Mr. Jacques Audibert, Diplomatic Advisor to the French President meets Prime Minister Modi

ఫ్రాన్స్ అధ్యక్షుల వారికి దౌత్య వ్యవహారాలలో సలహాదారుగా ఉంటున్న శ్రీ జాక్వెస్ ఆడిబర్త్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి 2015 లో తాను ఫ్రాన్స్ లో పర్యటించడాన్ని, అలాగే ఫ్రాన్స్ అధ్యక్షులు శ్రీ ఓలాంద్ 2016 వ సంవత్సరంలో రిపబ్లిక్ దిన వేడుకకు ముఖ్య అతిథిగా రావడాన్ని గురించి గుర్తు చేశారు. ఈ పర్యటనలు రానున్న సంవత్సరాలలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి పునాదిని వేశాయని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం మరియు ఫ్రాన్స్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రక్షణ, అంతరిక్షం మరియు పౌర పరమాణు సహకారం అనే మూడు అంశాలకు మించి మరింత విస్తృత‌ శ్రేణి రంగాలకు విస్తరించాయని, ప్రత్యేకించి ఉగ్రవాద నిరోధం, సముద్ర సంబంధి భద్రత, ఇంకా నవీకరణ యోగ్య శక్తి రంగాలకు ఇవి వ్యాపించాయని ప్రధాన మంత్రి చెప్పారు.

ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ స్థాపన శీతోష్ణ స్థితిలో మార్పు అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలలో ఒక మైలురాయి వంటి విజయమని ప్రధాన మంత్రి జ్ఞ‌ప్తికి తెచ్చుకొన్నారు. ఈ చొరవలో మద్దతిచ్చినందుకు గాను ఫ్రాన్స్ ను ఆయన తన అభినందనను అందించారు.

స్మార్ట్ సిటీస్, పట్టణ రవాణా, మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలలో ఇతోధిక ద్వైపాక్షిక సహకారం అవసరమంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.