Maha-Shivratri symbolizes a union of divinity with a purpose, of overcoming darkness and injustice: PM Modi
Yoga is ancient, yet modern; it is constant, yet evolving: PM Narendra Modi
By practicing Yoga, a spirit of oneness is created – oneness of the mind, body and the intellect: PM
Our mind should always be open to new thoughts and ideas from all sides: PM Narendra Modi
The progress of humanity is incomplete without the empowerment of women: Shri Modi
The burden of stress takes a heavy toll and one of the sharpest weapons to overcome stress is Yoga: Shri Modi
Yoga is a passport to health assurance. More than being a cure to ailments, it is a means to wellness: PM Modi
Yoga makes the individual a better person in thought, action, knowledge and devotion: Prime Minister
Yoga has the potential to herald in a new Yuga of peace, compassion, brotherhood and all-round progress of the human race: PM

మీకంద‌రికీ నా ప్రేమ‌పూర్వ‌క న‌మ‌స్సులు.

మంగళప్రదమైన మ‌హా శివ‌రాత్రి సందర్భంగా
ఈ గొప్ప ప్రజా సమూహం మధ్యకు- నేను చేరుకోవడం నాకు దక్కిన గౌర‌వంగా భావిస్తున్నాను.

మ‌న‌కు అనేక పండుగ‌లున్నాయి; అయితే, ఈ ఒక్క శివ‌రాత్రి పండుగకు మాత్ర‌మే‘మ‌హా’ అనే విశేష‌ణం ముందు వచ్చి చేరింది.

వాస్తవానికి, ఎంద‌రో దైవాలు ఉన్నారు. అయితే, ఒకే ఒక్కరు మాత్రమే మ‌హాదేవుడు.

మంత్రాలు అనేకం ఉన్నాయి. అయితే, వాటిలో శివుడితో ముడిప‌డిన మంత్రాన్ని ‘మ‌హా మృత్యుంజ‌య మంత్రం’గా పిలుస్తున్నారు.

అదీ మ‌హా శివుడి యశస్సు.

అంధకారాన్ని, అన్యాయాన్ని అధిగ‌మించే ప‌ర‌మోద్దేశంతో దైవత్వంతో మమేకం కావ‌డాన్ని మ‌హా శివ‌రాత్రి సూచిస్తుంది.

అది మ‌న‌లో ధైర్యాన్ని నింపి, మంచి కోసం పోరాడే స్ఫూర్తిని అందిస్తుంది.

శీత‌ల‌త్వం నుండి ఉల్లాసభ‌రిత‌ వ‌సంతం, తేజస్సు దిశ‌గా రుతువు మార్పున‌కు అదొక సంకేతం.

మ‌హా శివ‌రాత్రి వేడుకలు ఒక రాత్రి పొడవునా సాగుతాయి. ఇది అప్ర‌మ‌త్త‌త స్ఫూర్తికి సూచిక- అంటే.. మ‌నం ప్ర‌కృతిని ప‌రిర‌క్షించాల‌ని, మ‌న కార్య‌క‌లాపాల‌ను ప‌రిస‌రాలు, ప‌ర్యావ‌ర‌ణంతో మ‌మేకం చేసుకోవాల‌ని తెలియజేస్తుంది.

నా స్వరాష్ట్రం గుజ‌రాత్ సోమ‌నాథుని నిల‌యం. ప్ర‌జ‌లిచ్చిన పిలుపు, సేవ చేయాలనే అభిలాష న‌న్ను విశ్వ‌నాథుని నిల‌య‌మైన కాశీకి తీసుకువెళ్లాయి.

సోమనాథుని నుండి విశ్వ‌నాథుని దాకా, కేదార‌నాథుని నుండి రామేశ్వ‌రందాకా, కాశీ నుండి కోయంబ‌త్తూరు దాకా మ‌నం ఎక్క‌డ ఏక‌మైనా.. మ‌హా శివుడు స‌ర్వాంతర్యామి. ఆయ‌న ప్ర‌తి చోటా కొలువైవున్నాడు.

ఈ దేశం న‌లుమూల‌లా వ్యాపించిన కోట్లాది భార‌తీయుల మాదిరిగానే, మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల‌లో పాలుపంచుకొంటున్నదుంకు నేను ఎంతో ఆనందిస్తున్నాను.

మ‌నం స‌ముద్రంలో నీటిచుక్క‌ల లాంటి వాళ్లం.

శ‌తాబ్దాలుగా ప్ర‌తి యుగంలో, కాలంలో లెక్కలేనంత మంది మ‌హాభ‌క్తులు మనుగడ సాగించారు.

వారు వివిధ ప్రాంతాల‌ నుండి వచ్చిన వారు.

వారి భాష‌లు వేరు కావ‌చ్చు గాని, దైవత్వాన్ని అన్వేషించాలన్న వారి గాఢమైన కోరిక ఎల్లప్పటికీ ఒక్కటే.

ఈ ప్ర‌గాఢ వాంఛే ప్రతి ఒక్క మాన‌వ హృద‌యపు స్పందనగా ఉన్నది. వారి కవిత్వం, వారి సంగీతం, వారి ప్రేమ ధరిత్రిని త‌డిపేసింది.

ఈ 112 అడుగుల ఆదియోగి ముఖ ప్రతిమ మరియు యోగీశ్వ‌రుని లింగం ముందు నిలబడి, మ‌న‌మందరం ఆద్యంతాలు లేని ఆ ఉనికిని ఇక్క‌డ మ‌న‌లో ఆవిష్క‌రించుకుంటున్నాం.

 

ఇప్పుడు మ‌న‌ం గుమికూడిన ఈ ప్ర‌దేశం రాబోయే రోజులలో అంద‌రికీ స్ఫూర్తినిచ్చే, ప్ర‌తి ఒక్క‌రూ లీన‌మైపోయి స‌త్యాన్ని కనుగొనే ప్ర‌దేశంగా మారగలదు.

ఈ స్థ‌లం ప్ర‌తి ఒక్క‌రూ శివ‌మ‌యం అయ్యేటట్లు ప్రేరణను కలిగిస్తుంది. ఇది మ‌హా శివుడి స‌మ్మిళిత స్ఫూర్తిని గుర్తు చేస్తుంది.

నేడు యోగా చాలా దూరం ప్ర‌యాణించింది.

అనేక నిర్వ‌చ‌నాలు, విధానాలు, యోగాభ్యాస కేంద్రాలు, యోగా చేసే ప‌ద్ధ‌తులు పుట్టుకొచ్చాయి.

యోగా గొప్ప‌త‌నం అదే.. ఇది చాలా పురాత‌నమే గానీ, అత్యంత ఆధునికం. ఇది నిశ్చ‌లం.. నిత్య ప‌రిణామ‌శీలం.

యోగా మూల స్వ‌భావం ఏమీ మార‌లేదు.

అందుకే ఈ మూలాల ప‌రిర‌క్ష‌ణ అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌ని నేను చెబుతున్నాను. ఇదే లేక‌పోతే మ‌నం కొత్త యోగాను ఆవిష్క‌రించుకుని, దాని ఆత్మ‌ను, మూలాల‌ను పున‌రావిష్క‌రించుకోవ‌ల‌సి వ‌స్తుంది. జీవుడిని శివుడుగా ప‌రివ‌ర్త‌న చెందించే ఒక ఉత్ప్రేర‌కమే యోగా.

యత్ర జీవ: తత్ర శివ:
ఎక్క‌డ జీవుడు ఉంటాడో, అక్క‌డ శివుడు ఉంటాడు.

జీవుడి నుండి శివుడుగా మార‌డం వైపు సాగే యాత్రే యోగా. యోగాభ్యాసం ద్వారా ఏక‌త్వ స్ఫూర్తి ఉద్భ‌విస్తుంది- మ‌న‌స్సు, శ‌రీరం, మేధ‌స్సుల ఏక‌త్వ‌మ‌ది.

మ‌న కుటుంబాలతో, మ‌నం జీవించే స‌మాజంతో, తోటి మాన‌వుల‌తో, వృక్ష‌, ప‌శు ప‌క్ష్యాదుల‌తో మ‌న ఏకత్వ‌మ‌ది. ఇలా ఈ సుంద‌ర‌మైన భూమిని స‌క‌ల ప్రాణుల‌తో క‌ల‌సి మ‌నం పంచుకుంటున్నాం.. ఇదే యోగా.

యోగా అంటే... ‘నేను’ నుండి ‘మ‌నం’వైపు ప‌య‌న‌మే.
వ్య‌ష్టి నుంచి స‌మ‌ష్టి దాకా సాగే యాత్ర ఇది.. నేను నుండి మ‌నం దాకా ఇదే అనుభూతి.. అహం నుండి వ‌యందాకా ఇదే భావ ప్ర‌సారం, ఇదే యోగా.

భార‌త‌దేశం అస‌మాన వైవిధ్య‌ భ‌రితం. మ‌న దేశ వైవిధ్యం దృశ్య‌, శ్ర‌వ‌ణ‌, భావ‌, స్ప‌ర్శ‌, ర‌స‌మ‌యం. ఆ వైవిధ్య‌మే భార‌త‌దేశ బ‌లం.. ఈ దేశాన్ని ఐక‌మ‌త్యంగా ఉంచుతున్నదీ ఆ వైవిధ్య‌మే.

మ‌హా శివుడిని ఒక్క‌సారి త‌ల‌చుకోండి.. మ‌హోత్తుంగ‌ హిమాల‌య ప‌ర్వ‌తాల్లోని కైలాస శిఖ‌రాన ఆయ‌న దివ్య‌ గంభీర రూప‌మే అప్పుడు మ‌న మ‌దిలో మెదులుతుంది. పార్వ‌తీ మాత‌ను ఒక్క‌సారి స్మ‌రించుకోండి.. అప్పుడు మీకు సువిశాలమైన మహా సముద్ర జ‌లాల‌ న‌డుమ‌న‌ గ‌ల‌ సుంద‌ర క‌న్యాకుమారి సాక్షాత్క‌రిస్తుంది. శివ‌ పార్వ‌తుల సంగ‌మమంటే, స‌ముద్రాలు, హిమాల‌యాల సంగ‌మ‌మే.

శివుడు, పార్వ‌తి.. వీరు ఇరువురు అంటేనే ఏక‌త్వ సందేశం.

ఈ ఏక‌త్వ సందేశం త‌న‌ను తాను ఎలా ఆవిష్క‌రించుకుంటుందో చూడండి:

శివుని కంఠాభరణం స‌ర్పం.. గ‌ణేశుని వాహ‌నం ఎలుక.. స‌ర్ప, మూషిక‌ సంబంధం ఎంత బ‌ద్ధ వైరంతో కూడిన‌దో మ‌న‌కంద‌రికీ బ‌హుబాగా తెలుసు. అయిన‌ప్ప‌టికీ, అక్క‌డ అవి రెండూ స‌హ‌జీవ‌నం చేస్తుంటాయి.

అలాగే కార్తికేయుని వాహ‌నం నెమ‌లి. స‌ర్ప‌ మ‌యూరాలు శత్రుత్వానికి నిద‌ర్శ‌న‌మంటారు. అయిన‌ప్ప‌టికీ, అవి రెండూ అక్క‌డ స‌హ‌జీవ‌నం చేస్తుంటాయి.

మ‌హా శివుని కుటుంబ‌మే వైవిధ్య భ‌రితం.. అదే స‌మ‌యంలో సామ‌ర‌స్యం, ఐక‌మ‌త్యం స‌చేత‌నం.

వైవిధ్యం వైరుధ్యానికి కార‌ణం కాదు.. దానిని మ‌నం అంగీక‌రించి, నిండు మ‌న‌సుతో ఆలింగ‌నం చేసుకున్నాం.

మ‌న సంస్కృతిలోని ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. దేవుడు లేదా దేవ‌త ఉన్న ప్ర‌తి చోటా ఓ జంతువు లేదా ప‌క్షి లేదా వృక్షం వారితో ముడిప‌డి ఉంటుంది.

ఆ దేవ‌త‌ల‌తో స‌మానంగా, అదే స్ఫూర్తితో ఆ జంతువు, ప‌క్షి లేదా వృక్షం కూడా పూజ‌లు అందుకుంటుంది. ప్ర‌కృతిని పూజించ‌గ‌ల స్ఫూర్తిని అల‌వ‌ర‌చుకోవ‌డానికి అంత‌ క‌న్నా ఉత్త‌మ మార్గం ఏదీ ఉండ‌దు. ప్ర‌కృతి దైవ స‌మానమ‌నే భావ‌న‌ను మ‌న పూర్వీకులు బ‌లంగా నాట‌డ‌మే వారి దూర‌దృష్టికి ప్ర‌తీక‌.

మ‌న వేదాలు ఘోషిస్తాయి: ‘ఏక‌మ్ స‌త్‌, విప్రః బ‌హుధా వ‌దంతి’ అని.

స‌త్యం ఒక్క‌టే... మ‌న రుషులు దానిని వేరేవేరు పేర్ల‌తో పిలుస్తారు.

మ‌నం బాల్యం నుండే ఈ విలువ‌ల‌తో ఎదుగుతున్నాం. కాబ‌ట్టే స‌హానుభూతి, సోదరభావం, సామ‌ర‌స్యం స‌హ‌జంగానే మ‌న‌లో ఓ భాగ‌ం అయ్యాయి.

ఈ విలువ‌ల కోస‌మే మ‌న పెద్ద‌లు ఆజీవ‌న ప‌ర్యంతం త‌పించారు.

శ‌తాబ్దాల‌పాటు మ‌న నాగ‌రిక‌త‌ను సజీవంగా ఉంచిందీ ఈ విలువ‌లే.

అన్ని వైపుల నుండీ వ‌చ్చే స‌రికొత్త ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌ను స్వీక‌రించేందుకు మ‌న మ‌న‌సును స‌దా సిద్ధంగా ఉంచాలి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ అతి కొద్దిమంది వారి అజ్ఞానాన్ని దాచుకునేందుకు క‌ఠిన దృష్టికోణాన్ని అనుస‌రిస్తూ కొత్త ఆలోచ‌న‌లు, అనుభ‌వాల‌ను స్వాగ‌తించ‌గ‌ల అవ‌కాశాల‌న్నిటినీ నాశ‌నం చేస్తారు.

కేవ‌లం పాత‌ కాలం నాటిది కాబ‌ట్టి ఒక ఆలోచ‌న‌ను తిర‌స్క‌రించ‌డ‌మంటే, అది హానిక‌ర‌మే కాగ‌ల‌దు. దాన్ని విశ్లేషించ‌డం, అర్థం చేసుకోవ‌డంతో పాటు కొత్త త‌రానికి అవ‌గాహ‌న క‌లిగే ఉత్త‌మ మార్గంలో వారివ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డం కూడా అవ‌శ్యం.

మ‌హిళా సాధికారిత లోపించిన మాన‌వ‌ జాతి ప్ర‌గ‌తి అసంపూర్ణం. విషయం మ‌హిళ‌ల అభివృద్ధి కానే కాదు, మ‌హిళ‌ల నేతృత్వంలో పురోగ‌మ‌నం.

మ‌న సంస్కృతిలో మ‌హిళ‌ల పాత్రే కీల‌క‌మ‌న్న స‌త్యం నాకెంతో గ‌ర్వ‌కార‌ణం.

పూజ‌లందుకునే దేవ‌త‌లెంద‌రో మ‌న సంస్కృతిలో ఉన్నారు. భార‌త‌దేశం ఎంద‌రో మ‌హిళా సాధ్వీమణులకు నిల‌యం. ఉత్త‌ర‌ం-ద‌క్షిణ‌ం, తూర్పు-ప‌డ‌మ‌ర‌ అన్న దానితో నిమిత్తం లేకుండా సామాజిక సంస్క‌ర‌ణ‌ల కోసం వారు స‌ర్వ‌త్రా ఉద్య‌మాల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు.

మూస ధోర‌ణుల‌ను వారు ప‌టాపంచ‌లు చేశారు; అడ్డుగోడ‌ల‌ను బ‌ద్ద‌లుకొట్టి మార్గ‌ద‌ర్శ‌కుల‌య్యారు.

మ‌న దేశంలో ‘‘నారీ.. తూ నారాయ‌ణీ- నారీ.. తూ నారాయ‌ణీ’’ (ఓ మ‌హిళా నీవు నారాయ‌ణివే) అంటామ‌నే సంగ‌తిని తెలుసుకోవడం మీకు ఆస‌క్తిని క‌లిగిస్తుంది క‌దూ.

మ‌హిళ దైవ‌త్వానికి ఓ ప్ర‌తీక‌. అయితే, పురుషుల గురించి ఏం చెబుతామంటే- ‘‘న‌రుడా! నీవు సత్కర్మలతోనే నారాయ‌ణుడ‌వు కాగలవు’’... అంటే దైవ‌త్వం సిద్ధిస్తుంద‌ని అర్థం.

ఈ వ్య‌త్యాసాన్ని మీరు గ్ర‌హించారా ? మ‌హిళ‌కు దివ్యత్వం బేష‌ర‌తుగా సిద్ధిస్తున్నది. నిర్నిబంధంగా ఆమె ‘నారీ తూ నారాయ‌ణీ’ అవగా, పురుషుడు మాత్రం మంచి ప‌నులు చేస్తేనే నారాయ‌ణ‌త్వాన్ని స‌ముపార్జించుకోగ‌ల‌ుగుతాడు. బ‌హుశా అందుకే కాబోలు.. ప్ర‌పంచానికి ‘త‌ల్లి’గా ఉంటాన‌ని ప్ర‌మాణం చేయాల్సిందిగా స‌ద్గురు నిర్దేశిస్తారు. అమ్మంటే బేష‌ర‌తుగా సార్వ‌జ‌నీనం!

ఈ 21వ శ‌తాబ్దంలో మారుతున్న జీవ‌న‌శైలి త‌న‌దైన స‌వాళ్ల‌ను విసిరింది.

జీవ‌న‌ శైలి సంబంధిత రుగ్మ‌త‌లు, ఒత్తిడితో ముడిప‌డిన వ్యాధులు నానాటికీ స‌ర్వ‌సాధార‌ణం అవుతున్నాయి. అంటువ్యాధుల‌ను నియంత్రించ‌వ‌చ్చు గానీ, అసాంక్రమిక వ్యాధుల మాటేమిటి? ఇదే నాకు అమిత బాధాక‌రంగా ఉంది. మాన‌సిక ప్ర‌శాంత‌త లోపించిందంటూ మాద‌క‌ద్ర‌వ్యాల‌కు, మ‌ద్యానికి కొంద‌రు బానిస‌ల‌వుతున్నార‌ని చ‌దివిన‌ప్పుడల్లా క‌లిగే ఆ బాధ‌ను నేను మాట‌ల్లో చెప్ప‌లేక‌పోతున్నాను.
ఇవాళ ప్ర‌పంచానికంతటికీ కావలసింది శాంతి.. అది ఒక్క యుద్ధాల నుండి, వైరుధ్యాల నుండి మాత్ర‌మే కాదు, మాన‌సిక శాంతి కావాలి.

ఒత్తిడి వ‌ల్ల మ‌న‌ మీద అత్యంత భారం ప‌డుతోంది. ఈ ఒత్తిడిని అధిగ‌మించే తిరుగులేని ఆయుధాల్లో యోగా ఒక‌టి.

ఒత్తిడిని, దీర్ఘ‌కాలిక రుగ్మ‌త‌ల‌ను ఎదుర్కొన‌డంలో యోగాభ్యాసం ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌నేందుకు ఎన్నో రుజువులు ఉన్నాయి. దేహం మేధ‌స్సుకు ఆల‌య‌మైతే, యోగా అద్భుత‌మైన ఆల‌యాన్ని సృష్టిస్తుంది.

అందుకే ఆరోగ్య ధీమాకు యోగాను నేను ఓ ప్ర‌వేశ‌ప‌త్రంలా భావిస్తాను. అనారోగ్యాన్ని న‌యం చేసేదానిక‌న్నా సంక్షేమానికి మ‌రో అర్థంగా ప‌రిగ‌ణిస్తాను.

యోగా అంటే రోగ‌ విముక్తి (వ్యాధుల నుండి స్వేచ్ఛ‌) మాత్ర‌మే కాదు... భోగ‌ ముక్తి (ఐహిక వాంఛ‌ల‌ నుండి స్వేచ్ఛ‌) కూడా.

ఆలోచ‌న‌, కార్య‌చ‌ర‌ణ‌, విజ్ఞానం, దీక్ష ల దిశ‌గా వ్య‌క్తిని మెరుగైన మాన‌వుడుగా తీర్చిదిద్దేది యోగానే.

శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కొన్ని వ్యాయామాలతో కూడిన క‌స‌ర‌త్తుగా మాత్ర‌మే యోగాను ప‌రిగ‌ణించ‌డం స‌రికాదు.

శ‌రీరాన్ని వివిధ భంగిమ‌ల‌లో వంచ‌గ‌ల‌, మెలిక‌లు తిప్ప‌గ‌ల వ్య‌క్తుల‌ను మీరు చూసి ఉంటారు. కానీ, వారంతా యోగులు కారు.

శారీర‌క వ్యాయామాల‌ను మించిన‌ది యోగా. యోగాభ్యాసంతో మ‌నం కొత్త యుగాన్ని... ఏక‌త‌, స‌మ‌త‌ల‌తో కూడిన యుగాన్ని సృష్టిద్దాం.

ఐక్య‌రాజ్య‌స‌మితిలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం గురించి భార‌త్ ప్ర‌తిపాదించిన‌ప్పుడు ప్ర‌పంచం సాద‌రంగా స్వాగ‌తించింది.

ఆ మేర‌కు 2015, 2016 సంవ‌త్స‌రాల్లో జూన్ 21న అనేక దేశాలు యోగా దినోత్స‌వాన్ని అమితోత్సాహంతో నిర్వ‌హించాయి.

కొరియా, కెన‌డా, స్వీడ‌న్‌, ద‌క్షిణాఫ్రికా- దేశం ఏదైనా కావ‌చ్చు.. ప్ర‌పంచంలోని ప్ర‌తి ప్రాంతంలో యోగులు యోగాభ్యాసం ద్వారా ఉషా కిర‌ణాలకు స్వాగ‌తం ప‌లికారు.

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ నిర్వ‌హ‌ణ‌లో అన్ని దేశాలూ ఏకం కావ‌డం ఏక‌త‌తో యోగాకుగ‌ల వాస్త‌వ ప్రాముఖ్యాన్ని చాటుతోంది.

శాంతి, క‌రుణ‌, సోదరభావం, స‌ర్వ‌తోముఖాభివృద్ధితో కూడిన మాన‌వ‌జాతి యుగాన్ని.. ఓ కొత్త యుగాన్ని సృష్టించ‌డంలో యోగా త‌న సామ‌ర్థ్యాన్ని చాటుకోగ‌ల‌దు. సాధార‌ణ‌, అతిసామాన్య ప్ర‌జానీకం నుంచే యోగుల‌ను త‌యారు చేయ‌డం స‌ద్గురు సాధించిన అసాధార‌ణ విజ‌యం. ఈ ప్ర‌పంచంలో ప‌నిచేస్తూనే, త‌మ కుటుంబాల‌తో ఉంటూనే త‌మ‌లో తాము అత్యున్న‌త శిఖ‌రాన జీవిస్తున్న‌వారు నిత్యం అద్భుత‌, అమితానందంతో కూడిన అనుభ‌వాల‌ను చ‌విచూస్తున్నారు. ఎవ‌రెక్క‌డున్నా, ఎలాంటి ప‌రిస్థితుల న‌డుమ ఉన్నా ఎవ‌రైనా యోగి కావ‌చ్చు.

సంతోషంతో ప్ర‌కాశిస్తున్న అనేక వ‌ద‌నాల‌ను నేనిక్క‌డ చూస్తున్నాను. అమితమైన ప్రేమ‌, శ్ర‌ద్ధ‌ల‌తో ప‌నిచేస్తూ ప్ర‌తి చిన్న అంశంపైనా దృష్టి నిలుపుతూ ప‌నిచేస్తున్న‌ వారిని చూస్తున్నాను. ఉన్న‌త ల‌క్ష్యం కోసం అత్యంత శ‌క్తి, ఉత్సాహంతో త‌మ‌ను తాము అంకితం చేసుకోగ‌ల వ్య‌క్తుల‌ను నేను చూస్తున్నాను.

యోగాను అభ్య‌సించేలా అనేక త‌రాల‌కు ఆదియోగి స్ఫూర్తిని అందిస్తారు. దీనినంతటినీ మ‌న ముందుకు తీసుకువచ్చినందుకు స‌ద్గురుకు ఇవే నా కృత‌జ్ఞ‌త‌లు.

మీకు ధ‌న్య‌వాదాలు. మీకు బహుధా ధన్యవాదాలు.
ప్రణామాలు.. వ‌ణ‌క్కం