రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో 1980 దశకాన శ్రీ నరేంద్ర మోదీ ఎదుగుదల, 1990 దశకం ఆరంభంలో ఆయన భారతీయ జనతా పార్టీ లో చేరిన సమయం స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత గడ్డుకాలాలు కావడం యాదృచ్ఛికం. దేశం నలుమూలలా సంఘర్షణలు తలెత్తగా ఈ విచ్ఛిన్నకర పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం నిస్సహాయ సాక్షిగా చేష్టలుడిగి నిలచింది. పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో వైరుధ్యాలు పెచ్చరిల్లి మాతృభూమి సమగ్రత, సార్వభౌమత్వాలకే సవాలు విసిరాయి. అంతర్గతంగానూ విచ్ఛిన్న రాజకీయాలు పేట్రేగిపోయాయి. గుజరాత్ ప్రజల దైనందిన జీవన నిఘంటువులో ‘కర్ఫ్యూ’ అన్నది సర్వసాధారణ పదంగా మారిన కాలమది. వోట్ బ్యాంకు రాజకీయాలే ఓ కట్టుబాటులా తయారై సహోదరులై ప్రత్యర్థులయ్యారు... సమాజాల మధ్య వ్యతిరేకతలు తలెత్తాయి. ఆ సమయంలో ఒక వ్యక్తి తలెత్తుకు నిలబడ్డాడు. శక్తిమంతమైన, ఐక్య భారతదేశ దార్శనికుడైన సర్దార్ పటేల్ స్ఫూర్తిని నిలుపుతూ ప్రజాస్వామ్య విలువలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిరూపంగా నిలిచిన ఆ వ్యక్తే శ్రీ నరేంద్ర మోదీ. ఇటువంటి విషాదకర జాతీయ పరిస్థితులు శ్రీ నరేంద్ర మోదీలోని దేశభక్తుడిని వెలుగులోకి తీసుకురాగా, ఆదర్శాల కోసం సాగిన పోరులో ఆర్ ఎస్ ఎస్, బీజేపీల అభ్యున్నతి కోసం ఆయన అత్యుత్తమంగా కృషి చేశారు. అదే సమయంలో అత్యంత పిన్నవయసులోనే నిబద్ధతగల కార్యకర్తగా, నిర్వహణ సమర్థుడుగా తనను తాను నిరూపించుకున్నారు. ఎలాంటి అనారోగ్యకర సవాళ్లనైనా సమర్థంగా ఎదుర్కొనగల ఆయన దీక్షాదక్షతలు లోకవిదితమయ్యాయి.
ఏకతా యాత్ర సందర్భంగా అహ్మదాబాద్‌లో శ్రీ నరేంద్ర మోదీ
ఒకనాడు దేశ ఉత్తరాగ్రంలో ‘భూ తల స్వర్గం’గా పేరుపొందిన జమ్ము & కశ్మీర్ 1980 దశకం ముగిసే సమయానికి పూర్తి స్థాయి యుద్ధక్షేత్రంలా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు 1987నాటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా దారుణ ప్రజాస్వామ్య కూల్చివేత తోడై జమ్ము & కశ్మీర్ ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చివేశాయి. వీధులు నిత్యం రక్తసిక్తమవుతూ భూమిపైనే అత్యంత సుందర ప్రదేశంగా పిలిచే కశ్మీర్ లోయ కాస్తా యుద్ధభూమిగా వ్యవహరించే దుస్థితికి చేరువైంది. చివరకు కశ్మీర్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం కూడా నిషేధమనే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. ఈ దు:స్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత గల కేంద్రం ఉపశమన చర్యలకు బదులు చేష్టలుడిగి మౌనసాక్షిలా ఉండిపోయింది.
జాతి వ్యతిరేక శక్తులు 1989లో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్‌ను అపహరించుకుపోయాయి. ఈ సంక్లిష్ట పరిస్థితిలో దృఢవైఖరిని ప్రదర్శించాల్సిన కేంద్రం అందుకు బదులుగా సులభ మార్గాన్ని ఎంచుకొంది. తదనుగుణంగా భారత వ్యతిరేక భావాలున్న వారుగా ముద్రపడిన తీవ్రవాదులను తక్షణమే విడుదల చేసి, జాతి వ్యతిరేక శక్తుల కార్యకలాపాలకు ఊతమిచ్చేలా వ్యవహరించింది. ఇలా పథకం ప్రకారం దేశ సార్వభౌమత్వాన్ని అవమానించడాన్నిబీజేపీ ఓ మౌన ప్రేక్షకుడిలా చూడలేకపోయింది.
శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్‌ను సందర్శించి తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన కాలమది. అటుపైన దశాబ్దాల అనంతరం జాతి ఐక్యత కోసం గళమెత్తాల్సిన బాధ్యత బీజేపీపై పడింది. ఈ అనూహ్య పరిస్థితికి స్పందనగా జాతీయ ఐక్యతను ప్రబోధిస్తూ ఆనాటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మురళీ మనోహర్ జోషి ‘ఏకతా యాత్ర’ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ మేరకు స్వామి వివేకానందుడు జీవిత పరమార్థాన్ని కనుగొన్న కన్యాకుమారి నుండి యాత్రను ప్రారంభించి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ముగించాలని నిశ్చయించారు. శ్రీ నరేంద్ర మోదీ నిర్వహణ సామర్థ్యనైపుణ్యాలు అప్పటికే దేశవ్యాప్తం కావడంతో ఈ యాత్రకు ప్రణాళిక రచించే బృహత్తర బాధ్యతను ఆయన భుజస్కంధాలపై మోపారు
ఈ యాత్ర నిర్వహణలో ఎన్నో తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నా తన మేధస్సును రంగరించి, శక్తిసామర్థ్యాలను ప్రోది చేసుకుని, చెమటోడ్చి తనకు అప్పగించిన బాధ్యతల మేరకు అతి తక్కువ సమయంలోనే ఆయన విస్తృత ఏర్పాట్లు చేశారు. యాత్ర సాగే ప్రదేశాలన్నటా ఆయన ఎలాంటి భయాందోళనలు లేకుండా పర్యటించి, పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ వారిలో ఉత్సాహం, స్ఫూర్తి నింపారు. వారి హృదయాల్లోని దేశభక్తిని మరింతగా రగిల్చారు. ఆ విధంగా యాత్రను విజయవంతం చేయడానికి రంగం సిద్ధం చేశారు
ఈ ప్రక్రియలో భాగంగా నిర్వాహక సమర్థుడినేగాక ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమిత వేగంగా, ప్రభావవంతంగా పనిచేయగలవాడుగా తన సత్తాను చాటుకున్నారు. నేటి ప్రజా జీవనంలో ఇలాంటి స్వభావం, సామర్థ్యం కలిగి ఉండటం అరుదే. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ తాను అనుకున్నది నెరవేర్చగల ప్రతిభాశాలిగా శ్రీ మోదీ గుర్తింపు పొందారు.
ఏకతా యాత్రలో శ్రీ నరేంద్ర మోదీ
ఏకతా యాత్ర 1991 డిసెంబరు 11న ప్రారంభం కాగా, అదేరోజు కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి, గురు తేగ్ బహదూర్ ‘బలిదాన దినం’ కావడం కాకతాళీయం. దేశవ్యాప్తంగా సాగిన ఈ యాత్రలో భాగంగా విచ్ఛిన్న, హింసా రాజకీయాలకు వ్యతిరేకంగానేగాక కశ్మీర్లో ఉగ్రవాదానికి స్వస్తి పలుకుదామన్న పిలుపు మారుమోగింది. తాను వెళ్లిన చోటల్లా శ్యామా ప్రసాద్ ముఖర్జీ సందేశాన్ని శ్రీ మోదీ ప్రతిధ్వనింపజేశారు. అన్నిటికన్నాదేశ ఐక్యతకే ప్రాధాన్యమని, మిగిలినవన్నీ ఆ తర్వాతేనని చాటారు. అలాగే సమాజంలోని భిన్న వర్గాలకు భిన్న కొలబద్దలు ఉంటాయన్న వాదనను ఆయన ఎన్నడూ విశ్వసించలేదు. జాతి వ్యతిరేక శక్తులకు దీటైన జవాబివ్వడమే తక్షణ కర్తవ్యమని భావించిన శ్రీ మోదీ సమయం వచ్చినప్పుడల్లా ముందుండి నడిపించారు. ఏకతా యాత్రకు ప్రతి చోటా అనూహ్య స్వాగతం లభించింది. జాతీయ పునరుత్తేజం అవసరాన్ని డాక్టర్ జోషి ప్రతి చోటా నొక్కిచెప్పగా ప్రజానీకం నుండి తక్షణ, విశేష స్పందన వచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించడంలో ఏకతా యాత్రకు మించినదేదీ ఉండదు. ఈ యాత్రలో అడుగడుగునా శ్రీ నరేంద్ర మోదీ నిర్వహణ సామర్థ్యం వెల్లడవుతూ సంకల్పం విజయవంతం కావడం ఓ మైలురాయిగా నిలిచిందన్నది యదార్థం. మిథ్యా లౌకికవాదం, వోట్ బ్యాంకు రాజకీయాలకు మరణ శాసనం రాయాల్సిందిగా శ్రీ మోదీ స్వయంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. చివరకు యాత్ర ముగింపు సందర్భంగా 1992 జనవరి 26న శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడడాన్ని శ్రీ నరేంద్ర మోదీ భావోద్వేగంతో తిలకించారు! అత్యంత సంక్లిష్ట పరిస్థితుల నడుమ ఈ జాతీయ స్థాయి ఉద్యమం విజయవంతం కావడం శ్రీ మోదీ సామర్థ్యానికి తిరుగులేని ప్రశంస. అంతేకాదు... జాతి వ్యతిరేక శక్తులకు అసమాన సాహసం, దార్శనికత, నైపుణ్యంతో దీటైన జవాబిచ్చారు. భారత వ్యతిరేక శక్తులకు భరతమాత శక్తియుక్తులేమిటో రుచి చూపించి వాటి మూర్ఖత్వానికి అంతం పలికారు.