అమ్మా మీకు నా ప్రణామాలు
వేదిక మీద ఉన్నమానవీయ వ్యక్తులు
నమస్కారం!
ఈ ధర్మపరాయణ మరియు పవిత్ర సందర్భంలో, అమ్మ కు నా ప్రగాఢ నమస్కారములు అందజేస్తున్నాను. ఆ ఈశ్వరుడు ఆమెకు పూర్ణ జీవనాన్ని చక్కని ఆరోగ్యాన్ని అందించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. లక్షలాది భక్తులకు మార్గం చూపే వెలుగు ఆమె. అంతే కాదు, అనేక మంది భక్తులకు జీవన సమానార్థక పదం అయ్యారామె. నిజమైన మాత మాదిరిగానే, ఆమె తన భక్తులను ప్రత్యక్ష, పరోక్ష చర్యల ద్వారాను; కనిపించే మరియు కనిపించని హస్తాల ద్వారాను పోషిస్తారు.
అమ్మ ఆశీర్వాదాలను, బేషరతు ప్రేమను అందుకొంటున్న వారిలో నేను ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. మూడు సంవత్సరాల కిందట, అమ్మ 60వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నా ప్రణామాలు అర్పించడం కోసం అమృతపురికి చేరుకొనే అవకాశం నాకు దక్కింది. ఈ రోజు వేడుకలకు స్వయంగా హాజరయ్యే భాగ్యం నాకు లభించకపోయినప్పటికీ, సాంకేతిక విజ్ఞానం సాయంతో ఆమెకు శుభాకాంక్షలను అందించగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే కేరళ నుండి తిరిగి వచ్చాను, కేరళ ప్రజలు నా మీద కురిపించిన ప్రేమ, అనురాగాలకు నేను చలించిపోయాను.
భారతదేశం తాము చూసే ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూసిన సాధువుల గడ్డ. అటువంటి వాటిలో మానవజాతి ప్రముఖమైంది. అందువల్లే మానవజాతికి సేవ చేయడం వారి ధర్మసూత్రం అయింది. అమ్మ తన బాల్యంలో సైతం తన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వడాన్ని ఇష్టపడేవారన్న సంగతి నాకు తెలుసు. వృద్ధులు, ముసలి వారికి సేవ చేయడం, పేదలను ఆదుకోవడం తన చిన్నతనపు ఉద్వేగాలుగా నిలచాయి.
అలాగే, ఆమె తన చిన్నప్పుడు కృష్ణ భగవానుని పూజించే వారు.
ఈ రెండు గుణాలు ఆమె బలంగా మారాయి. దైవ భక్తి మరియు పేదల పట్ల సమర్పణ భావం ఈ విధంగా అమ్మ తో నా సహవాసం నుండి నేను వ్యక్తిగతంగా స్వీకరించిన సందేశమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది భక్తులు కూడా నమ్ముతున్నది ఇదే.
అమ్మ నడుపుతున్న వివిధ సంస్థలు, కార్యక్రమాలు చేపడుతున్న సామాజిక, దాతృత్వ కార్యక్రమాల గురించి నేనెరుగుదును. ప్రపంచంలోని బీదలకు వారి అయిదు మౌలిక అవసరాలైన ఆహారం, ఆశ్రయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనాధారం సమకూర్చుకోవడంలో సహాయపడాలని ఆమె ఎల్లప్పుడూ ఉత్సుకతతో ఉంటారు.
మరీ ముఖ్యంగా పారిశుద్ధ్యం, నీరు, గృహ నిర్మాణం, విద్య మరియు ఆరోగ్య రంగాలలో చేసిన పనులు, ఇచ్చిన విరాళాలను గురించి నేను ప్రస్తావించదలచాను. ఆ ప్రయోజనాలను అందుకొన్న వారిలో కొంత మంది ఈ రోజు వారి సర్టిఫికెట్ లను అందుకొంటారు. ప్రత్యేకించి, మరుగుదొడ్లను నిర్మించడంలో అమ్మ తీసుకొన్న చొరవ మన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఎంతో గొప్ప సహాయంగా నిలచింది. కేరళలో పారిశుద్ధ్య కృషి కోసం ఒక వంద కోట్ల రూపాయలను ఇస్తామంటూ అమ్మ వాగ్దానం చేశారు. ఈ వాగ్దానంలో పేదవారికి పదిహేను వందల మరుగుదొడ్ల నిర్మాణం కూడా కలసి ఉంది. ఈ రోజు, రాష్ట్రం అంతటా రెండు వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని అమ్మ ఆశ్రమం ఇప్పటికే పూర్తి చేసినట్లు నాకు సమాచారం ఉంది.
పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వ రంగాలలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని నేను ఎరుగుదును. ఒక ఏడాది క్రితం, నమామి గంగే కార్యక్రమానికి అమ్మ ఉదారంగా ఒక వంద కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల కష్టాలను ఉపశమింపచేయడం కోసం అమ్మ ఆపన్న హస్తాలు చాచారు.. ఈ విషయం కూడా నాకు తెలుసును. ప్రపంచం యొక్క అత్యంత తీవ్ర సమస్యలలో కొన్నింటిని పరిష్కరించడం కోసం అమృత యూనివర్సిటీ పరిశోధకులు కొత్త కొత్త వైఖరులను కనుగొనేందుకు కృషి చేస్తుండడం కూడా ధైర్యాన్ని ఇచ్చే అంశమే.
చివరలో, ఈ వేడుకలలో పాలుపంచుకొనే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేయదలచుకుంటున్నాను.
మరో సారి అమ్మ కు నేను నా ప్రగాఢ ప్రణామాలను అందజేస్తున్నాను.