శ్రీ నరేంద్ర మోదీ 2014 మే నెల 26వ తేదీన భారతదేశ ప్రధాన మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జన్మించి ప్రధాన మంత్రి అయిన మొదటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ.  క్రియాశీలం గల, అంకితభావం కలిగిన, నిశ్చితమైన అభిప్రాయాలున్న శ్రీ నరేంద్ర మోదీ బిలియన్ పైగా భారతీయుల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం.  

2014 మే నెలలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రతి భారతీయుని ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఆయన తమ ప్రయాణాన్నికొనసాగిస్తున్నారు.  వరుస లో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా సేవ చేయాలనే "అంత్యోదయ" సూత్రం నుండి ఆయన బాగా స్ఫూర్తి పొందారు.  

వినూత్న ఆలోచనలు, కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చక్రాలు వేగంగా కదులుతున్నట్లు,  అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క పౌరునికీ అందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వ పనితీరు సులువుగా, పారదర్శకంగా మారింది.

ముందుగా, ప్రధాన మంత్రి జాన్ ధన్ యోజన తో పెద్ద మార్పు వచ్చింది.  ప్రతి పౌరుడు దేశ ఆర్ధిక విధానంలో ఒక భాగం అయ్యాడు.  ఆయన పిలుపునిచ్చిన “మేక్ ఇన్ ఇండియా” ఒక శంఖారావంలా పెట్టుబడిదారులూ, పారిశ్రామికవేత్తలను ఉత్తేజపరిచింది.  ‘శ్రమయేవ జయతే’ కార్యక్రమం కింద శ్రామిక సంస్కరణలు, కార్మిక గౌరవం కోసం చేపట్టిన చర్యలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలలోని కార్మికులకు సాధికారితను కల్పించాయి. నైపుణ్యం కలిగిన మన యువజనులకు కొత్త ఉత్సాహాన్ని కూడా ఇచ్చింది.  

ముందుగా, భారతదేశ ప్రజల కోసం మూడు సామాజిక భద్రతా పధకాలను భారతదేశ ప్రభుత్వం ప్రారంభించింది.  అలాగే, వృద్దుల కోసం పింఛను పథకం పేదవారికి బీమా వర్తింపుపైన కూడా దృష్టి పెట్టింది. ప్రజల జీవితాల్లో నాణ్యతతో కూడిన మార్పు తీసుకురావడానికి సాంకేతిక విజ్ఞానం ప్రధాన పాత్రను పోషించే డిజిటల్ ఇండియా మిషన్ అనే పధకాన్ని ప్రధాన మంత్రి 2015 జూలై నెలలో ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా శుభ్రత కోసం స్వచ్ఛ భారత్ మిషన్ అనే ఒక భారీ ఉద్యమాన్ని మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రధాన మంత్రి ప్రారంభించారు.  పరిమాణం, ప్రభావం దృష్ట్యా ఇది ఒక చరిత్రాత్మక కార్యక్రమం.

శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన విదేశాంగ విధానం చర్యల ద్వారా భారతదేశ నిజమైన శక్తికి గుర్తింపు వచ్చింది.  ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం పాత్రకు ప్రపంచ పటంలో స్థానం లభించింది. సార్క్ దేశాధినేతల సమక్షంలో ఆయన తన పదవీ కాలాన్ని ప్రారంభించారు.  ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన చేసిన ప్రసంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది.  17 సంవత్సరాల తరువాత నేపాల్ లో ద్వైపాక్షిక పర్యటన జరిపిన మొదటి భారతీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.  అదే విధంగా 28 సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియాలో, 31 సంవత్సరాల తర్వాత ఫిజీ లో, 34 సంవత్సరాల తరువాత సెశెల్స్ లో భారత దేశం తరఫున శ్రీ నరేంద్ర మోదీ పర్యటించారు. శ్రీ నరేంద్ర మోదీ తాను పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, సార్క్, జి-20 సదస్సులకు హాజరయ్యారు.  ఆయా వేదికలపై వివిధ అంతర్జాతీయ, ఆర్ధిక, రాజకీయ విషయాలపై భారతదేశం జోక్యం, స్పందన, అభిప్రాయాలకు విస్తృతంగా ప్రశంసలు లభించాయి.  ఆయన జపాన్ పర్యటన భారతదేశం, జపాన్ ల సంబంధాల నూతన శకంలో ఒక చిరస్మరణీయ అధ్యయనానికి తెర లేపింది.

 మంగోలియా సందర్శించిన మొదటి భారతదేశ ప్రధాన మంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ నిలిచారు.  భారతదేశానికి పెట్టుబడులు తీసుకురావడంలో  ఆయన చైనా, దక్షిణ కొరియా పర్యటనలు విజయవంతమయ్యాయి.  ఫ్రాన్స్, జర్మనీ ల పర్యటన లో ఆయన యూరోప్ సంబంధాలను  కొనసాగించారు.  

అరబ్ ప్రపంచంతో గట్టి సంబంధాలకు శ్రీ నరేంద్ర మోదీ గొప్ప ప్రాధాన్యమిచ్చారు.  2015 ఆగస్టులో ఆయన యుఎఇ పర్యటన 34 సంవత్సరాలలో ఒక భారతదేశ ప్రధాన మంత్రి చేసిన మొదటి పర్యటన. ఈ పర్యటన గల్ఫ్ తో భారతదేశ ఆర్ధిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి గట్టి పునాది వేసింది.  2015 జూలై లో శ్రీ మోదీ ఐదు మధ్య ఆశియా దేశాల్లో పర్యటించారు.  ఇది ఒక రికార్డు.  ఈ సందర్భంగా విద్యుత్తు, వాణిజ్యం, సంస్కృతి, ఆర్ధిక వంటి రంగాలలో ఈ దేశాలకు, భారతదేశానికి మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.  చరిత్రాత్మకమైన భారత్ ఆఫ్రికా సదస్సు 2015 అక్టోబర్ లో న్యూ ఢిల్లీ లో జరిగింది.  ఇందులో 54 ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయి.  41 ఆఫ్రికా దేశాల నాయకులు ఈ సదస్సుకు హాజరై భారత ఆఫ్రికా సంబంధాలు మరింత బలపడాలనే అంశంపై విస్తృతంగా చర్చలు జరిపారు.  ఈ సదస్సుకు హాజరైన ఆఫ్రికా నాయకులతో ప్రధాన మంత్రి తానే స్వయంగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.  

2015 నవంబర్ లో ప్యారిస్ లో జరిగిన సిఒపి 21 సదస్సులో ప్రధాన మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన అనేక మంది ప్రపంచ నాయకులను కలిసి వాతావరణ మార్పు అనే అంశంపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ తో కలిసి శ్రీ మోడీ ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ ను  ప్రారంభించారు.  దీని ద్వారా సూర్యకాంతి తో గృహాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు.  

2016 ఏప్రిల్ లో ప్రధాన మంత్రి పరమాణు భద్రత సదస్సు కు హాజరయ్యారు.  అక్కడ ప్రపంచ వేదికపై ఆయన పరమాణుభద్రత ప్రాముఖ్యం గురించి ఒక పటిష్టమైన సందేశం ఇచ్చారు.  ఆయన సౌదీ అరేబియాలో పర్యటించారు.  అక్కడ శ్రీ మోదీని "సౌదీ అరేబియాలోని అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించారు.  

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ టోనీ అబాట్, చైనా అధ్యక్షుడు శ్రీ శి జిన్ పింగ్, శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ మైత్రీ పాల సిరిసేన, రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ లతో సహా పలువురు ప్రపంచ నాయకులు భారతదేశంలో పర్యటించారు.  వీరి పర్యటనలు భారతదేశానికి, ఆయా దేశాల మధ్య సహకారం పెంపొందించుకొనే పరిణామక్రమంలో విజయం సాధించాయి. భారతదేశం, అమెరికా సంబంధాల చరిత్రలో మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా 2015 లో భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  2015 ఆగష్టు లో భారత్ ఎఫ్ఐపిఐసి  సదస్సుకు ఆతిధ్యం ఇచ్చింది.  ఆ సదస్సుకు పసిఫిక్ దీవుల నుండి అగ్ర నాయకులు హాజరయ్యారు.  ఆ సదస్సులో పసిఫిక్ దీవులతో భారతదేశ సంబంధాలకు చెందిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి.  

ఒక రోజును "అంతర్జాతీయ యోగా దినోత్సవం" గా గుర్తించాలన్న శ్రీ నరేంద్ర మోదీ శంఖారావం లాంటి పిలుపునకు ఐక్యరాజ్యసమితి లో అనూహ్యమైన స్పందన లభించింది.  జూన్ 21వ తేదీని "అంతర్జాతీయ యోగా దినోత్సవం" గా ప్రకటించాలన్న ప్రతిపాదనకు ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు ముక్తకంఠంతో ఆమోదం తెలిపాయి.  

1950 సెప్టెంబర్ 17వ తేదీన గుజరాత్ లోని ఒక చిన్న పట్టణంలో ఒక రూపాయి కూడా మిగులు లేకపోయినా, ప్రేమాభిమానాలకు లోటు లేని ఒక పేద కుటుంబంలో నరేంద్ర మోదీ జన్మించారు.  ఆయన జీవిత ప్రథమాంకంలో ఎదురైన కష్టాలు ఆయనకు కష్టపడి పనిచేయడంలోని విలువను తెలియజెప్పడంతో పాటు సామాన్య ప్రజలు తప్పించుకోగలిగిన బాధలపై అవగాహన కలిగించాయి.  అదే ఆయననను అతి పిన్న వయస్సులోనే ప్రజల సేవ, దేశ సేవ  చేయాలనే ఆలోచన వైపునకు మళ్లించింది.  

తొలి దశలో ఆయన దేశ నిర్మాణం కోసం అంకితమైన జాతీయ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో పనిచేశారు.  ఆ తరువాత తనకు తానుగా రాజకీయాలకు అంకితమై, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లలో పనిచేస్తున్నారు.  శ్రీ మోదీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో ఎమ్.ఎ. పూర్తి చేశారు.

2001 సంవత్సరంలో ఆయన తన స్వంత రాష్ట్రమైన గుజరాత్ కు ముఖ్యమంత్రి అయ్యారు.   ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు రాష్ట్రానికి సేవ చేసి, రికార్డు సృష్టించారు.  విధ్వంసకర భూకంపంతో అతలాకుతలమైన గుజరాత్ ను ఆయన పునర్నిర్మించారు.  భారతదేశ అభివృద్ధిలో గుజరాత్ ను పటిష్టమైన భాగస్వామిగా చేశారు.

శ్రీ నరేంద్ర మోదీ ప్రజల నాయకుడు.  వారి సమస్యలు పరిష్కరిస్తూ వారి అభ్యున్నతికి పాటు పడే అంకితభావం గల నాయకుడు.  ప్రజల మధ్య మెలగడం కంటే ఆయనకు తృప్తిని ఇచ్చే విషయం ఏదీ లేదు.  ప్రజల సంతోషాన్ని పంచుకొంటూ, వారి కష్టాలను తీర్చడమే ఆయన పని.  ప్రజలతో క్షేత్ర స్థాయిలో శక్తివంతమైన వ్యక్తిగత సంబంధాలు ఒక పటిష్టమైన "ఆన్ లైన్" వ్యవస్థ ద్వారా మరింత బలపడడానికి దోహదం చేస్తున్నాయి. భారతదేశపు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంగల నాయకునిగా ఆయన అందరికీ తెలుసు.  అంతర్జాలం ఉపయోగం ద్వారా ప్రజలతో మమేకమై, వారి జీవితాలలో మార్పును తీసుకువస్తున్నారు.  ఫేస్ బుక్, ట్విటర్, గూగల్ ప్లే, ఇన్ స్టాగ్రామ్, సౌండ్ క్లౌడ్, లింక్ డ్ ఇన్, వెబో ల వంటి ఇతర సామాజిక మాధ్యమాలపై ఆయన ఎంతో చురుకుగా స్పందిస్తూ ఉంటారు.

రాజకీయాల కంటే రచనా వ్యాసంగాన్ని శ్రీ నరేంద్రమోదీ ఎక్కువగా ఆనందిస్తారు.  పద్య కవిత్వంతో సహా ఆయన అనేక పుస్తకాలను రచించారు.  ఆయన తమ దైనందిన జీవితాన్ని యోగా తో ప్రారంభిస్తారు. అది ఆయన మనస్సును, శరీరాన్ని కేంద్రీకరిస్తుంది.  ఎంతో వేగంగా పరుగులు తీసే దినచర్యలో అది ప్రశాంతతను నింపుతుంది.

ఆయన ధైర్యం, కరుణ, విస్వాసం మూర్తీభవించిన వ్యక్తి.  భారతదేశంలో చైతన్యం నింపి, ప్రపంచానికి దారి చూపే ఒక ఉజ్జ్వల శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దగలరనే నమ్మకంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు.