ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “ఎకనామిక్ పాలిసి - ద రోడ్ అహెడ్” ఇతివృత్తంపై నీతి ఆయోగ్ అర్థశాస్త్రవేత్తలు, ఇతర నిపుణులతో ఈ రోజు ఏర్పాటు చేసిన సంభాషణ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో పాలుపంచుకొన్న వారు వ్యవసాయం, నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉద్యోగాల కల్పన, పన్నుల విధానం, గృహ నిర్మాణం, పర్యటన, బ్యాంకింగ్, పరిపాలన సంబంధ సంస్కరణలు, సమాచార ఆధారిత విధాన రూపకల్పన, ఇంకా వృద్ధి కోసం భవిష్యత్తులో చేపట్టదగిన చర్యలు వంటి వివిధ ఆర్థిక విషయాలపై వారి వారి ఉద్దేశాలను వెల్లడించారు.
ప్రధాన మంత్రి కలగజేసుకొని, సమావేశంలో పాలుపంచుకొన్న వారు వారి వారి సూచనలను మరియు ఆలోచనలను వ్యక్తం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా, నైపుణ్యాల అభివృద్ధి మరియు పర్యటన వంటి రంగాలలో కొత్త కొత్త దారులను అవలంబిద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు.
బడ్జెట్ గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వాస్తవ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న బడ్జెట్ కేలండర్ లో వర్ష రుతువు ఆరంభంతో పాటే వ్యయాలకు అధికారమిచ్చే రివాజు ఉందని ఆయన తెలిపారు. ఇది నిర్మాణాత్మకమైన వర్షాకాలానికి ముందు మాసాలలో ప్రభుత్వ కార్యక్రమాలు సాపేక్షంగా అంత చురుకుగా ఉండకుండా పోవడానికి కారణం అవుతోందని ఆయన అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని, బడ్జెట్ సమర్పణ తేదీని ముందుకు తీసుకువస్తున్నామని, అలా చేస్తే కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యే నాటికి వ్యయాలకు అధికారమివ్వడం సాధ్యమవుతుందన్నారు.
సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, ప్రణాళిక శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇందర్ జీత్ సింగ్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు శ్రీ అరవింద్ పాన్ గఢియా, మరియు కేంద్ర ప్రభుత్వం, ఇంకా నీతి ఆయోగ్ లకు చెందిన అనుభవయుక్త అధికారులు హాజరయ్యారు. అంతే కాకుండా ప్రొఫెసర్ శ్రీ ప్రవీణ్ కృష్ణ, ప్రొఫెసర్ శ్రీ విజయ్ పాల్ శర్మ, శ్రీ నీలకంఠ్ మిశ్రా, శ్రీ సుర్ జీత్ భల్లా, డాక్టర్ పులాక్ ఘోష్, డాక్టర్ గోవింద రావు, శ్రీ మాధవ్ చవాన్, డాక్టర్ ఎన్.కె. సింగ్, శ్రీ వివేక్ దెహేజియా, శ్రీ ప్రమత్ సిన్హా, శ్రీ సుమీత్ బోస్, ఇంకా శ్రీ టి.ఎన్. నైనన్ లు సహా అర్థశాస్త్రవేత్తలు మరియు నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.