UAE is one of our most valued partners and a close friend in an important region of the world: PM
We regard UAE as an important partner in India’s growth story: PM Modi
UAE can benefit by linking with our growth in manufacturing and services: PM
Our energy partnership, is an important bridge in our linkages: PM at joint press statement with Crown Prince of Abu Dhabi
Security and defence cooperation have added growing new dimensions to India-UAE relationship: PM
India-UAE economic partnership can be a source of regional and global prosperity: PM

శ్రేష్ఠుడైన అబు ధాబీ యువ‌రాజు శ్రీ శేఖ్ మొహ‌మ్మ‌ద్ బిన్ జాయేద్ అల్ న‌హ్యాన్‌ గారు,

పాత్రికేయ మిత్రులారా,

భార‌త‌దేశ ప్రియ మిత్రుడు, శ్రేష్ఠుడు యువ‌రాజు శ్రీ షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ జాయేద్ అల్ న‌హ్యాన్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం నాకెంతో సంతోషం క‌లిగిస్తోంది. ఆయ‌న రెండో సారి భార‌తదేశంలో అధికారికంగా ప‌ర్య‌టించ‌డం మ‌రింత ఆనందక‌రం. అందులోనూ రేపు మ‌న గ‌ణ‌తంత్ర దిన వేడుక‌ల‌లో యువ‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొన‌నుండ‌టం ఈ ప‌ర్య‌ట‌న‌కు మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించింది. యువ‌రాజా, 2015 ఆగ‌స్టులోనూ, నిరుడు ఫిబ్ర‌వ‌రిలోనూ మ‌న ఆత్మీయ సమావేశాన్ని ఈ సంద‌ర్భంగా ఒక మ‌ధుర జ్ఞాప‌కంగా భావిస్తున్నాను. మ‌న ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాల‌పైనా అప్ప‌ట్లో మ‌నం విస్తృతంగా చ‌ర్చించుకున్నాం. ప్ర‌పంచంపై మీ దృక్ప‌థం, మ‌న భాగ‌స్వామ్యంపై మీ దృష్టికోణం, మా ప్రాంతంపై మీకున్న ఆద‌రాభిమానాల వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా నేనెంతో ల‌బ్ధి పొందాను. యువ‌రాజా, మీ నాయ‌క‌త్వంలో మ‌న సంబంధాల‌లో స‌రికొత్త‌, విజ‌య‌వంత‌మైన స‌హోత్తేజ‌ం మ‌న‌కు సాధ్య‌మైంది. మ‌న స‌మ‌గ్ర వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని ల‌క్ష్య‌ నిర్దేశితం, ఆచ‌ర‌ణ‌పూరితం చేసేదిశ‌గా చ‌ర్చ‌లు సాగించేందుకు మ‌నం ఒక ఆశావ‌హ మార్గ ప్ర‌ణాళిక‌ను రూపొందించాం. దీనిపై కొద్దిసేప‌టి క్రితం ఒప్పంద ప‌త్రాల ఆదాన ప్రదానం ద్వారా మ‌న అవ‌గాహ‌న ఇప్పుడు వ్య‌వ‌స్థీకృతమైంది.

మిత్రులారా,

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) మ‌న అమూల్య భాగ‌స్వాముల‌లో ఒకటి కావ‌డ‌మేగాక ప్ర‌పంచంలోని ఓ ముఖ్య‌మైన ప్రాంతంలో స‌న్నిహిత మిత్రుడు. యువ‌రాజుతో నేనిప్పుడే ఫ‌ల‌వంత‌మైన‌, నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌లు పూర్తిచేశాను. మా గ‌త రెండు స‌మావేశాల సంద‌ర్భంగా తీసుకున్న వివిధ నిర్ణ‌యాల అమ‌లుపై మేం ప్ర‌త్యేకంగా దృష్టి సారించాం. ఇంధ‌నం, పెట్టుబ‌డులుస‌హా కీల‌క రంగాల్లో ఇదే వేగాన్ని స్థిరంగా కొన‌సాగించాల‌ని మేం అంగీకారానికి వ‌చ్చాం.

మిత్రులారా,

భార‌తదేశ ప్ర‌గ‌తి ప‌య‌నంలో యుఎఇ ని ఒక ముఖ్య‌మైన భాగ‌స్వామిగా ప‌రిగ‌ణిస్తున్నాం. భార‌తదేశంలో మౌలిక స‌దుపాయాల రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డంపై వారికిగ‌ల ఆస‌క్తిని నేను ప్ర‌త్యేకించి స్వాగ‌తిస్తున్నాను. ఈ దిశ‌గా మా జాతీయ పెట్టుబ‌డులు- మౌలిక స‌దుపాయాల నిధి (ఎన్ఐఐఎఫ్)తో యుఎఇ లోని వ్య‌వ‌స్థాగ‌త పెట్టుబ‌డిదారుల అనుసంధానం కోసం మేం కృషి చేస్తున్నాం. 2020లో దుబయి లో నిర్వ‌హించ‌బోయే విశ్వ ప్ర‌ద‌ర్శ‌న (World EXPO) సంబంధిత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో భాగ‌స్వాముల‌య్యేందుకు భార‌తీయ కంపెనీలకున్న ఆస‌క్తిని గురించి కూడా.. శ్రేష్ఠుడైన యువ‌రాజుతో చ‌ర్చించాను. వ‌స్తు త‌యారీ, సేవ‌ల రంగాలలో మ‌న వృద్ధితో సంధానం ద్వారా యుఎఇ కూడా ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌దు. డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మాన‌వ మూల‌ధ‌నం, భార‌త‌దేశ ప‌ట్ట‌ణాల‌ ఆధునికీక‌ర‌ణల‌పై మ‌న చొర‌వ‌ నుండి ఉత్ప‌న్న‌మ‌య్యే అపార అవ‌కాశాల‌ను మ‌నం సంయుక్తంగా అందిపుచ్చుకోవ‌చ్చు. అలాగే ద్వైపాక్షిక వాణిజ్య ప్ర‌మాణం ప‌రిమాణాల మెరుగుద‌ల కోసం రెండు దేశాల్లోని ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు సౌల‌భ్యాలు క‌ల్పిస్తున్నాం. వాణిజ్య‌ ప‌రిష్కారాల‌పై ఇవాళ సంత‌కాలు పూర్తి అయిన ఒప్పందం మ‌న వాణిజ్య భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ముందుకు న‌డుపుతుంది. మ‌న సంబంధాల‌లో ఇంధ‌న భాగ‌స్వామ్యం ఓ ముఖ్య సేతువు.. అది మ‌న ఇంధ‌న భ‌ద్ర‌త‌కు ఎంతగానో తోడ్ప‌డుతుంది. మ‌న ఇంధ‌న బంధాన్ని నిర్దిష్ట ప‌థ‌కాలు, ప్ర‌తిపాద‌న‌ల‌తో వ్యూహాత్మ‌క దిశ‌లో మార్పు కలిగించే మార్గాల‌పై యువ‌రాజు, నేను చ‌ర్చించాం. దీనికి సంబంధించి ఇంధ‌న రంగంలో దీర్ఘ‌కాలిక ఒప్పందాలు, సంయుక్త సంస్థ‌ల ఏర్పాటు వంటివి ప్ర‌యోజ‌న‌క‌ర మార్గాలు కాగ‌ల‌వు.

మిత్రులారా,

భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ స‌హ‌కారం కూడా మ‌న సంబంధాల్లో అద‌నపు కొత్త కోణాల‌ను చేరుస్తున్నాయి. ర‌క్ష‌ణ‌కు సంబంధించి స‌ముద్రాంత‌ర వ్య‌వ‌హారాలు స‌హా కొత్త రంగాలలో ప్ర‌యోజ‌న‌క‌ర స‌హ‌కార విస్త‌ర‌ణ‌పై మేమొక అంగీకారానికి వ‌చ్చాం. ఆ మేర‌కు ర‌క్ష‌ణ స‌హ‌కారంపై అవ‌గాహ‌న ఒప్పందంపై ఇంత‌కుముందే సంత‌కాలు పూర్త‌ి అయ్యాయి. ఇక మ‌న ర‌క్ష‌ణ సంబంధాలు స‌రైన దిశ‌లో సాగ‌డానికి ఇది తోడ్ప‌డుతుంది. అలాగే హింస‌ను, తీవ్ర‌వాదాన్ని ఎదుర్కోవడంలో రెండు దేశాల మ‌ధ్య పెరుగుతున్న స‌హ‌యోగం మ‌న స‌మాజాల భ‌ద్ర‌తకు ఎంతో అవ‌స‌ర‌మ‌ని మేం భావిస్తున్నాం.

మిత్రులారా,

ఈ స‌న్నిహిత సంబంధాలు మ‌న రెండు దేశాల‌కు ముఖ్య‌మైన‌వి మాత్ర‌మే గాక ఇరుగుపొరుగు విష‌యంలోనూ వాటికి ప్రాధాన్యం ఉంద‌ని యువ‌రాజు, నేను విశ్వ‌సిస్తున్నాం. మా ఏకీభావం ఈ ప్రాంతంలో సుస్థిర‌తను కొనితేవ‌డానికి తోడ్ప‌డుతుంది. అలాగే మ‌న ఆర్థిక భాగ‌స్వామ్యం ప్రాంతీయ‌ సౌభాగ్యానికి, అంత‌ర్జాతీయ సౌభాగ్యానికి వ‌న‌రు కాగ‌ల‌దు. ప‌శ్చిమాసియా, గ‌ల్ఫ్ దేశాల‌లో ప‌రిణామాల‌పైనే గాక శాంతి, సుస్థిర‌త‌ల‌పై రెండు దేశాల ఆస‌క్తిని గురించి కూడా మేం మా అభిప్రాయాల‌ను ప‌ర‌స్ప‌రం వెల్ల‌డించుకున్నాం. అంతేగాక అఫ్గానిస్తాన్‌ స‌హా ఈ ప్రాంత ప‌రిణామాల‌పైనా చ‌ర్చించాం. తీవ్ర‌వాదం నుండి, ఉగ్ర‌వాదం నుండి రెండు దేశాలలో ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌ల‌కు వాటిల్లుతున్న ముప్పును గురించి, దీని నివార‌ణ‌లో స‌హ‌కారాన్ని గురించి మా అభిప్రాయాలను, ఆందోళ‌న‌ల‌ను మేం ఒకరికి మరొకరం తెలియజేసుకున్నాం.

మిత్రులారా,

యుఎఇ దాదాపు 26 ల‌క్ష‌ల మంది భార‌తీయుల‌కు ఆవాసంగా ఉంది. భార‌తదేశం, యుఎఇ లు రెండింటికీ వారి భాగ‌స్వామ్యం ఎంతో విలువైంది. యుఎఇ లోని భార‌తీయుల సంక్షేమంపై శ్ర‌ద్ధాస‌క్తులు చూపుతున్న‌ యువ‌రాజుకు నా ధ‌న్య‌వాదాలు తెలియజేశాను. అలాగే, అబు ధాబీ లోని ప్ర‌వాస భార‌తీయుల కోసం ఆల‌య నిర్మాణానికి స్థ‌లం కేటాయించ‌డంపైనా ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాను.

మిత్రులారా,

మ‌న భాగ‌స్వామ్య విజ‌యంలో మ‌హోన్న‌తులైన శ్రీ శేఖ్ ఖ‌లీఫా బిన్ జాయేద్ అల్ న‌హ్యాన్, యుఎఇ అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడైన శ్రీ శేఖ్ మొహమ్మ‌ద్‌లు చూపుతున్న వ్య‌క్తిగ‌త శ్ర‌ద్ధాస‌క్తుల పాత్ర ఎన‌లేనిది. ఈ ముంద‌డుగులో భాగంగా మా స‌హ‌కారం మ‌రింత వేగం పుంజుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. యువ‌రాజా, మ‌న మునుప‌టి చ‌ర్చ‌ల సంద‌ర్భంగా కుదిరిన అవ‌గాహ‌న‌ను, స్థిర‌మైన‌ ప్ర‌యోజ‌నాల‌ను మీ తాజా సంద‌ర్శ‌న మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని నేను గ‌ట్టిగా విశ్వ‌సిస్తున్నాను. గంభీర‌, వైవిధ్యం, చోద‌క చొర‌వ‌తో నిండిన మ‌న భాగ‌స్వామ్య భ‌విష్య‌త్ చ‌ట్రాన్ని రూపుదిద్ద‌గ‌ల‌ద‌ని భావిస్తున్నాను. చివ‌ర‌గా, భార‌తదేశాన్ని సంద‌ర్శించాల‌న్న నా ఆహ్వానాన్ని అంగీక‌రించిన యువ‌రాజుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ ప‌ర్య‌ట‌న ఆయ‌న‌కు, ఇత‌ర ప్ర‌తినిధి బృంద స‌భ్యుల‌కు ఆహ్లాదం పంచాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

మీకందరికీ ధ‌న్య‌వాదాలు..బహుథ కృత‌జ్ఞ‌త‌లు.