2015 a momentous year as world adopted 2 important frameworks- the SDGs & Paris Climate Agreement
Over the last two decades, the world and especially our region has undergone many changes– most of them positive: PM
Today, over thirty Asian countries have dedicated institutions leading disaster risk management efforts: PM Modi
All development sectors must imbibe the principles of disaster risk management: PM Modi
Work towards risk coverage for all–starting from poor households to SMEs to multi-national corporations to nation states: PM
We must encourage greater involvement and leadership of women in disaster risk management: PM
We should leverage technology to enhance the efficiency of our disaster risk management efforts: PM
Opportunity to learn from a disaster must not be wasted. After every disaster there are papers on lessons that are rarely applied: PM

వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులు,

లేడీస్ అండ్ జెంటిల్ మెన్,

విపత్తుల నష్టభయ తగ్గింపు కోసం సెందాయ్ ఫ్రేమ్ వర్క్ ను ఆమోదించిన తరువాత న్యూ ఢిల్లీ లో జరుగుతున్న ఈ మొట్టమొదటి చారిత్రక సదస్సులో పాల్గొంటున్న మీ అందరికీ ఇదే నా స్వాగతం.

ఆసియా- పసిఫిక్ ప్రాంతం లోని నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలు, ఆసియా- పసిఫిక్ ప్రాంత ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి, ఇంకా ఇతర స్టేక్ హోల్డర్స్ ఈ ముఖ్యమైన అంశం కోసం గుమికూడినందుకు ఇవే నా అభినందనలు.

మిత్రులారా,

2015 ఓ చిరస్మరణీయ సంవత్సరం. సెందాయ్ ఫ్రేమ్ వర్క్ కు ఆమోదముద్ర పడడంతో పాటు భవిష్యత్తులో మానవాళికి పూర్తి భద్రతను కల్పించేందుకు మరో రెండు ప్రధాన పథకాలను అంతర్జాతీయ సమాజం ఆమోదించింది. అవి:

-సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు,
– వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం

ఈ చిత్రంలో హైలైట్ చేసినట్లుగా.. అంతర్ అనుసంధాన స్పూర్తి అంతర్జాతీయ ఒప్పందాలకు అసలైన గుర్తు. ఇందులో ఒకదాని విజయం మరోదాని విజయంపై ఆధారపడి ఉంటుంది. స్థిరమైన అబివృద్ధికి, వాతావరణ మార్పు ఒప్పంద అమలులోనూ విపత్తు నష్టాన్ని తగ్గించడం కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సు సమయోచితమూ, సందర్భోచితమూ అవుతోంది.

మిత్రులారా,

గత రెండు దశాబ్దాల్లో ప్రపంచం ముఖ్యంగా మన ప్రాంతం ఎన్నో మార్పులను చూసింది. అందులో ఎక్కువ అనుకూలమైనవే. ఈ ప్రాంతంలోని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మార్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సాధనాలుగా మారాయి. కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురాగలిగాము. ఒక్క అంశంలో కాదు.. పలు అంశాల్లో ఏషియా-పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి మార్గదర్శిగా మారింది.

ఈ వృద్ధితో మనం సరిపెట్టుకోకూడదు. మన ముందు చాలా సవాళ్లూ ఉన్నాయి.
ఏషియా-పసిఫిక్ ప్రాంతంలో గడచిన ఇరవై ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాలకు 8 లక్షల 50 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యాల మరణాల పరంగా చూసుకుంటే ప్రపంచంలోని అగ్రగామి పది దేశాలలో ఏడు దేశాలు ఏషియా-పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నాయి. విపత్తుల కారణంగా బాధపడుతున్న వారిని నేను ప్రత్యక్షంగా చూశాను.

2001లో గుజరాత్ భూకంప విషాదాన్ని కళ్లారా చూశాను. ఆ తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూకంప విధ్వంసం నుంగా కోలుకోవడానికి నా ప్రజలతో కలిసి పనిచేశాను. వైపరీత్య ప్రభావ ప్రజల వేదనను చూడగవ అమిత దుఃఖాన్ని కలిగిస్తుంది. అయితే ఆ ప్రభావం నుండి కోలుకోవడానికి వారు చూపిన ధైర్యం నుండి, నేర్పు నుండి, సంకల్పం నుండి నేను స్పూర్తిని పొందాను. మనం ప్రజల నాయకత్వ లక్షణాలపై ఎంత ఎక్కువ ఆధార పడగలిగితే ఫలితం అంత బాగుంటుందనేది నా అనుభవం చెబుతోంది. వారి ఇంటిని తిరిగి నిర్మించుకునేందుకు వారిని ప్రోత్సహించడానికి ఇది పరిమితం కాదు. సామాజిక భవనాల
నిర్మాణానికీ ప్రోత్సహించాలి. ఉదాహరణకు మనం ఓ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించే బాధ్యతను ఓ వర్గానికి అప్పగిస్తే, సకాలంలో భూకంపాలను తట్టుకోగల భవన నిర్మాణం పూర్తి అవుతుంది. అదీ తక్కువ ఖర్చులోనే…అంతేకాదు మిగిలిన మొత్తం ప్రభుత్వానికి తిరిగి చేరుతుంది. ఆ తరహా చొరవ మరియు నాయకత్వాన్ని మనం విధానాలు, అనుసరణల ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

మిత్రులారా,

ఆసియాలో విపత్తుల ద్వారా మనం ఎంతో నేర్చుకున్నాము. పాతికేళ్ల క్రితం చాలా కొద్ది ఆసియా దేశాలే జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థలను కలిగి ఉండేవి.
ఈ రోజు, ముప్పైకి పైగా ఆసియా దేశాలు విపత్తు నిర్వహణ చర్యలకు అంకితమైన సంస్థలను కలిగి ఉన్నాయి. 2004లో హిందూ మహా సముద్రంలో సంభవించిన సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న ఐదు దేశాలు విప్తత్తు నిర్వహణలో కొత్త చట్టాలను తీసుకువచ్చాయి. మరో రెండు రోజులలో మనం మొదటి అంతర్జాతీయ సునామీ అవగాహన దినాన్ని జరుపుకోబోతున్నాము. ముందస్తు సునామీ హెచ్చరికల విషయంలో గణనీయమైన ప్రగతిని సాధించిన అంశాన్ని మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి. 2004 డిసెంబర్ లో హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించిన సమయంలో మనం సిద్ధంగా లేము. మనకు ముందస్తు హెచ్చరికలూ లేవు. ప్రస్తుతం మనకు హిందూమహా సముద్రంలో పూర్తి స్థాయి సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఉంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతో పాటు భారత సముద్ర సమాచార సేవా కేంద్రం ద్వారా ప్రాంతీయ సునామీ బులెటిన్ లను విడుదల చేయడం తప్పనిసరి చేశాము.

ముందస్తు తుపాను హెచ్చరికల విషయంలోనూ ఇదే రకమైన ప్రగతిని సాధించాము. భారతదేశాన్ని చూస్తే, 1999 మరియు 2013లో ఎదుర్కొన్న తుపాను ప్రభావాన్ని బట్టి మనం ఎంత ప్రగతిని సాధించామో అర్థం అవుతుంది. చాలా దేశాలలో ఇటువంటి అభివృద్ధే కనిపిస్తోంది. ఉదాహరణకు, 1991 తుపాను అనంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం సంఘపరమైన తుపాను సన్నద్ధత కార్యక్రమాలను భారీగా నిర్వహించింది. దీనివల్ల తుపాను సమయాల్లో మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సమర్ధ, అనుసరణీయ విధానంగా గుర్తించబడింది.

మిత్రులారా,

ఇది కేవలం ఆరంభం.. ముందుముందు చాలా కష్టమైన సవాళ్లు ఉన్నాయి. ఏషియా-పసిఫిక్ ప్రాంతంలో వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. బహుశా మరో దశాబ్ధంలో
ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా నివసిస్తారు.
పట్టణీకరణతో విపత్తు నివారణ నిర్వహణకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. విపత్తు సంభవించే అవకాశం గల ప్రాంతాల్లో ప్రజలపై దృష్టిపెట్టడం, ఆస్తి మరియు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపై దృష్టి సారించడం సవాలే. ఈ వృద్ధిని ప్రణాళిక రచనపరంగాను, అమలు పరంగాను మనం సరిగా నిర్వహించలేకపోతే విపత్తు సమయంలో జరిగే ప్రాణనష్టం, ఆర్థిక నష్టం గతంలో ఎన్నడూ చూడనంత అధికంగా ఉండే ప్రమాదం పొంచి ఉంటుంది.

ఈ నేపథ్యంలో, విపత్తుల మరియు నష్ట నివారణకు పది సూత్రాల కార్యక్రమ పట్టికను ప్రతిపాదిస్తున్నాను.

ఒకటోది, అన్ని అభివృద్ధి సూచికలు విపత్తు నిర్వహణ సూత్రాలకు అనుగుణంగానే ఉండాలి. విమానాశ్రయాలు, రహదారులు, కాలువలు, ఆసుపత్రులు, పాఠశాలలు, వంతెనలు… ఇలా ఏ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టినా ప్రకృతి విపత్తును దృష్టిలో పెట్టుకుని తదనుగుణమైన డిజైన్ ను ఎంచుకోవాలి. రాబోయే రెండు దశాబ్దాలలో, ప్రపంచంలో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ మన ప్రాంతంలోనే రాబోతున్నాయి. విపత్తు భద్రతాపరంగా నిర్మాణాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే తెలివైన వ్యూహం ఇది.

ప్రజలపై మనం ఖర్చు చేసే వ్యయం నష్టభయాలను పరిగణనలోకి తీసుకోవాలి,
భారతదేశంలో, ‘అందరికీ ఆవాసం’ పథకం మరియు ‘స్టార్ట్ సిటీస్’ వంటి ముందడుగులు అటువంటి అవకాశాలనే కల్పిస్తున్నాయి.

ఏషియా-పసిఫిక్ ప్రాంతంలో విపత్తు స్థితి స్థాపన మౌలిక సదుపాయాల ప్రోత్సాహానికి ఇతర స్టేక్ హోల్డర్లు, భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి ఓ కేంద్రంగా మారడానికి లేదా సంకీర్ణ వ్యవస్థ నిర్మించేలా భారతదేశం పనిచేస్తుంది. అపాయం న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డంలో కొత్త నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు, విప‌త్తును అడ్డుకొనే సాంకేతిక‌త‌, మౌలిక వసతుల ఆర్థిక నష్టాన్నితగ్గించుకొనే వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడుతుంది.

రెండోది… మారుమూల గ్రామంలోని ప్రతి ఇల్లు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు మొదలు చివరికి దేశ స్థాయి వరకు విపత్తు నివారణలో భాగస్వాములు కావాలి. ప్రస్తుతం, ఈ ప్రాంతంలోని చాలా దేశాల్లో బీమా అన్నది మధ్య తరగతి మరియు ఉన్నత మధ్య తరగతి ఆదాయ వర్గాలకు పరిమితమవుతోంది. దీని గురించి విశాలంగా మరియు వైవిధ్యంగా ఆలోచించాలి. బీమా నియంత్రణ అంశాలకే పరిమితం కాకుండా అవసరంలో ఉన్న వారికి చేరేలా ఇన్సూరెన్స్ విస్తృతి పెంచేలా ప్రోత్సాహక చర్యలను ప్రభుత్వాలు తీసుకోవలసి ఉంది. భారతదేశంలో పేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా, నష్ట బీమా అందేలా సాహసవంతమైన చర్యలు తీసుకొన్నాము. జన్ ధన్ యోజన లక్షల మందికి బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసింది. అవసరంలో ఉన్న లక్షల మందికి ఉపయోగపడేలా సురక్షబీమా యోజనను తీసుకువచ్చాము. కోట్ల మంది రైతులకు పంటనష్టం వాటిల్లినపుడు ఉపయోగపడేలా ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టాము. ఇవి కుటుంబ‌ స్థాయిలో నష్టం జ‌ర‌గ‌కుండా తోడ్ప‌డ‌ుతాయి.

మూడోది… విపత్తు నిర్వహణలో మహిళల భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. విపత్తుల బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే. వారికి ప్రత్యేకమైన బలం మరియు అంతర్దృష్టి ఉంటాయి. దీన్ని ఉపయోగించుకుని విపత్తు సమయాల్లో మహిళా బాధితులకు సహాయపడేలా పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలి. పునర్నిర్మాణంలో సహాయపడేందుకు మహిళా ఇంజినీర్లు, భవన నిర్మాణ నిపుణులు అవసరం. మరియు జీవనోపాధి పునరుద్థరణకు మహిళా స్వయం సహాయక బృందాలు అవసరం.

నాలుగోది.. ప్రపంచవ్యాప్తంగా రిస్క్ మ్యాపింగ్ లో పెట్టుబడులు పెట్టాలి. భూకంపం వంటి విపత్తుల మ్యాపింగ్ లో ప్రపంచవ్యాప్తంగా ఆమోదం తెలిపిన ప్రమాణాలు మరియు పరామితులు ఉన్నాయి. వీటి ఆధారంగా మేము భారతదేశంలో సైస్మిక్ జోన్స్ ను మ్యాపింగ్ చేశాము. ఐదు అనేది ప్రమాదకర తీవ్రతగా మరియు రెండు అనేది తక్కువ ప్రమాద తీవ్రతగా గుర్తించాము. రసాయన ముప్పు, దావానలాలు, తుపానులు మరియు రక రకాల వరదలు వంటి ముప్పులకు ప్రపంచ ఆమోదం తెలిపిన రిస్క్ కేటగిరీలను మనం సృష్టించాలి.
ప్రపంచంలోని భిన్నమైన ప్రాంతాల్లో ప్రకృతిని అర్థం చేసుకోవడంలోనూ మరియు విపత్తు తీవ్రతను గుర్తించడంలోనూ ఓ ఉమ్మడి అవగాహన తెచ్చుకొనేందుకు ఇది సహాయపడుతుంది.

ఐదోది.. విపత్తు నష్ట నిర్వహణ చర్యలలో సామర్ధ్యాన్ని పెంచడానికి సాంకేతిక విజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవాలి. ఉమ్మడి చర్యలను పెంచడం ద్వారా నైపుణ్య మార్పిడి, మరియు పరిజ్ఞానం మరియు వనరుల మార్పిడికి, సంస్థలను, వ్యక్తులను కలిపేందుకు ఓ ఇ-ప్లాట్ ఫామ్ ను తీసుకురావడానికి చేయాల్సింది ఎంతో ఉంది.

ఆరోది.. విపత్తు నిర్వహణ అంశాలపై కలిసి పనిచేసేలా విశ్వవిద్యాలయాల నెట్ వర్క్ ను అభివృద్ధి చేయాలి. విశ్వవిద్యాలయాలకు సామాజిక బాధ్యతలు కూడా ఉంటాయి. సెందాయ్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా … విపత్తు నిర్వహణ సమస్యలపై కలిసి పనిచేసేలా తొలి ఐదేళ్లలో మనం విశ్వవిద్యాలయాలతో అంతర్జాతీయ అనుసంధాన వేదికను ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగా, విపత్తు నిర్వహణ సమస్యల్లో తమ ప్రాంతానికి సరిపడే బహుళ అంశాల్లో విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయాలి. తీర ప్రాంతాల్లో నెలవైన విశ్వవిద్యాలయాలు తీర ప్రాంత విపత్తుల పైన, పర్వత ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కొండ ప్రాంత ముప్పుల పైనా నైపుణ్యాన్ని సాధించాలి.

ఏడోది.. సాంఘిక ప్రసార మాధ్యమాలు మరియు మొబైల్ సాంకేతిక విజ్ఞానం కల్పించే అవకాశాలను ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియాను విపత్తు స్పందన వేదికగా మార్చాలి. సహాయక సంస్థలు వేగంగా తమంత తాము స్పందించేందుకు మరియు పౌరులను అధికారులతో సులభంగా కలిపేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. విపత్తు సమయంలోను, విపత్తు తరువాత బాధితులు ఒకరికి మరొకరు సహాయం చేసుకోవడానికి సోషల్ మీడియా తోడ్పడుతుంది. సోషల్ మీడియా శక్తిని మనం గుర్తించాలి. విపత్తు నిర్వహణ అన్ని అంశాల్లో ఉపయోగపడే అప్లికేషన్స్ ను అబివృద్ధి చేయాలి.

ఎనిమిదోది.. స్థానికంగా సామర్థ్య వృద్ది మరియు చొరవపై దృష్టి సారించాలి. విపత్తు నిర్వహణ, ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇది చాలా కీలకం. ప్రభుత్వ సంస్థలు ఉత్తమంగా స్పందించేందుకు, పరిస్థితులు వేగంగా కుదుటపడేలా వ్యవహరించేందుకు ఇవి సహకరిస్తాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందించి స్థానికంగా వాటిని అమలు చేయాలి. గత రెండు దశాబ్ధాలుగా చాలా సంఘాల ప్రయత్నాలు విపత్తు సన్నద్ధతకు, స్వల్పకాలిక చర్యలకు పరిమితం అయ్యాయి. ప్రజాధారిత చర్యల పరిధిని పెంచాల్సి ఉంది. దీంతో పాటు , స్థానికంగా నష్టాన్ని పరిమితం చేసే చర్యలును గుర్తించడం మరియు వాటిని అమలు చేసేటట్లు ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల నష్టం తగ్గడమే కాకుండా స్థానికంగా అవకాశాల అభివృద్ధికి మరియు స్థిరమైన జీవనోపాధికి అవకాశం కలుగుతుంది. విపత్తు నివారణ చర్యలను స్థానికీకరణ చేయడం వల్ల సంప్రదాయ ఉత్తమ అనుసరణ మరియు దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. స్పందన సంస్థలు స్థానికులతో మాట్లాడాల్సి ఉంటుంది. విపత్తు స్పందన అభ్యాసాలపై వారికి అవగాహన కల్పించాలి. ఉదాహరణకు ఓ స్థానిక అగ్నిమాపక సిబ్బంది ప్రతి వారం తమ ప్రాంతంలోని ఓ పాఠశాలకు వెళ్తే ఒక్క సంవత్సరంలో వేల మంది చిన్నారులకు అవగాహన కల్పించిన వారవుతారు.

తొమ్మిదోది.. ఓ విపత్తు నుండి మనం నేర్చుకున్నది వృథా కాదని గుర్తించాలి. ప్రతి విపత్తు తరువాత దాని నుండి నేర్చుకున్న పాఠాలపై నివేదికలు, పత్రాలు సిద్ధం అవుతాయి. కానీ వాటిని అరుదుగా అనువర్తిస్తాము.. తరచుగా ఇలాంటి పొరపాట్లే దొర్లుతుంటాయి. నేర్చుకొనేందుకు మరింత బలమైన దృశ్య విధానం ఉండాలి. విపత్తు నిర్వహణ కార్యక్రమాలు, వాటి తీవ్రత మరియు నివారణ, పునరావాసం, పునర్నిర్మాణం మరియు తదనంతర వ్యవహారాలను చిత్రీకరించే కథారూపకాలపై ఓ పోటీని ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేయాలి.

విపత్తు తదనంతర పునరుద్ధరణ అనేది కేవలం భౌతికంగా మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడానికే పరిమితం కాకూడదు. ముప్పును ఎదుర్కొనే అభివృద్ధి చెందిన సమర్థ సంస్థాగత వ్యవస్థల నిర్మాణంలా ఉండాలి. ఇందుకోసం మనకు ముప్పును తక్షణం అంచనా వేసే వ్యవస్థలు కావాలి.

విపత్తు తదనంతర గృహాల పునర్నిర్మాణంలో సాంకేతిక సహకారం అందించే బహుళపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ఏర్పాటు కోసం భాగస్వామ్య దేశాలతో భారతదేశం కలిసి పనిచేస్తుంది.

చివరగా విపత్తులపై అంతర్జాతీయ స్పందనను ఒక‌ చోట‌ుకు చేరుస్తుంది. విప‌త్తు జ‌రిగిన త‌రువాత‌, ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌త్తు బృందాలు వెంట‌నే రంగంలోకి దిగుతాయి. మ‌న‌మంతా ఒకే గొడుగు కింద ప‌నిచేస్తే.. ఐక‌మ‌త్యంతో ఉమ్మ‌డి బ‌లం పెరుగుతుంది. ఐక్య‌రాజ్య‌స‌మితి ఈ దిశ‌గా ఒక ఉమ్మ‌డి లోగోను, బ్రాండింగ్‌ను రూపొందించాలి. దీని కింద అంద‌రికీ విప‌త్తుల‌ నుండి ఉప‌శ‌మ‌నం, పున‌రావాసం, పున‌ర్నిర్మాణంలో సాయం చేయాలి.

మిత్రులారా,

బయటి నుండి వచ్చే రక్షణపరమైన ముప్పు నుండి సైనిక బలగాలు దేశాన్ని కాపాడుతున్నాయి. అయితే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలంటే, సరైన అవగాహన ద్వారా సమాజాన్ని సన్నాహం చేయాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్య నిర్వహణలో ఏకీకృత సమాజ విధానాన్ని ప్రతిపాదిస్తున్న సెందాయ్ స్ఫూర్తిని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి.

భారతదేశంలో సెందాయ్ తీర్మానాన్ని అమలు చేసేలా విస్తృత చర్చకు మేము కట్టుబడి ఉన్నాము. సెందాయ్ తీర్మాన సూత్రాలను పాటిస్తూ ఈ ఏడాది జూన్ లో భారత జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేశాము.

మరింత సమర్థ విపత్తు నిర్వహణ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఏషియా- పసిఫిక్ దేశాలు భుజంభుజం కలిపి నడవాలి. మన ప్రయత్నాలు మరింత వేగంగా ముందుకెళ్లడంలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర పోషిస్తుంది.

గతేడాది నవంబర్ లో బారత్ తొలి దక్షిణ ఆసియా దేశాల విపత్తు నిర్వహణ అభ్యాసాన్ని నిర్వహించింది. ప్రాంతీయ సహకార స్పూర్తిలో భాగంగా భారతదేశం త్వరలో దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. ముప్పు అంచనా, ముప్పు ఉపశమనం మరియు సన్నద్ధత, స్పందన, మరియు కోలుకోవడం వంటి పూర్తిస్థాయి విపత్తు నిర్వహణ చక్రానికి
ఈ ఉపగ్రహ సామర్థ్యంతో పాటు ఇతర అంతరిక్ష ఆధారిత పరిజ్ఞానం కూడా ఉపయోగపడుతుంది. విపత్తు నిర్వహణ ప్రయోజనాల కోసం ఏ దేశమైనా అంతరిక్ష సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే అందుకు భారతదేశం సిద్ధంగా ఉంటుంది.

సెందాయ్ ఫ్రేమ్ వర్క్ ను అమలు చేస్తున్నందున, నూతన అవకాశాలు మరియు ప్రాంతీయ అంతర్జాతీయ సహకారాన్ని మేము ఆహ్వానిస్తున్నాము.

ఈ సమావేశం మన ప్రయత్నాలకు మరింత బలం చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సమావేశ ఫలితాలు ఉమ్మడి చర్యలు ఓ సమగ్ర ప్రణాళికకు మార్దనిర్దేశం చేస్తుందని భావిస్తున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు.