US Congressional Delegation calls on the Prime Minister
PM Modi shares India's commitment to further strengthen ties with the US

యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ లోని రెండు రాజకీయ పక్షాలకు చెందిన 26 మంది సభ్యుల ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు భేటీ అయింది.

కాంగ్రెస్ ప్రతినిధివర్గానికి ప్రధాన మంత్రి సాదరంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య ఆదాన ప్రదానాల ఆరంభానికి ఇది ఒక మంచి శకునం అని ఆయన అన్నారు.

అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ తో తాను జరిపిన సకారాత్మక సంభాషణను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య గత రెండున్నర సంవత్సరాలుగా అల్లుకున్న బంధాన్ని మరింత పటిష్టపరిచే దిశగా ప్రయత్నించాలని తాము ఇరువురం సంకల్పించుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. భారతదేశం, యుఎస్ భాగస్వామ్యానికి కాంగ్రెస్ కు చెందిన రెండు పార్టీల ప్రతినిధి వర్గం బలమైన మద్దతును అందించగలదని తాను గ్రహించానని శ్రీ మోదీ పేర్కొన్నారు.

రెండు దేశాల ప్రజల మధ్య నెలకొన్న అనుబంధం అటు అమెరికా, ఇటు భారతదేశం సమృద్ధికి తోడ్పడిందంటూ, ఉభయ దేశాలు మరింత సన్నిహితంగా కృషి చేయగలిగిన రంగాలపై తనకు ఉన్న దృక్పథాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను అమెరికా సమాజాన్ని సుసంపన్నం చేయడంలో నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులు పోషించిన పాత్రను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వృత్తి నిపుణులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాకపోకలు జరిపే విషయంలో సమతౌల్యం కలిగిన మరియు దూరదృష్టి కలిగిన విజన్ ను రూపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.