ఉత్తమ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టినందుకు ఆర్థిక మంత్రి శ్రీ అరుణ‌్ జైట్లీ ని అభినందిస్తున్నాను. ఇది పేద‌ల‌కు సాధికారితను క‌ల్పించ‌గలుగుతుంది. అంతే కాక అన్ని వ‌ర్గాల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఉంది. ప్రతి ఒక్కరి అంచనాలను నెరవేర్చగలిగే అంశాలు.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమివ్వ‌డంతో పాటు ఆర్థిక వ్యవస్థను బ‌లోపేతం చేయగలదు. అభివృద్ధిని ఉత్తేజ‌ప‌రుస్తుంది కూడా. జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం నుండి సమాచార ర‌హ‌దారుల (I-ways) దాకా, ప‌ప్పుధాన్యాల ధ‌ర‌ల నుంచి డేటా స్పీడ్ దాకా, రైల్వేల ఆధునికీక‌రణ నుండి స‌ర‌ళమైనటువంటి ఆర్థిక వ్యవస్థల నిర్మాణం దాకా, విద్య‌ నుండి ఆరోగ్యం దాకా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌ నుండి ప‌రిశ్ర‌మ‌ దాకా, జౌళి ఉత్ప‌త్తిదారుల నుండి ప‌న్ను మిన‌హాయింపుల‌ దాకా.. ఈ బడ్జెటు లో పొందుపరచబడి ఉన్నాయి. ఈ చ‌రిత్రాత్మ‌క బ‌డ్జెటును రూపొందించిన ఆర్థిక మంత్రి, ఆయ‌న జట్టు సభ్యులందరూ ప్ర‌శంసకు అర్హులైన వారే అని చెబుతున్నాను.

గత రెండున్నర సంవత్సరాలలో ప్రభుత్వం చేప‌ట్టిన అభివృద్ధి కార్యక్రమాల‌కు, ప్ర‌గ‌తిప‌థంలో ప‌రుగు వేగాన్ని కొన‌సాగించాల‌న్న దార్శనికతకు ఈ బ‌డ్జెటు ఒక ప్ర‌తిబింబంగా నిలిచింది. ముఖ్యంగా రైల్వే బ‌డ్జెటును సాధార‌ణ బ‌డ్జెటులో విలీనం చేయ‌డం కీల‌కమైన ఒక ముంద‌డుగు. ర‌వాణా రంగంలో స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌కు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. దేశ ర‌వాణా అవ‌సరాల‌ను తీర్చ‌డంలో రైల్వేలు ఇక మ‌రింత మెరుగైన విధంగా త‌న‌ వంతు పాత్ర‌ను పోషించవచ్చు.

వ్యవ‌సాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక స‌దుపాయాల రంగాల‌పై ఈ బడ్జెట్ ప్ర‌ధానంగా దృష్టి సారించింది. పెట్టుబడులను, ఉపాధి అవకాశాలు పెంచాల‌న్న ప్ర‌భుత్వ క‌ట్టుబాటును కూడా ఇది ప్ర‌తిఫ‌లించింది. ఈ రంగాలకు నిధుల కేటాయింపుల‌ను గ‌ణ‌నీయంగా పెంచాం. రైల్వే లు, రోడ్డు ర‌వాణా రంగాల‌లో ప్ర‌భుత్వ వ్య‌యాన్ని కూడా గ‌ణ‌నీయంగా పెంచారు. దేశంలోని రైతులంద‌రి ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు, ప‌థ‌కాల‌ను రూపొందించాం. రైతులు, గ్రామాలు, స‌మాజంలోని నిరుపేద‌లు, ద‌ళితులు, అణగారిన వర్గాలకే ఈ బడ్జెట్‌ లో గ‌రిష్ఠ ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది. గ్రామీణ భార‌తంలో ఆర్థిక ప‌రిస్థితిని మెరుగుప‌ర‌చ‌గ‌ల అత్యుత్త‌మ సామ‌ర్థ్యం గ‌ల రంగాలుగా వ్యవసాయం, ప‌శు సంవ‌ర్ధ‌క‌ం, పాడి, మత్స్య పరిశ్రమ, వాటర్‌షెడ్ డెవలప్ మెంట్, స్వచ్ఛ భారత్ అభియాన్ త‌దిత‌రాల‌కు ప్రాముఖ్యం ఉంది. అంతేకాకుండా, గ్రామీణ జీవ‌న నాణ్య‌త‌ను గ‌ణ‌నీయంగా మెరుగుప‌ర‌చ‌గ‌ల రంగాలివే.

ఉద్యోగావ‌కాశాలను పెంచ‌డంపై బ‌డ్జెట్ దృష్టి సారించింది. ఆ మేర‌కు ఎల‌క్ట్రానిక్ త‌యారీ, జౌళి వంటి రంగాల‌లో ఉపాధి అవ‌కాశాల కల్పన కోసం ప్ర‌త్యేక కేటాయింపులు చేశారు. అవ్య‌వ‌స్థీకృత రంగంలో ప‌నిచేస్తున్న‌ వారిని వ్య‌వ‌స్థీకృత రంగంలోకి తీసుకువచ్చేందుకు వెసులుబాటును క‌ల్పించారు. దేశ యువ‌త‌ను దృష్టిలో పెట్టుకొని, మ‌న దేశానికి గ‌ల జ‌న‌ సంబంధ సానుకూల‌త‌ను స‌ద్వినియోగం చేసుకునే విధంగా నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయింపులను గ‌ణ‌నీయంగా పెంచారు. ఇక మ‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థకం కోసం క‌ని విని ఎరుగ‌నంత‌టి స్థాయిలో కేటాయింపులు చేశారు. మ‌హిళా సంక్షేమం కూడా మా ప్ర‌భుత్వ ప్రాథమ్యాల‌లో ఒక‌టిగా ఉంది. త‌ద‌నుగుణంగా మ‌హిళల, శిశువుల సంక్షేమానికి సంబంధించిన ప‌థ‌కాల‌పై వ్య‌య కేటాయింపులు పెంచారు. అలాగే ఉన్న‌త‌ విద్య‌, ప్ర‌జారోగ్యం కోసం కూడా బ‌డ్జెట్ కేటాయింపులను త‌గిన‌ మేర పెంచారు. గృహ‌ వ‌స‌తి క‌ల్ప‌న‌, నిర్మాణ‌ రంగాలు ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధిలోను, కొత్త ఉద్యోగావ‌కాశాల సృష్టిలోను ప్ర‌ధాన పాత్రను పోషించగలవు. ఆ మేర‌కు గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాలలో గృహ‌ వ‌స‌తి క‌ల్ప‌న‌కు ఈ బ‌డ్జెట్‌లో పెద్ద‌ పీట వేయడమైంది.

రైల్వే శాఖ బ‌డ్జెట్‌కు సంబంధించి భ‌ద్ర‌త‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌మిచ్చారు. ఆ మేర‌కు రైలు ప్ర‌యాణ భ‌ద్ర‌త‌పై అధిక నిధుల‌ వ్య‌యం దిశ‌గా రైల్వే భ‌ద్ర‌త నిధిని ఏర్పాటు చేశారు. రైలు మార్గ, రోడ్డు మార్గ ర‌వాణా రంగాల మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ కోసం మూల‌ధ‌న వ్య‌యాన్ని ఈ బ‌డ్జెట్‌లో గ‌ణ‌నీయంగా పెంచారు. ఇక డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌గా రూపొందించిన స‌మ‌గ్ర ప్యాకేజీ వ‌ల్ల‌ ప‌న్నుల ఎగ‌వేత‌కు అడ్డుక‌ట్ట ప‌డట‌మే గాక న‌ల్ల‌ధ‌నం చెలామణీ అదుపు లోకి వ‌స్తుంది. డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఊపిరి పోసే క‌స‌రత్తును ఉద్య‌మ‌ స్థాయిలో చేప‌ట్టాం. ఆ మేర‌కు 2017-18లో 2500 కోట్ల డిజిట‌ల్ లావాదేవీల‌ను ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాం.

మ‌ధ్య త‌ర‌గ‌తికి ఊర‌ట‌నిచ్చే ప‌న్నుల సంబంధ సంస్క‌ర‌ణ‌లను, స‌వ‌ర‌ణ‌లను ఆర్థిక మంత్రి తీసుకువ‌చ్చారు. దీంతో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, ఉద్యోగావ‌కాశాల సృష్టి సాధ్య‌మ‌వుతుంది. త‌ద్వారా వివక్ష‌కు అడ్డుక‌ట్ట ప‌డి, ప్రైవేటు పెట్టుబ‌డుల‌కు ప్రోత్సాహకాలు ల‌భిస్తాయి. వ్య‌క్తిగ‌త ప‌న్ను భారం త‌గ్గించే చ‌ర్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజల మనసులను ఆకట్టుకోగ‌ల ప్రాధాన్యం కలిగిన అంశమే. ఆదాయ‌పు ప‌న్ను విధింపును 10 శాతం నుండి 5 శాతానికి త‌గ్గించ‌డ‌మ‌న్న‌ది సాహసోపేతమైన చ‌ర్య‌ అవుతుంది. ఈ నిర్ణ‌యంతో దేశంలోని చాలా మంది ప‌న్ను చెల్లింపుదారులు ల‌బ్ధి పొందగలుగుతారు. ఇక అవినీతిపైన, న‌ల్ల‌ధ‌నంపైన మీరంతా నా పోరాటాన్ని చూసే ఉంటారు. రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు త‌ర‌చూ చ‌ర్చ‌నీయాంశంగా ఉంటోంది. ఈ విష‌యంలో అన్ని పార్టీల‌పై ప్ర‌జ‌లు క‌న్నేసి ఉంచారు. ఎన్నిక‌ల‌కు నిధుల కేటాయింపున‌కు సంబంధించి ఆర్థిక‌ మంత్రి ప్ర‌క‌టించిన కొత్త ప‌థ‌కం కూడా న‌ల్ల‌ధ‌నంపైన, అవినీతిపైన మేం చేస్తున్న పోరాటం మీద ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణ‌మైందే.

దేశ‌వ్యాప్తంగా ఉపాధి అవ‌కాశాల సృష్టిలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్ర‌పంచ స్థాయి విప‌ణిలో పోటీప‌డ‌టం క‌ష్ట‌త‌రంగా ఉంద‌ని, పన్ను భారం తగ్గిస్తే 90 శాతం చిన్న పరిశ్రమలకు ఎంతో ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఎప్ప‌టి నుండో విజ్ఞ‌ప్తులు వ‌స్తూనే ఉన్నాయి. అందుకే చిన్నత‌రహా పరిశ్రమల నిర్వ‌చ‌నాన్ని స‌వ‌రించి వాటి ప‌రిధిని పెంచ‌డంతో పాటు ప‌న్నును 30 నుండి 25 శాతానికి త‌గ్గించింది. వారి కోసం పన్నును తగ్గించాం. చిన్న పరిశ్రమలు ప్రపంచ విపణితో పోటీపడటానికి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది. అంటే, చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌లో 90 శాతం ల‌బ్ధి పొందుతాయ‌న్న మాట‌. ఇప్పుడిక చిన్న ప‌రిశ్ర‌మ‌లు ప్ర‌పంచ‌ స్థాయి పోటీనిచ్చేందుకు ఈ నిర్ణ‌యం తోడ్ప‌డుతుంద‌ని నేను ఆశాభావంతో ఉన్నాను.

ఒక విధంగా దేశ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ఈ బ‌డ్జెట్ ఒక ముఖ్య‌మైన ముంద‌ంజ. ఇది కొత్త ఉద్యోగావ‌కాశాల‌ను సృష్టిస్తుంది. స‌క‌ల‌ విధాలా ఆర్థిక వృద్ధికి స‌హాయ‌ప‌డ‌టంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచ‌డంలో దోహ‌ద‌కారి కాగ‌ల‌దు. పౌరుల‌కు జీవ‌న నాణ్య‌త‌ను హామీ ఇవ్వ‌డం కోసం అత్యుత్త‌మ విద్య‌, ఆరోగ్య‌, గృహ స‌దుపాయాల క‌ల్ప‌న‌ను వ్య‌వస్థీక‌రించడం ఒక క‌స‌ర‌త్తు. అంటే కోశ సంబంధి లోటు పెర‌గ‌కుండా చూస్తూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కొనుగోలు శ‌క్తిని పెంచే కృషి అన్న‌మాట‌.

మ‌న దేశంలో మార్పు వేగాన్ని మ‌రింత పెంచే దిశ‌గా సాగుతున్న మా కృషిని ఈ బ‌డ్జెట్ ప్రతిబింబిస్తోంది. మ‌న‌ ఆకాంక్ష‌లు, స్వ‌ప్నాలతో ముడిప‌డి ఒక విధంగా మ‌న భ‌విష్య‌త్తును సూచిస్తోంది. ఒకరకంగా మ‌న కొత్త‌త‌రం భ‌విష్య‌త్తు. మ‌న రైతుల భ‌విష్య‌త్తు. భ‌విష్య‌త్తు (FUTURE) అనే పదానికి నా మదిలో ఉన్న అర్థ‌మేమిటంటే… ఎఫ్‌- ఫార్మ‌ర్ (రైతు). యూ- అండర్‌ ప్రివిలిజ్ డ్ (అణ‌గారిన వ‌ర్గాలు.. ద‌ళితులు, మ‌హిళ‌లు వ‌గైరా), టి- ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత)-టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ (సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి), యు- అర్బన్ రిజూవినేశన్ (పట్టణ పునరుజ్జీవం), ఆర్‌- రూరల్‌ డెవలప్‌మెంట్‌ (గ్రామీణాభివృద్ధి), ఇ- ఎంప్లాయ్ మెంట్ ఫ‌ర్ యూత్ (యువ‌త‌కు ఉపాధి), ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న, మెరుగుద‌ల‌ వంటివ‌న్న మాట‌. ఇవ‌న్నీ నవీన పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఉత్తేజాన్నిచ్చి, కొత్త ఉపాధి అవ‌కాశాల కల్పనకు మ‌రింత జోరును అందిస్తాయి. ఇటువంటి భ‌విష్య‌త్తును బ‌డ్జెట్‌లో ప్రదర్శించినందుకు ఆర్థిక మంత్రిని మరొక్క మారు అభినందిస్తున్నాను. ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాన్ని ఈ బ‌డ్జెట్ ముందుకు తీసుకువెళ్లగలుగుతుంద‌ని నేను నమ్ముతున్నాను. ఇది కొత్త విశ్వ‌స‌నీయ వాతావ‌ర‌ణాన్ని సృష్టించి, మ‌న జాతి కొత్త శిఖ‌రాల‌ను అధిరోహించ‌డానికి తోడ్ప‌డగలదు. అందుకే ఇటువంటి బ‌డ్జెట్‌ను అందించిన‌ ఆర్థిక మంత్రి గారికి, ఆయ‌న బృందానికి మ‌ళ్లీ మళ్లీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను.