నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ ఎ డి) ఏర్పాటుకు, ఆ సంస్థ కార్యకలాపాల ఆరంభానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. డిజిటల్ ఇండియాలో మరొ కొత్త కోణాన్ని ఆవిష్కరించి, డిజిటల్ ఇండియా విజన్ పరిధిని పెంచడం ఈ నిర్ణయం లోని ముఖ్య ఉద్దేశం.
2017-18 విద్యాసంవత్సరం నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ఎన్ ఎ డి వచ్చే మూడు నెలల్లో ఏర్పాటై, తన కార్యకలాపాలను ఆరంభిస్తుంది.
పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సర్టిఫికెట్లు, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇచ్చే అవార్డులను భద్రంగా దాచిపెట్టేందుకు సెక్యూరిటీస్ డిపాజిటరీ తరహాలో డిజిటల్ డిపాజిటరీని స్థాపించగలమని 2016-17 బడ్జెట్టు ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నాడించారు.
సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చట్టం, 1992 ప్రకారం రిజిస్టరైన ఎన్ ఎస్ డి ఎల్ డాటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, సి డి ఎస్ ఎల్ వెంచర్స్ లిమిటెడ్ లు ఎన్ ఎ డి కార్యాచరణను పర్యవేక్షిస్తాయి.
ఈ వ్యవస్థలోకి అధికారికంగా సమాచారాన్ని అప్‌లోడ్ చేసే విద్యాసంస్థలే ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎన్ ఎ డి లోని డాటా సరళతను డిపాజిటరీలు చూసుకుంటాయి. విద్యాసంస్థలు, బోర్డులు, అర్హత నిర్ధారణ సంస్థలు, విద్యార్థులు, బ్యాంకులు, ఉద్యోగాలిచ్చే కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు వంటి ఇతర ధ్రువీకరణ సంస్థలు ఎన్ ఎ డి లో రిజిస్టర్ కావాలి.
ఇది విద్యార్థులు, ఇతర అధీకృత వినియోగదారుల సెక్యూరిటీ ఫీచర్ల ఆధారంగా ప్రింటెడ్ కాపీ లేదా డిజిటల్ కాపీని అందిస్తుంది. అధీకృత వినియోగదారుల కోరిక మేరకు అకడమిక్ అవార్డులను కూడా ఎన్ ఎ డి ఆన్‌లైన్ లో ధ్రువపరుస్తుంది.
అకడమిక్ అవార్డులు, ఇతర సమాచారాన్ని (ఉదాహరణకు ఉద్యోగమిచ్చే కంపెనీలు, విద్యాసంస్థలకు) విద్యార్థి కోరిక మేరకు ఎన్ ఎ డి అందిస్తుంది. ఎన్ ఎ డి తన వద్దనున్న డాటాబేస్‌పై విశ్వసనీయత, నిజాయితీ, గోప్యతను పాటిస్తుంది. దీంతోపాటు విద్యాసంస్థలు, బోర్డులు, అర్హత నిర్ధారణ సంస్థలు ఈ విషయంలో తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఎన్ ఎ డి శిక్షణనిస్తుంది.