ప్ర‌ధాన‌ మంత్రిగా విధులలో త‌ల‌మున‌క‌ల‌య్యే, త‌ర‌చు ప్ర‌యాణాలలో గ‌డిపే శ్రీ న‌రేంద్ర మోదీ కి సినిమాలు చూసేటంత స‌మ‌యం ఉండ‌ద‌ని భావించ‌డం స‌హజం. దీనిపై శ్రీ మోదీ స్వ‌యంగా ఒక ఇంట‌ర్వ్యూలో ఇలా చెప్పారు.. ‘‘నాకు సినిమాల‌పై అంత‌గా ఆస‌క్తి లేదు. అయితే, యువ‌కుడుగా ఉన్న‌పుడు ఆ వ‌య‌స్సుకు స‌హ‌జ‌మైన ఉత్సుక‌త వ‌ల్ల సినిమాలు చూసే వాడిని. అయినప్ప‌టికీ కేవ‌లం వినోదం కోసం సినిమాలు చూడ‌డం అన్న‌ది నా స్వ‌భావం కాదు. ఆయా సినిమాలలో అంత‌ర్లీనంగా వ్య‌క్త‌మ‌య్యే జీవిత స‌త్యాల‌ను అన్వేషించ‌డం నాకు అల‌వాటు. నాకు గుర్తున్నంత‌వ‌ర‌కు ఒకసారి మా ఉపాధ్యాయులు, స్నేహితుల‌తో క‌ల‌సి శ్రీ ఆర్‌.కె.నారాయ‌ణ్ రాసిన న‌వ‌ల ఆధారంగా నిర్మించిన హిందీ చిత్రం ‘గైడ్’ చూసేందుకు వెళ్లాను. ఆ చిత్రం చూసిన త‌రువాత నా మిత్రుల‌తో లోతైన చ‌ర్చ‌లో పాల్గొన్నాను. అంతిమంగా ప్ర‌తి వ్య‌క్తికీ వారి అంత‌రాత్మ మార్గ‌నిర్దేశం చేస్తుంద‌న్న‌ది ఈ చిత్రం ఇతివృత్తమ‌ని నేను వాదించాను. అయితే, నేన‌ప్పుడు చాలా చిన్న‌వాణ్ని కాబ‌ట్టి నా మిత్రులు ఆ వాద‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు’’ అని.

‘గైడ్’ చిత్రం ఆయ‌న మ‌నోఫ‌ల‌కంపై మ‌రో విధమైన ముద్ర వేసింది- దుర్భ‌ర క‌రువులోని వాస్త‌విక‌త‌ రైతుల‌ను నిస్స‌హాయులుగా మార్చివేసే నీటి కొర‌తలను క‌ళ్ల‌కు క‌ట్టేలా చేసింది. ఆ త‌రువాతి జీవితంలో ఆయ‌న‌కు అవ‌కాశం ల‌భించ‌గానే గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌ల సంర‌క్ష‌ణ కోసం వ్య‌వ‌స్థీకృత యంత్రాంగం ఏర్పాటుకు త‌న ప‌ద‌వీకాలంలో అధిక శాతాన్నివెచ్చించారు. అదే విధంగా ఇప్పుడు ప్ర‌ధాన‌ మంత్రి పాత్ర‌లోనూ ఈ ప‌థ‌కాన్ని ఆయ‌న జాతీయ‌ స్థాయికి తెచ్చారు.

ఇప్పుడు శ్రీ మోదీ త‌న ప‌నిలో మునిగిపోయినందువ‌ల్ల‌, ప్ర‌ధాన‌ మంత్రిగా అత్యున్న‌త బాధ్య‌త‌లు ఉన్నందువ‌ల్ల వాటికే ఆయ‌న అగ్ర ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. కాబ‌ట్టి సినిమాలు చూడ‌గ‌లిగేటంత స‌మ‌యం ఆయ‌న‌కు ఇప్పుడు ల‌భించ‌డం దాదాపు అసాధ్యం. అయితే, క‌ళా-సాంస్కృతిక ప్ర‌పంచంతో ఆయ‌న నిరంత‌రం అనుసంధానంలో ఉంటారు. మ‌న కళాకారుల సాంస్కృతిక చైతన్యాన్ని ఎంతగానో గౌరవిస్తారు. గుజ‌రాత్‌లో గాలిప‌టాల పండుగ నిర్వ‌హణ నుండి ఇటీవ‌ల ఢిల్లీలో ఇండియా గేట్ స‌మీపాన రాజ‌్ ప‌థ్ ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో నిర్వ‌హించిన భార‌త్ ప‌ర్వ్ వంటివన్నీ ఆయ‌న వినూత్న ఆలోచ‌న‌ల‌కు అద్దం ప‌ట్టే కార్య‌క్ర‌మాలే.

మ‌రి మోదీకి ఇష్ట‌మైన పాట ఏదైనా ఉందా? దీనికి ఆయ‌న త‌క్ష‌ణ స్పంద‌న.. 1961నాటి ‘జై చిత్తోడ్’ చిత్రం కోసం గీత రచయిత శ్రీ భ‌ర‌త్ వ్యాస్ ర‌చించ‌గా సంగీత దర్శకుడు శ్రీ ఎస్‌.ఎన్‌. త్రిపాఠీ స్వరకల్పనలో ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆలాపించిన "ఓ ప‌వ‌న్ వేగ్‌సే ఉడ్‌నేవాలే ఘోడే..." (వాయువేగంతో ప‌రుగుతీసే అశ్వ‌మా) గీతమంటే ఆయ‌న‌కెంతో ఇష్టం. ఆ పాటలో ‘‘తేరే కంథోంపే ఆజ్ భార్ హో మేవాడ్‌కా, క‌ర్‌నా ప‌ఢేగా తుఝ్‌సే సామ్‌నా ప‌హాడ్‌కా, హ‌ల్దీ ఘాటీ న‌హీ హై కామ్ కోయీ ఖిల్ వాడ్‌కా, దేనా జవాబ్ వహా షేరోంకా దహాడ్ కా’’ (మేవాడ్ రాజ్యభారం నేడు నీ భుజస్కంధాలపైనే ఉంది, నీవు పర్వతాన్ని ఢీకొనబోతున్నావు. హ‌ల్దీ ఘాటీలో యుద్ధం ఉల్లాస క్రీడ ఏమీ కాదు, అక్కడ సింహ గర్జనలకు నీవు జవాబివ్వాల్సి ఉంది) అంటూ హ‌ల్దీ ఘాటీలో అక్బర్ సేనలతో యుద్ధానికి బయల్దేరిన మేవాడ్ రాజు శ్రీ మహారాణా ప్ర‌తాప్‌ను, ఆయన యుద్ధాశ్వాన్ని ఉద్దేశించి ఆలపించిన పంక్తులు శ్రీ మోదీ కి ఎంతో ప్రీతిపాత్రమైనవి.