సహాయక కార్యదర్శుల ముగింపు సమావేశంలో భాగంగా 2014 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో తమ నివేదికలను సమర్పించారు.
పాలనకు చెందిన వేరు వేరు ఇతివృత్తాలలో నుండి అధికారులు సమర్పించిన నివేదికలలో ఎంపిక అయిన 8 నివేదికలలోను ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డిబిటి), స్వచ్ఛ భారత్, ఇ-కోర్టులు, పర్యటన, ఆరోగ్యం మరియు శాటిలైట్ అప్లికేషన్స్ ఇన్ గవర్నెన్స్ ల వంటి ఇతివృత్తాల తాలూకు నివేదికలు ఉన్నాయి.
ఈ సందర్భంగా యువ అధికారులు కూలంకష నివేదికలను సమర్పించినందుకు వారిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఐఎఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వానికి సహాయక కార్యదర్శులుగా తీసుకోవాలన్న ఏర్పాటు వెనుక యువత తో పాటు అనుభవజ్ఞులైన అధికారుల మేలుకలయికగా ఉండి ఉత్తమమైన ఫలితాలను ఆవిష్కరించగలదన్న భావన ఉందన్నారు. ఈ రోజు ముందుకు వచ్చిన ఫలితాలు ఈ స్వప్నం సరి అయిన రీతిలోనే సాకారం కాగలదన్న తృప్తిని తనకు మిగిల్చాయని ఆయన చెప్పారు.
జట్టు స్ఫూర్తిని ఒంటబట్టించుకోవలసిందిగా అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. వారు ఏ హోదాలో పనిచేసినప్పటికీ అంతవరకు అమలవుతున్న పాత పద్ధతులను ఛేదించి వాటి చోటులో నవీన మెలకువలకు స్థానం కల్పించడం కోసం కృషిచేయాలని సూచించారు.
విధానాలపై రాజకీయాలు స్వారీ చేయకూడదని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. అధికారులు వారి నిర్ణయ రూపకల్పన లో రెండు గీటురాళ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని వాటిలో.. ఆ నిర్ణయాలు ఎన్నడూ దేశ హితానికి విరుద్ధమైనవి కాకూడదనేది ఒకటోది, ఆ నిర్ణయాలు నిరుపేదలకు హాని కలిగించేవిగా ఉండకూడదనేది రెండోది.. అని ఆయన నొక్కిచెప్పారు.