ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత ప్రభుత్వ కార్యదర్శులందరితో సమావేశమయ్యారు. కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సంవత్సరం జనవరిలో కార్యదర్శుల బృందాలు ఎనిమిది ప్రధాన మంత్రికి సమర్పించిన నివేదికలకు సంబంధించి తదనంతర కార్యాచరణలో భాగంగా ఇంతవరకు జరిగిన పనిని గురించిన ఒక సంక్షిప్త వివరణను ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటరీ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఎనిమిది ప్రాతిపదికాపూర్వక బృందాలలోను రెండు బృందాల పక్షాన నివేదికలను సిద్ధం చేసిన వారు సైతం ఆయా బృందాల సిఫారసుల అమలు ఏ స్థాయిలో ఉన్నదీ సభకు తెలియజేశారు.
వేరు వేరు పరిపాలన అంశాలపైన నవంబరు నెలాఖరు కల్లా నివేదికలను దాఖలు చేసేందుకుగాను పది కొత్త కార్యదర్శి బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ఇతివృత్తాలపై కసరత్తు చేసిన పూర్వపు బృందాలతో పోలిస్తే, ఈ సారి ఏర్పాటయ్యే బృందాలు వ్యవసాయం, శక్తి, రవాణా వగైరా రంగాలపై శ్రద్ధ తీసుకోనున్నాయి.
కార్యదర్శులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జనవరిలో ఏర్పాటైన ఎనిమిది ప్రాతిపదికాపూర్వక బృందాలలో భాగంగా వారు చేసిన పనికిగాను వారిని అభినందించారు. వారు అధ్యయనం చేస్తున్న వారి వారి రంగాలలో కేంద్ర ప్రభుత్వం చేసిన పనిని విమర్శాత్మకంగా సమీక్షించవలసిందని ఆయన కోరారు. పరిశోధన సంబంధి అంశాలలో యువ అధికారుల సాయాన్ని తీసుకొమ్మని కూడా వారికి ఆయన సూచించారు.
జనాభాలో వయస్సుపరంగా ఉన్న ప్రయోజనాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలోని 800 మిలియన్ మంది యువతీయువకుల బలాలను ఉపయోగించుకోవడానికి అన్ని బృందాలు ప్రాముఖ్యం ఇచ్చితీరాలని స్పష్టంచేశారు. దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి కావలసిన సమష్టి వివేకం, అనుభవం భారత ప్రభుత్వ కార్యదర్శుల బృందానికి ఉన్నాయని ఆయన అన్నారు. కాగల కార్యాన్ని తీర్చడం కోసం వారంతా తమ అత్యుత్తమ శక్తియుక్తులను వినియోగం లోకి తేవాలని ఆయన ఉద్బోధించారు.