన క్షేత్ర స్థాయి రేట్లు, ప్రకృతి వైపరీత్యాలు/కల్లోలాలు ఏర్పడిన సందర్భాల్లో అదనపు వనరుల సమీకరణకు అమలుపరచాల్సిన ప్రత్యేక రేట్లు, కొన్ని రాష్ట్రాలకు అందించే ప్రత్యేక ఏర్పాట్లు వంటి అంశాలన్నింటిలోను జి ఎస్ టి కౌన్సిల్ మార్గనిర్దేశం చేస్తుంది.