ఒక గట్టి నాయకునిగా తాను ఉండి, తన బృందాన్ని వారి సామర్ధ్యం మేరకు నడిపించాలని, అలాగే వారిని ఉత్సాహపరచి అంతకంటే ఎక్కువ సాధించాలన్న ఆలోచనలో శ్రీ నరేంద్ర మోదీ ఉన్నారు.  అందువల్లే ఆయన బృందం ఏదైనా పనిలో విఫలమైనా శ్రీ మోదీ ఎప్పుడూ తన సహనాన్ని కోల్పోలేదు.

ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు శ్రీ మోదీ ఏ విధంగా పరిష్కరిస్తారు అనే దానికి..  2012 ఆగష్టు 31వ తేదీన జరిగిన ఒక సంఘటన ఎంతో ఆసక్తికరంగా ఉంది.  ఒక భారత రాజకీయ నాయకునితో గూగల్ బృందం మొట్టమొదటి సారిగా సమావేశం కావడమే ఆ సందర్భం.  అంతర్జాతీయంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో గూగుల్ సర్వర్లు క్రాష్ కావడంతో యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.  ప్రసారం పూర్తి అయినా తరువాత గూగల్ అంతర్జాతీయ బృందాన్ని మర్యాదపూర్వకంగా పలకరించడానికి మోదీ యొక్క కార్యాలయానికి వారిని ఆహ్వానించారు. ఇటువంటి పరిస్థితులలో  రాజకీయ నాయకులు సామాన్యంగా ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకుంటూ పరిపూర్ణమైన పనితనానికి మారుపేరుగా ఉన్న ఆయన ఏ విధంగా స్పందిస్తారోనని భయపడుతున్న బృందం చిరునవ్వుతో తమను ఆహ్వానించిన శ్రీ మోదీని చూడగానే ఆశ్చర్యానికి గురైంది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా సాంకేతిక పరంగా తీసుకోవలసిన చర్యల గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి మాత్రమే వారితో శ్రీ మోదీ చర్చించారు.

ఇది ఈ ఒక్క సంఘటనతోనే సరి కాదు.  ఎటువంటి పరిస్థితులలోనైనా సహనాన్ని వీడని శ్రీ మోదీ ప్రవర్తనే ఆయనతో తరచుగా మాట్లాడే వారికి ఎక్కువగా నచ్చే విషయం.   అదే ఆయనను వెన్నంటి ఉండే కీర్తి.  ఆయన ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించరు.  ఎవరైనా ఒక వ్యక్తి గాని, బృందం గాని తమ పనిని సకాలంలో నెరవేర్చలేకపోతే ఆ అనుభవాన్ని మరింత విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశంగా ఉపయోగించుకోవాలని ఆయన వారికి సలహా ఇస్తారు.  సవివరమైన ప్రణాళికను రూపొందించుకొని వచ్చే సారి దానిని అమలు చేయాలంటూ వారికి సూచిస్తారు.  నేర్చుకోవాలన్న వైఖరి మీలో ఉన్నంత కాలం శ్రీ మోదీ మీ వెన్నంటి ఉంటారు.