చురుకైన పాలన, సకాలంలో అమలు అనే నినాదంతో నిర్వహిస్తున్నప్రగతి పథకం ఐదవ సమీక్ష లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు, సేవలకు సంబంధించిన అంశాలపై ప్రధాని సమీక్ష నిర్వహించారు.
పేదల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో తపాల సేవలను మెరుగుపర్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. తపాల కార్యలయాలపై వస్తున్న ఫిర్యాదులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మనియార్డర్, తపాల పొదుపు ఖాతాలు, సకాలంలో సేవలను అందించడం, బట్వాడ లో జాప్యం లేకుండా చూడడం మొదలైన అంశాల్ని మరింత మెరుగు పర్చాలని ప్రధాని సూచించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘర్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, రాజస్థాన్,గుజరాత్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే, రహదారులు, విద్యుత్, టెలీకమ్యునికేషన్, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని సమీక్ష జరిపారు. చెన్నై మెట్రో కారిడార్, పశ్చిమ రవాణ కారిడార్ ప్రాజెక్టుల తీరుతెన్నులపైనా మోదీ సమీక్షలో చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచడం ద్వారా త్వరిత గతిన ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని ప్రధాని సూచించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలను విస్తృత పరచాలని నరేంద్ర మోదీ కోరారు. సాధారణ ప్రజానీకానికి మొబైల్ అనుసంధానత అత్యంత ఆవశ్యకమని మోదీ అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ఇది అత్యతం అవసరమని ప్రధాని అన్నారు. అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని ప్రధాని కోరారు.
నేరాలు, నేరస్థులను పట్టుకునే నెట్వర్క్, వ్యవస్థలు (సీసీటీఎన్ ఎస్) పథకంలో భాగంగా కర్ణాటక, అసోం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో పోలీస్టేషన్లో అధికారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీటిని మరింత అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు కృషి చేయాలని ప్రధాని కోరారు.